Home సినిమా ‘ది షేప్ ఆఫ్ వాటర్’కు నాలుగు ఆస్కార్‌లు

‘ది షేప్ ఆఫ్ వాటర్’కు నాలుగు ఆస్కార్‌లు

oscar

 లాస్‌ఏంజిల్స్‌లో కన్నుల పండువగా ఆస్కార్ వేడుక
 ఉత్తమ చిత్రంగా ‘ది షేప్ ఆఫ్ వాటర్’
 ఉత్తమ దర్శకుడిగా గల్లీర్మో డెల్‌టోరో, ఉత్తమ నటుడిగా గ్యారీ ఓల్డ్‌మ్యాన్, ఉత్తమ నటిగా ఫ్రాన్సిస్ మెక్‌డోర్మం డ్‌లకు ఆస్కార్‌లు

హాలీవుడ్ తారల తళుకుబెళుకుల మధ్య అతిపెద్ద అంతర్జాతీయ సినీ అవార్డుల కార్యక్రమం ‘ఆస్కార్’ వేడుక లాస్‌ఏంజిల్స్‌లో ఎంతో ఆడంబరంగా జరిగింది. లాస్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుకను కన్నులపండువగా నిర్వహించారు. ఈ ఏడాది ఆస్కార్ వేడుకలో ‘ది షేప్ ఆఫ్ వాటర్’కు అవార్డుల పంట పండింది. ఈ చిత్రానికి నాలుగు అవార్డులు దక్కడం విశేషం. ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘ది షేప్ ఆఫ్ వాటర్’… ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీలలో కూడా అవార్డులను అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా గల్లీర్మో డెల్‌టోరో ఆస్కార్‌ను గెలుచుకోగా ఉత్తమ నటునిగా గ్యారీ ఓల్డ్‌మ్యాన్ (డార్కెస్ట్ అవర్), ఉత్తమ నటిగా ఫ్రాన్సిస్ మెక్‌డోర్మండ్ (త్రీ బిల్‌బోర్డ్ అవుట్ సైట్ ఎబ్బింగ్, మిస్సోరి) అవార్డులను దక్కించుకున్నారు. ఇక ‘డన్‌కర్క్’ చిత్రానికి మూడు ఆస్కార్‌లు లభించడం విశేషం.
సినీ రంగంలో అందజేసే అత్యుత్తమ అవార్డులు ఆస్కార్. నటీనటులు జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ గెలుపొందాలని కలలు కంటారు. ఆస్కార్ అవార్డు దక్కితే పరవశించిపోతారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుకలో పలు దేశాలకు చెందిన ప్రముఖ హాలీవుడ్ తారలు పాల్గొని ప్రేక్షకులను మైమరపించారు. ఆస్కార్‌కు నామినేట్ అయిన ఎనిమిది చిత్రాలతో పోటీపడి ‘ది షేప్ ఆఫ్ వాటర్’ ఉత్తం చిత్రంగా అవార్డును అందకుంది. గులెర్మో డెల్‌టొరో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాల్లీ హాకిన్స్, మైఖేల్ షాన్నన్, రిచర్డ్ జెన్‌కిన్స్, డోగ్ జోన్స్, ఆక్టేవియా స్పెన్సర్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. 19.5 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం 114.3 మిలియన్ డాలర్లను వసూలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ల్యాబొరేటరీలో పనిచేసే ఓ మూగ యువతి కథే ఈ చిత్రం. ఆ ల్యాబొరేటరీలో పరిశోధనల కోసం ఉంచిన హ్యూమనాయిడ్ నీటి జంతువుతో ఆమె ప్రేమలో పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ ఫాంటసీ డ్రామా మూవీ చివరికి ఆస్కార్‌లోనూ సత్తా చాటింది. ఇక ‘డార్కెస్ట్ అవర్’ చిత్రంలో అద్భుతమైన నటనకుగాను గ్యారీ ఓల్డ్‌మ్యాన్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమాలో మాజీ బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ పాత్రలో గ్యారీ నటించారు. ‘ఐ, టోన్యా’ సినిమాలో తన నటనతో ఆల్లిసన్ జాన్నే విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ముందుగా అనుకున్న విధంగానే ఉత్తమ నటిగా జాన్నేను ఆస్కార్ అవార్డు వరించింది. ఈ చిత్రంలో తల్లి పాత్రలో నటించిన ఆమెకు అంతకుముందు ఇతర ప్రతిష్టాత్మక అవార్డులు కూడా దక్కాయి. ‘ది షేప్ ఆఫ్ వాటర్’ చిత్రం తర్వాత ఆస్కార్ వేడుకలో అందరినీ ఆకట్టుకున్న సినిమా ‘డన్‌కర్క్’. ఈ చిత్రానికి బెస్ట్ సౌండ్ మిక్సింగ్, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ విభాగాలలో అవార్డులు లభించాయి.

