Home జాతీయ వార్తలు రాజ్యసభకు ప్రముఖుల నియామకం

రాజ్యసభకు ప్రముఖుల నియామకం

Rajya-Sabha

న్యూఢిల్లీ : వివిధ రంగాల ప్రముఖులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేశారు. మాజీ ఎంపి రామ్ షకాల్, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త రాకేష్ సిన్హా, శాస్త్రీయ నృత్య కళాకారిణి సోనాల్ మాన్‌సింగ్, రాతిశిల్ప కళాకారుడు రఘునాథ్ మెహాపాత్రల పేర్లను ఎగువ సభ సభ్యులుగా నియమించారు. ప్రధాని నరేంద్ర మోడీ సిఫార్సులు, సలహాల మేరకు వీరి పేర్లను రాష్ట్రపతి ప్రకటించినట్లు ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి.

రామ్ షకాల్ ప్రముఖ ప్రజానాయకులు

ఉత్తరప్రదేశ్ నుంచి రామ్ షకాల్ ప్రజా ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన ప్రముఖ ప్రజానేత. దళితుల సంక్షేమం అభ్యున్నతి కోసం ఆయన తన జీవితా న్ని అంకితం చేశారు. రైతు నేత కూడా అయిన షకాల్ రైతాంగ, కార్మిక, వలస కూలీలు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమించారు. అంతేకాకుండా మూడు సార్లు యుపిలోని రాబర్ట్‌గంజ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. వివిధ కోణాలలో రామ్ సేవలను పరిగణనలోకి తీసుకుని రాజ్యసభకు ఎంపిక చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

విధాన నిపుణుడు ఆర్‌ఎస్‌ఎస్ వాది రాకేష్

రాజ్యసభకు ఎంపికైన రాకేష్ సిన్హా ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త, ఢిల్లీకి చెందిన విశ్లేషణా వేదిక ఇండియా పాలసీ ఫౌండేషన్ గౌరవ సంచాలకులు. ఢిల్లీ వర్శిటీకి చెందిన మోతీలాల్ నెహ్రూ కాలేజీ ప్రొఫెసర్. అంతేకాకుండా భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధక మండలి (ఐసిఎస్‌ఎస్‌ఆర్) సభ్యులు.

రాతికి జీవకళల మొహపాత్ర

రఘునాథ్ మోహపాత్ర అంతర్జాతీయ శిల్పి. రాళ్లను తొలిచి శిల్పాలుగా మలచడంలో ప్రాచుర్యం పొందారు. 1959 నుంచి శిల్పిగా ఉన్నారు. 2వేల మందికి పైగా శిష్యులకు ఈ కళలో తర్ఫీదు ఇచ్చారు. పూరీలోని జగన్నాథ దేవాలయ సుందరీకరణ పనులలో పాలుపంచుకున్నారు. సాంప్రదాయక శిల్పకళను పరిరక్షిస్తూ వస్తున్నారు. పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లోని సూర్యుడి సైకత శిల్పం ఆయన సృష్టినే. పారిస్‌లోని కర్రతో రూపొందించిన బుద్ధుడి విగ్రహం కూడా ఆయన కళాత్మక సృష్టిగా నిలిచింది.

నాట్యమయూరం సోనాల్

భారతీయ శాస్త్రీయ నృత్యకళాకారిణిగా సోనాల్ మాన్‌సింగ్ పేరు తెచ్చుకున్నారు. ఆరు దశాబ్దాలుగా భరతనాట్యం, ఒడిసీ నృత్యాలను ప్రదర్శిస్తున్నారు. ఆమె ప్రముఖ కోరియోగ్రాఫర్‌గా, అధ్యాపకురాలిగా, సామాజిక కార్యకర్తగా పేరొందారు. ఢిల్లీలో ఆమె 1977లో భారతీయ శాస్త్రీయ నృత్య కళల కేంద్రాన్ని స్థాపించారు. ఎందరో ఔత్సాహికులకు నృత్యంలో శిక్షణ ఇస్తూ వస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1) ఎ మేరకు రాష్ట్రపతి శాస్త్రం, సాహిత్యం, కళలు, సామాజిక సేవలు వంటి వివిధ రంగాలలో ప్రతిభావంతులైన 12 మందిని ఎగువ సభకు సభ్యులుగా ఎంపిక చేసే విస్తృత అధికారం ఉంది. ఇప్పటివరకూ ఈ కోటాలో ఎనిమిది మంది సభ్యులు వివిధ రంగాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఉన్న నాలుగు ఖాళీలను శనివారం భర్తీ చేశారని అధికార వర్గాలు తెలిపాయి.