Home తాజా వార్తలు త్వరలో స్పష్టత

త్వరలో స్పష్టత

Fourth day on the election comes clarity: Minister KTR

ముందస్తు ఎన్నికలపై నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుంది : కొంగరకలాన్‌లో మీడియా ప్రతినిధులతో మంత్రి కెటిఆర్ 

టిఆర్‌ఎస్‌కు ఎన్నికల తొందర లేదు
ముందస్తు తొందర ప్రతిపక్షాలకు ఉండాలి
ఎన్నికలు ఎప్పుడొచ్చినా మాకు వందసీట్లు ఖాయం
ప్రగతి నివేదన దేశ చరిత్రలోనే మిగిలిపోతుంది 

మన తెలంగాణ/ హైదరాబాద్ : “టిఆర్‌ఎస్‌కు ఎన్నికల తొందర లేదు. ‘ముందస్తు’ తొందర ప్రతిపక్షాలకు ఉండాలె. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వంద సీట్లను కట్టపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే బాస్ అయినప్పుడు వారి దగ్గరకు వెళ్ళి తీర్పు కోరేందుకు భయమెందుకు? అధికారంలో ఉన్న మేం త్యజించడానికి ఒకవేళ సిద్ధంగా ఉంటే ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు మాకే అవకాశం ఉంది అని చెప్పా లి. నిజంగా వారికి ధైర్యం ఉంటే అదే చెప్పాలి. కానీ, వారికి అది లేదు. నిజంగానే ముందస్తుకు పోయినమే అనుకో వారికి అంత భయమెందుకు ప్రజల్లోకి వెళ్ళడానికి” అని మంత్రి కెటిఆర్ వ్యా ఖ్యానించారు.

కొంగరకలన్‌లో టిఆర్‌ఎస్ పార్టీ ‘ప్రగతి నివేదన’ సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్ళిన సందర్భంగా మం త్రి కెటిఆర్ పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం చెప్పారు. ముందస్తుపై పాత్రికేయులు మరోమారు రెట్టించి అడగ్గా& “రాష్ట్ర అసెంబ్లీకి ‘ముందస్తు’ ఎన్నికలు వస్తాయో రావో నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మీరు ప్రశ్నలూ అడగవచ్చు, మేం సమాధానమూ చెప్పవచ్చు” అని వ్యాఖ్యానించారు. “ముందస్తు ఎన్నికల గురించి రాసేదీ మీరే& మళ్ళీ అడిగేదీ మీరే..” అని మంత్రి నొక్కిచెప్పారు.

దేశ చరిత్రలో నిలిచిపోయేలా ‘ప్రగతి నివేదన’
దేశ చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా సెప్టెంబర్ 2న అపురూపమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నదని, దేశ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయేలా ‘ప్రగతి నివేదన’ సభను నిర్వహిస్తున్నామని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి సభలను నిర్వహించడం టిఆర్‌ఎస్‌కు కొత్తేమీ కాదన్నారు. పలువురు మంత్రులతో కలిసి కెటిఆర్ కొంగరకలాన్‌లో జరుగుతున్న సభ ఏర్పాట్లను ఆదివారం మధ్యా హ్నం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చరిత్రలో నిలిచిపోయే విధంగా కొంగరకలన్ ‘ప్రగతి నివేదన’ సభ జరుగుతోందని, విశాలమైన సభాస్థలిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా నిర్వహిసామన్నారు. మొత్తం 400 ఎకరాల్లో పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ప్రాంగణానికి వచ్చేందుకు అదనంగా 15 రోడ్లను నిర్మిస్తున్నామన్నారు.

ఇందులో 200 ఫీట్ల రోడ్డు ఒకటి, 100 ఫీట్ల రోడ్లు నాలుగు, 60 ఫీట్ల రోడ్లు ఐదు, 40 ఫీట్ల రోడ్లు ఐదు చొప్పున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మెడికల్ క్యాంపులు, మంచినీటి వసతి తదితర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని, సభ నిర్వహణ కోసం ఎనిమిది కమిటీలు వేశామన్నారు. ఒక్క హైదరాబాద్ నుంచే సుమారు మూడు లక్షల వరకు ప్రజలు తరలివస్తారని తాము అంచనా వేస్తున్నామని, సభ వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు కూడా సంబంధిత అధికారులు తీసుకుంటున్నారని తెలిపారు. జిల్లాల నుంచి నేరుగా సభకు వాహనాలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా టిఆర్‌ఎస్‌దే అధికారమని ధీమా వ్యక్తంచేసారు. ప్రతీ పనిని ప్రతిపక్షాలు డబ్బులతో ముడిపెట్టడం సరికాదని, వారిది కాకిగోల మాత్రమే అని మంత్రి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌వారిలా తాము ప్రజల సొమ్మును దోచుకోలేదని, వారి మనసులను మాత్రం దోచుకుంటామన్నారు. పైసలు పంచింది ఎవరో, చిప్ప కూడు తిన్నది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పరోక్షంగా రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన టిఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం అనంతరం తమ పార్టీ ఎమ్మెల్యేలకు నగదు డబ్బులు పంచామని వస్తున్న ఆరోపణలను కెటిఆర్ ఖండించారు. ఇలాంటి చిల్లర మాటలు చాలా మంది మాట్లాడతారని, అటువంటి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. పిచ్చిపిచ్చి ప్రేలాపనలు చేసే ప్రతిపక్షాలకు తాము జవాబుదారీ కాదని, ప్రజలకు మాత్రమే తాము జవాబుదారీ అని అన్నారు. కాంగ్రెస్సోళ్ళ బాసులు ఢిల్లీలో ఉన్నారని, వాళ్ళు దీనికి పోవాలన్న (చిటికిన వేలు చూపిస్తూ) బాస్‌లను అడగాల్సిందేనన్నారు. తమకు ఆ అవసరం లేదని, తమ బాస్‌లు రాష్ట్ర గల్లీల్లోనే ఉన్నారని, తెలంగాణలో గల్లీల్లో ఉన్నవారి ఆశీర్వాదాలు కావాలన్నారు. తమ భవిష్యత్తుకు వారే దిక్సూచిగా నిలువాలని కోరుకుంటున్నామన్నారు. నాలుగున్నర సంవత్సరాలలో తాము ప్రజలకు ఏం చేశామో తెలపాల్సిన అవసరం ఉందన్నారు. సేఫ్టీ కోసం ప్రజా రవాణాలో ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

అందుకే ఆదివారంనాడు సభ పెట్టాం : సెప్టెంబర్ 2వ తేదీ ఆదివారమని, కావాలనే ఆ రోజున సభను ఏర్పాటు చేశామని కెటిఆర్ తెలిపారు. ఆ రోజున కార్యాలయాలు, పిల్లలకు స్కూళ్ళు ఉండవన్నారు. ఇంకా ఇతర ఇబ్బందులు కూడా తలెత్తవన్నారు. అందువల్ల ఆ రోజున అందుబాటులో ఉన్న అన్ని రకాల వాహనాలను వినియోగించుకుంటామన్నారు. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ 2న ప్రజలు ‘దయచేసి ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్ద’ని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.