Home అంతర్జాతీయ వార్తలు ఆందోళనలకు దిగివచ్చిన ఫ్రెంచ్ ప్రభుత్వం

ఆందోళనలకు దిగివచ్చిన ఫ్రెంచ్ ప్రభుత్వం

France Petro Crisisపారిస్: పెట్రోలు, డీజిల్‌పై పన్నుల పెంపునకు వ్యతిరేకంగాగత రెండు వారాలుగా జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతోఆందోళలను చల్లార్చే ప్రయత్నంలో భాగంగా వీటిపై పన్నుల పెంపు నిర్ణయాన్ని ఆరు నెలల పాటు ఫ్రాన్స్ ప్రభుత్వం వాయిదా వేసింది. గత వారాంతంలో పారిస్ నగరంలో పెద్ద ఎత్తున హింసాకాండ, వీధిపోరాటాలు చెలరేగడంతో ఫ్రెంచ్ ప్రధాని ఎడ్వర్డ్ ఫిలిప్ చేసిన టెలివిజన్ ప్రసంగంలో ఇచ్చిన హామీల్లో ఈ పన్నులను వాయిదా వేయడం కూడా ఒకటి. ‘ఈ ఆగ్రహాన్ని మీరు చూడలేదు, వినలేదంటే మీరు చెవిటివారు, గుడ్డివాళ్లు అయి ఉండాలి’ అని అల్లర్ల అనంతరం ఫిలిప్ వ్యాఖ్యానించడం గమనార్హం.

దేశ ఐక్యతను ప్రమాదంలో పడవేసే ఏ పన్ను కూడా భావ్యంకాదని కూడా ఆయన అన్నారు. పెంచిన విద్యుత్, గ్యాస్ ధరలను శీతాకాలంలో నిలిపివేయడంజరుగుతుందని, జనవరి 1నుంచి అమలులోకి రానున్న కఠినమైన వాహన కాలుష్య నియంత్రణ నిబంధనలను ఆరు నెలల పాటు వాయిదా వేయనున్నట్లు ఫిలిప్ ప్రకటించారు. తాజాగా ఫ్రాన్స్‌లో చోటు చేసుకున్న హింసాకాండలో 23 మంది భద్రతా సిబ్బంది సహా 263 మంది గాయపడగా, ఆందోళనకారులు పలు భవనాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. ఒక్క పారిస్‌లోనే 133 మంది గాయపడ్డారు. ఈ ఆందోళనలతో జి20 సదస్సుకోసం అర్జెంటీనా వెళ్లిన అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ అర్ధంతరంగా ఫ్రాన్స్‌కు తిరిగి రావలసివచ్చిన విషయం తెలిసిందే.