Home తాజా వార్తలు పెళ్లింట విషాదం.. నలుగురి మృతి

పెళ్లింట విషాదం.. నలుగురి మృతి

Electric-Shock

యాదాద్రి భువనగిరి : పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లయిన రెండవ రోజే విద్యుదాఘాతంతో పెళ్లి కుమారుడు, అతడి తల్లిదండ్రులు, మేనత్తతో సహా నలుగురు ఒకేసారి మృతి చెందారు. విస్తుగొలిపే ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి పురపాలిక కేంద్రం పరిధిలోని ముఖ్తాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. చిందం సాయిలు తన కుమారుడికి రేవణపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో ఈనెల 19న వివాహం జరిపించాడు. పెళ్లి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పెళ్లికుమార్తె ఇంట్లో శుభకార్యం ముగించుకొని తిరిగి ముక్తాపూర్ గ్రామానికి చేరుకున్నారు. పందిట్లో విద్యుత్ బల్బులకు వేసిన తీగ ఇనుప స్తంభానికి తగిలించారు. అదే ఇనుప స్తంభానికి బట్టలు ఆరేయడానికి తీగను కట్టారు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ నుండి స్తంభానికి విద్యుత్ సరఫరా జరిగింది.

పెళ్లికుమారుడి తల్లి అదే తీగపై బట్టలు ఆరవేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఒక్కోక్కరిగా అందరూ పట్టుకోవడంతో వారంతా విద్యుదాఘాతానికి గురయ్యారు. పెళ్లికుమారుడు చిందం ప్రవీణ్(22), పెళ్లికుమారుడి తల్లిదండ్రులు చిందం సాయిలు(55), గంగమ్మ(50), వలిగొండ మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన పెళ్లికుమారుడి మేనత్త గంగమ్మ(48)లు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందారని వైద్యులు ధృవీకరించినట్లు గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపారు. మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

Four Died With Electric Shock in Yadadri District