Home ఎడిటోరియల్ సంపాదకీయం: ఏదీ మంచికాలం!

సంపాదకీయం: ఏదీ మంచికాలం!

Article about Modi china tour ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాగ్దానం చేసిన “మంచి రోజులు” సామాన్య ప్రజలకు రాలేదు. అయితే పేదల ఉద్ధరణే లక్షంగా తన ప్రభుత్వం పని చేస్తున్నదని, అందరికీ ఇళ్లు, విద్యుచ్ఛక్తి, వంటగ్యాస్, పారిశుద్ధం, ఆరోగ్యం, రహదారులు, మంచినీరు కల్పిస్తామని ఆయన 72వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రజలకు హామీయిచ్చారు. అందులో భాగంగానే జనసంఘ్ సిద్ధాం త వేత్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన సెప్టెంబర్ 25న 10 కోట్ల పేద, వెనుకబడిన కుటుంబాలకు “ప్రధానమంత్రి జన ఆరోగ్య అభియాన్‌” ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కుటుంబానికి సంవత్సరంలో రూ. 5 లక్షల ఆరోగ్య రక్షణ లభిస్తుంది. రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్న ఉచిత ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలతో మేళవించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో అది అమలు జరుగుతుంది. మోడీ ప్రభుత్వం గత బడ్జెట్‌లోనే ఈప్రకటన చేసి రూ. 10,500 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ వైద్యాన్ని ఇప్పటికే ప్రజలకు దూరం చేసిన ప్రభుత్వ విధానాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ పథకం ఉద్దేశించిందన్న ఆరోపణలున్నాయి. ఆ ధనాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణకు ఎందుకు ఉపయోగించకూడదని కొందరు వైద్యనిపుణులు ప్రశ్నిస్తున్నారు.
మోడీ ఐదవ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి ప్రసంగం అయినందున కొన్ని తరగతుల ప్రజలను ప్రత్యేకించి ఆకట్టుకునే దృష్టి అందులో ఉండటం సహజం. పేదలు, వెనుకబడిన తరగతులు, రైతులు, మహిళలు, యువత, మధ్య తరగతులు వాటిలో ఉన్నాయి. యుపిఎ ప్రభుత్వంతో తన పరిపాలనను పోల్చుతూ ఆ ప్రభుత్వంలో ‘విధాన పక్షవాతం’ ఆవహించగా తన ప్రభుత్వం కింద భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోందన్న దృశ్యాన్ని చిత్రించటానికి ప్రధాని ప్రయత్నించారు. “భారతదేశం ఇంతకు మునుపు నిద్రిస్తున్న ఏనుగు. ఇప్పుడు దాన్ని నిద్ర లేపాం, పరుగు ప్రారంభించింది” అన్న మాటల్లో ఆయన ఆత్మవిశ్వాసం ప్రతిబింబించింది. అయితే ఈ ప్రభుత్వం పథకాల ప్రకటనలో దిట్ట ఆచరణ మాత్రం పట్టించుకోదు అనే అభిప్రాయం ఉపన్యాసాలతో మారదు. అంతేగాక లక్ష నిర్దేశనలు మారుతూ ఉంటాయి. మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛభారత్, నైపుణ్యాభివృద్ధి, బేటీ బచావో బేటీ పడావో, నల్లధనంపై తిరుగుబాటు, అవినీతిపై తిరుగులేని పోరాటం, టెర్రరిజాన్ని పారదోలతాం, నిరుద్యోగం, పేదరికంపై పోరాటం వంటి నినాదాలు కాక పథకాల ఫలితాలు ప్రజల మనోగతాన్ని నిర్ణయిస్తాయి.
తమ విధానాలవల్ల రెండేళ్లలో 5 కోట్ల మంది దారిద్య్ర రేఖ దాటినట్లు ఒక అంతర్జాతీయ నివేదికను ఉట్టంకించిన ప్రధానమంత్రి ఈ నాలుగేళ్లలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు కల్పించారో కూడా చెబితే యువత సంతృప్తి చెందేది.2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రకటనను మోడీ పునరుద్ఘాటించారు. ఒబిసి కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి, ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం యథాపూర్వస్థితి పునరుద్ధరణను గుర్తు చేస్తూ ఇటీవలి పార్లమెంటు సమావేశం సామాజిక న్యాయానికి పూర్తిగా అంకితమైందన్నారు. ఎన్నికలకు ముందు ఈ రెండు తరగతులను బుజ్జగించటానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నించటం తెలిసిందే. మహిళల ఉద్ధరణకు తమ ప్రభుత్వం ఎంతో చేస్తోందన్న ప్రధాని ముస్లిం మహిళలకు న్యాయం చేసే ట్రిపుల్ తలాఖ్ బిల్లును కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ, ఆ బిల్లును చట్టం చేసి తీరుతామన్నారు. సైన్యంలో మహిళలకు పర్మినెంట్ కమిషన్, సుప్రీంకోర్టులో మహిళా జడ్జీల సంఖ్య మూడుకు పెరగటం వంటి విషయాలను ప్రస్తావించిన ప్రధాని మహిళా రిజర్వేషన్ బిల్లు ఊసెత్తలేదు. అది యుపిఎ ప్రభుత్వ కాలంలో రాజ్యసభ ఆమోదం పొంది ఉంది. లోక్‌సభలో మెజారిటీ ఉన్న మోడీ ప్రభుత్వం దాన్ని ఎందుకు ఆమోదానికి పెట్టటం లేదు?
దేశంలో మహిళలు, దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులపట్ల సహజంగానే చాలా ఆలస్యంగా స్పందించే మోడీ మానభంగ నేరాల విషయంలో ఈ “భూతావేశ” మనస్తత్వం నుంచి సమాజం స్వేచ్ఛ పొందాలన్నారు. ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్న ఘోర కలి మూక హత్యల గూర్చి ప్రస్తావించలేదు. అభివృద్ధిని పరుగులెత్తించాలంటే మళ్లీ తనకు అధికారమివ్వాలన్న ధ్వని ప్రధాని ప్రసంగం నిండా ఉంది. ఎన్నో ఘన కార్యాలు సాధించినట్లు ప్రభుత్వం చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా పరిపాలన కలిగించిన సంతోషం ఆవేదనలను మనోత్రాచులో తూచి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు.