Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

థాయ్ గుహ నుంచి మరో నలుగురు బాలల వెలికితీత

thai

 ఇప్పటి వరకు మొత్తం 8 మంది బయటికి
 రెండో రోజూ సహాయక చర్యలు
మాయిసాయి: థాయ్‌లాండ్‌లో వరదల కారణంగా గుహలో రెండు వారాలుగా చిక్కుకున్న 12 మంది బాలలు, వారి సాకర్ కోచ్ బృందంలో మరో నలుగురిని బయటికి తీసుకొచ్చినట్టు ఓ అధికారి తెలిపారు. దీంతో అతిక్లిష్టంగా నిర్వహించిన సహాయ చర్యల ద్వారా ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందిని బయటికి తెచ్చినట్లయింది. ‘నేడు(సోమవారం) ఎనిమిదో వ్యక్తిని కూడా బయటికి తెచ్చాం’ అని థాయ్‌లాండ్‌కు చెందిన ‘సీల్’ కమాండర్ ఫ్లాగ్ ఆఫీసర్ సిత్తిచాయి క్లాంగ్‌పట్టన తెలిపారు. ‘ఈ రోజు నలుగురు బాలలను గుహ నుంచి బయటికి తెచ్చాం’ అన్నారే తప్ప ఆ బాలల ఆరోగ్య పరిస్థితి ఎలాంగుందన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. సోమవారం నిర్వహించిన సహాయక చర్యల అనంతరం ఇంకా గుహలో నలుగురు బాలలు, వారి కోచ్ చిక్కుకుని ఉన్నారు. సాకర్ ప్రాక్టీస్ తర్వాత అతి పెద్ద గుహలోకి వెళ్ళి చూడ్డానికి వైల్డ్ బోర్స్ ఫుట్‌బాల్ టీమ్, దాని కోచ్ జూన్ 23న ప్రయత్నించారు. వానా కాలం కావడంతో కుండపోత వానకు వారు తడిసిపోవడమేకాక, నీటి ప్రవాహానికి గుహలోకి కొట్టుకుపోయారు. బురదతో కూడిన వరద నీటిలో 13 మంది గుహలో చిక్కుకుపోవడాన్ని ఓ బ్రిటిష్ ఈతగాడు గత సోమవారం గుర్తించాడు. ఆదివారం గుహ నుంచి తీసుకొచ్చిన నలుగురు బాలలు ఆసుపత్రిలో కోలుకున్నారని అధికారులు చెప్పారు. సహాయక చర్యలు ముగించేందుకు మరి మూడు, నాలుగు రోజులు పట్టవచ్చని థాయ్‌లాండ్ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత భారీ వర్సాలు కురిసే అవకాశం ఉన్నందున వరద నీరు ఆ గుహను ముంచెత్తే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉండగా సహాయక కార్యకర్తల బృందం ఒకటి గుహలోకి వెళ్లిందని, మిగతా వారిని కూడా రక్షించే అవకాశం ఉందని, త్వరలో శుభవార్త వెలువడగలదని సహాయక చర్యల చీఫ్ నరోంగ్‌సాక్ ఓసోట్టనకోర్న్ ఇంతకు మునుపు విలేకరుల సమావేశంలో తెలిపారు.

Comments

comments