Home రాష్ట్ర వార్తలు చెరువులో దూకి నలుగురు ఆత్మహత్య

చెరువులో దూకి నలుగురు ఆత్మహత్య

ps

భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు జలసమాధి
మేడ్చల్ జిల్లా కీసరలో విషాదం

కీసర: మేడ్చల్ జిల్లా కీసరలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పెద్దమ్మ చెరువు లో దూకి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు చిన్నారులతో సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఘట్‌కేసర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మలిపడిగ రమేష్ (30)కు శామీర్ పేట మండలం ఉద్దమర్రి గ్రామానికి చెంది న మానస (22)తో గత మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి గీతాశ్రీ(2), మనశ్రీ(6 నెలలు) పిల్లలు ఉన్నారు. రమేష్ వ్యవసాయం చేసుకుంటూ పాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. రమేష్ సోమవారం తల్లిదండ్రులతో గొడవపడి సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో భార్య పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వారి కోసం బంధువుల వద్ద వాకబు చేసినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం ఉదయం కీసరలోని పెద్దమ్మ చెరువు వద్ద రమేష్ స్కూటర్ వాహనం గమనించిన అతని బందువులు కీసర పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సురేందర్ గౌడ్ తన బృందంతో చెరువు వద్దకు చేరుకొని పరిశీలించగా చెరువు ఒడ్డున మూడు జతల చెప్పులు పడి ఉండటం గుర్తించి చెరువులో గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న రమేష్ కుటుంబ సభ్యులు, బందువులు, గ్రామస్తులు భారీగా చెరువు వద్దకు చేరుకున్నారు. వారి రోదనలతో పెద్దమ్మ చెరువు పరిసరాలు శోక సంద్రంగా మారాయి. కొన్ని గంటల వ్యవధిలో మృతదేహాలు ఒక్కొక్కటిగా నీటిపై తేలియాడుతూ కనిపించాయి. రమేష్‌తో పాటు గీతాశ్రీ మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకు రాగా చెరువు మధ్యలో ఉన్న తల్లి కూతుళ్ల మృతదేహాలను సీఐ సురేందర్ గౌడ్ తన సిబ్బందితో కలిసి స్వయంగా బయటకు తెచ్చారు. మృతదేహాలను చూసిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు పగిలేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అభం శుభం తెలియని చిన్నారుల మృతదేహాలను చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.