శ్రీదేవి, శశికపూర్‌ల మృతి పట్ల సంతాపం

ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తోంది. బాహుబలి వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాలు విదేశాల్లోనూ సత్తా చాటాయి. మన దేశంలోని కొందరు ప్రముఖ  నటీనటులు అంతర్జాతీయంగా మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆస్కార్ సంబరాల్లో అతిలోక సుందరి శ్రీదేవి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఆమెకు ఉన్న గుర్తింపును ఇది తెలియజేసింది. అప్పట్లో స్టీవెన్ స్పీల్‌బర్గ్ ‘జురాసిక్ పార్క్’ సినిమాలో  శ్రీదేవిని కీలక పాత్ర కోసం ఎంచుకోవాలని అనుకున్నారు. కానీ అప్పటికి ఆమె చాలా బిజీ. రెండు, మూడేళ్ల వరకు డేట్స్ ఇవ్వలేని పరిస్థితి. ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా నెలల తరబడి నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో అనుకోని విధంగా ‘జురాసిక్ పార్క్’లో వచ్చిన అవకాశాన్ని ఆమె వదులుకోవాల్సి వచ్చింది. ఇక దిగ్గజ నటుడు శశికపూర్ గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే. ఆయన కూడా హాలీవుడ్‌కు కొంచెం దగ్గరగా ఉండేవారు. శశికపూర్ మృతి పట్ల కూడా ఆస్కార్ వేడుకలో సంతాపాన్ని తెలియజేశారు.

ఆస్కార్ అవార్డుల విజేతలు

 ఉత్తమ దర్శకుడు ః గల్లీర్మో డెల్‌టోరో (ది షేప్ ఆఫ్ వాటర్)
 ఉత్తమ నటుడు ః గ్యారీ ఓల్డ్‌మ్యాన్ (డార్కెస్ట్ అవర్)
 ఉత్తమ నటి ః ఫ్రాన్సిస్ మెక్‌డోర్మండ్ (త్రీ బిల్ బోర్డ్ అవుట్ సైట్ ఎబ్బింగ్, మిస్సోరి)
 ఉత్తమ చిత్రం ః ది షేప్ ఆఫ్ వాటర్
 ఉత్తమ సహాయ నటుడు ః సామ్ రాక్‌వెల్ (త్రీ బిల్ బోర్డ్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి)
 ఉత్తమ సహాయ నటి ః అల్లీసన్ జెన్నీ (ఐ, టోన్యా)
 ఉత్తమ సినిమాటోగ్రఫీ చిత్రం ః బ్లేడ్ రన్నర్ 2049
 ఉత్తమ కాస్టూమ్ డిజైనర్ ః మార్క్ బ్రిడ్జెస్ (ఫాంటమ్ థ్రెడ్)
 ఉత్తమ ఎడిటర్ ః లీ స్మిత్ (డన్‌కర్క్)
 ఉత్తమ అలంకరణ, కేశాలంకరణ ః కజుహిరో సుజి, డేవిడ్ మాలినోవ్‌స్కీ, లూసీ సిబ్బిక్ (డార్కెస్ట్ అవర్)
 ఉత్తమ విదేశీ చిత్రం ః ఎ ఫెంటాస్టిక్ ఉమెన్ (చిలీ)
 బెస్ట్ విజువల్ ఎఫెక్ట్‌ః జాన్ నీల్సన్, గెర్డ్ నెఫ్జర్, పాల్ లాంబర్ట్, రిచర్డ్ ఆర్. హూవర్ (బ్లేడ్ రన్నర్ 2049)
 బెస్ట్ సౌండ్ మిక్సింగ్ ః మార్క్ వీన్‌గార్టెన్, గ్రెగ్ ల్యాన్‌డార్కర్, గ్యారీ ఎ.రిజ్జో (డన్‌కర్క్)
 బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ ః పాల్ డెన్‌హామ్, ఆస్టర్‌బెర్రీ (ది షేప్ ఆఫ్ వాటర్)
 బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే ః జోర్డన్ పీలే (గెటౌట్)
 బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ః రిమెంబర్ మీ (కోకో)