Home దునియా దొరికిన దొంగ

దొరికిన దొంగ

Harivillu-Story

తెలుగువారికి బాగా పరిచయం ఉన్నవాడు మర్యాద రామన్న. తెలివితేటలకు ఆయన కేరాఫ్ అడ్రస్. ఆయనలాగా మనిషి సైకాలజీ తెలిసి సమస్యలు పరిష్కరించగలిగినవాడు తెలుగునాట మరొకరు లేరంటే అతిశయోక్తికాదు. తెనాలి రామలింగడు కూడా తెలివిగా వ్యవహరించిన సందర్భాలున్నా ఆయన ధోరణిలో హాస్యం ఉంటుంది. మర్యాదరామన్నలో హాస్యం ఉండదు. సమయానికి తగిన తెలివితేటలు కనబడతాయి. దాన్నే సమయస్ఫూర్తి అంటాం. అంటే అదెలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.

ఒకసారి మర్యాదరామన్న దగ్గరికి నలుగురు అన్నదమ్ములు వచ్చారు. తండ్రి సంపాదించిన ఆస్తిని సమానంగా పంచుకోవడంలో తేడాలు రావడంతో వారు మర్యాదరామన్న వద్దకు వచ్చారు. మా తండ్రిగారు మరణించే సమయానికి కొద్దిగా నగదు నాలుగు వజ్రాలు సంపాదించాడు. ఆ సొమ్మును, సొత్తును మా అమ్మదగ్గర ఉంచాడు. ఎప్పుడు డబ్బు అవసరమైతే అప్పుడు అమ్మని అడిగి ఆ సొమ్ము తీసుకుని సమానంగా పంచుకోండి. అవసరానికి చక్కగా వాడుకోండి అన్నాడు. కొంత కాలం పోయాక అందరికీ డబ్బు అవసరం వచ్చింది. మా అమ్మదగ్గరకు వెళ్ళి మా నాన్న దాచిన డబ్బు మూట తెచ్చే బాధ్యత మా చిన్న తమ్ముడికి అప్పగించాం. ఆమె కూడా డబ్బుమూటను అలాగే చేతిలో పెట్టి జాగ్రత్తగా వాడుకోండి నాయనా అని చేతిలో పెట్టింది.

మా నాన్నగారు చెప్పిన ప్రకారం ఆ మూటలో నాలుగు వజ్రాలుండాలి. ఆ మూటను విప్పనైనా విప్పలేదు కనుక మా అమ్మ తీసే అవకాశమేలేదు. తీరా మూటవిప్పి చూస్తే వజ్రాలు మూడే ఉన్నాయి. అదేమని అడిగితే అంతే ఉన్నాయంటున్నాడు చిన్నోడు. మాకు మీరే న్యాయం చేయాలి రామన్నగారూ అంటూ వేడుకున్నారు. రామన్న ఒక్కసారి అందరి ముఖాలలోకి చూశాడు. చిన్నవాడి ముఖంలో కొద్దిపాటి కంగారు కనిపించింది. కానీ లేనిపోని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. రామన్నకు అర్థమైంది కానీ బైటికి ఏమీ చెప్పలేదు. ఒక పెద్ద కర్రనొకదాన్ని తెప్పించాడు. ఇది మంత్రాల మారి కర్ర. ఇదే మీలో దొంగ ఎవరో తేల్చేచేస్తుంది అంటూ దాన్ని నాలుగుముక్కలు చేశాడు.

అందరికీ తలా ఒక కుండ ఇచ్చి ఒకొక్క కర్రముక్క ఒకొక్క కుండలో వేశాడు. చెరువుకెళ్ళి ఎవరి కుండలో వాళ్ళు నీళ్లు తీసుకురమ్మన్నాడు. కుండ నింపుకున్నాక కర్రను నీళ్ళలో వేసి కాసేపు నాననిచ్చి తీసుకురండి..ఎవరు వజ్రాన్ని దొంగతనం చేశారో వారి కర్రనాని పెద్దదవుతుంది అని చెప్పాడు. సరే అని అంతా రామన్న చెప్పినట్టే చెరువుకు వెళ్ళి కుండలో నీళ్ళు నింపుకున్నారు. ఆ నీటిలో కర్రముక్క వేసి కాసేపు నాననిచ్చి రామన్న దగ్గరకు బయల్దేరారు. వజ్రాన్ని దొంగతనం చేసిన చిన్నోడు తన కర్ర పెరిగిపెద్దదై దొరికిపోతానేమోనని భయపడి తన కుండలో ఉన్న కర్రముక్కను విరిచి చిన్నది చేశాడు. నాని పెరిగినా ఇప్పుడున్న సైజుకే వస్తుందని సంతోషించి రామన్న దగ్గరకు వచ్చాడు. అందరి కుండలు చూసిన రామన చిన్నోడే దొంగ అని నిర్ధారించాడు. ఇది చాలా అన్యాయమని అరిచాడు చిన్నోడు. ఎందుకు అన్యాయం? అడిగాడు రామన్న.

నన్ను దొంగ అని ఎలా నిర్ణయించారు? అడిగాడు చిన్నోడు. నేను మీకిచ్చిన కర్రలో ఏ మంత్రమూలేదు మహిమాలేదు. అది నీళ్ళలో నాని పెద్దదవుతుందనగానే అసలు దొంగ ఉలికిపడ్డాడు. తన కర్రముక్క పెరిగిపోకూడదని విరిచేశాడు. ఇప్పుడేమైంది? అందరి కర్రలు నేనిచ్చినట్టే ఉన్నాయి. అసలు దొంగ కర్రముక్క మాత్రం సగమైంది. దీన్నిబట్టి దొంగ ఎవరో తేలిపోలేదా? అని అన్నాడు రామన్న. జరిగినదానికి చింతించి చిన్నోడు తన నేరాన్ని అంగీకరించాడు.