Home ఎడిటోరియల్ ఎక్కడైనా బావ గాని…

ఎక్కడైనా బావ గాని…

Francois-hollandeఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండే రిపబ్లిక్ దినోత్సవ అతిథిగా రావటం భారత్-ఫ్రాన్స్ సంబంధాల్లో ఉన్నతస్థాయిని సంకేతిస్తున్నదని మన ప్రభుత్వం మురిసిపోవచ్చు. కాని రాఫెల్ యుద్ధవిమానాల సరఫరాను ఒప్పందానికే పరిమితం చేసి, దీర్ఘకాలంగా తేలకుండా చర్చల్లో నలుగుతున్న ధర విషయాన్ని వాయిదావేయటం ఎక్కడైనా బావగాని వంగతోట వద్ద మాత్రం కాదన్న సామెతను గుర్తుచేస్తున్నది. యుద్ధ విమానాల కొనుగోలు కొరకు భారతప్రభుత్వం అనేక సంవత్సరాలుగా ప్రయత్నిస్తోంది. యుపిఎ రెండవ ప్రభుత్వ కాలంలో అమెరికన్ బోయింగ్, ఫ్రెంచి రాఫెల్ మధ్య ఏర్పడ్డ పోటీలో, సాంకేతికంగా అదనపు సౌలభ్యాల కారణంగా నిపుణుల కమిటీ ఫ్రెంచి కంపెనీ రాఫెల్ విమానాలను ఖరారు చేసింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా బోయింగ్ తరఫున ఒత్తిడి చేసినా, భారతప్రభుత్వం ఫ్రెంచి కంపెనీని ఎంచుకోవటం ఆయన్ను నిరాశపరిచింది. అప్పట్నుంచి – మూడేళ్లకు పైబడి రాఫెల్ కంపెనీతో రేటు కొలిక్కిరాలేదు. గత సంవత్సరం ప్రధాని మోడీ ఫ్రాన్స్ వెళుతూ రాఫెల్ ఒప్పందాన్ని బహుమతిగా తీసుకెళ్లారు. ఉపయోగించటానికి సర్వసన్నద్ధ స్థితిలో 36 ఫైటర్ జెట్లకు ఇరు ప్రభుత్వాల స్థాయిలో ఒప్పందం కుదిరింది. దీన్ని మోడీ పర్యటన సాధించిన విజయంగా ప్రభుత్వం ప్రచారం చేసింది. ఈరోజు వరకు ఒక్క విమానం మన రక్షణదళంలోకి చేరకపోగా రేటే తేలలేదు. హోలండే పర్యటనతో కూడా అది అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఆర్డరు సాధించటమే ప్రభుత్వం పని – రేటు తేల్చేది ఆ రక్షణ ఉత్పత్తుల కంపెనీయే. కంపెనీల ప్రాబల్యం అటువంటిది.
యుపిఎ ప్రభుత్వ టెండర్ ప్రకారం ఆ ఫైటర్ల మొత్తం ఖరీదు – పెరిగే ఉత్పత్తి ఖర్చులు, డాలర్ రేటును పరిగణనలోకి తీసుకున్నాక రూ.80వేల కోట్లు. భారత్ అంచనా ఖరీదు 8 బిలియన్ డాలర్లు (రూ.59 వేల కోట్లు) కాగా ఫ్రాన్స్ ఆశించిన ధర 12 బిలియన్ డాలర్లు. 15 శాతం తక్షణ చెల్లింపుతోపాటు 50శాతాన్ని భారత్ అడ్వాన్సుగా చెల్లించాలి. ఈ మడతపేచీ ఇప్పటికీ తేలలేదు. ఇప్పుడు హోలండే-మోడీ సమక్షంలో రాఫెల్‌ఫైటర్లపై సూత్రప్రాయ ఒప్పందంపై సంతకాలు మాత్రం జరిగాయి.
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే నిమిత్తం సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఏర్పడిన అంతర్జాతీయ సోలార్ అలయెన్స్ కేంద్ర కార్యాలయం నిర్మాణానికి హోలండే, మోడీ గుర్గాంలో శంకుస్థాపన చేశారు. ఇది మోడీ మన దేశానికి సాధించిన ఒక అంతర్జాతీయ సంస్థ. సౌర ఫలకాలను ఉత్పత్తి చేసే టెక్నాలజీ, కంపెనీలు పశ్చిమదేశాల్లోనే విరివిగా ఉన్నాయి. వినియోగదారులు ఎక్కువగా వర్ధమాన దేశాలే. ఆ కంపెనీల లాభసాటి వ్యాపారానికి ఈ కేంద్రం ఉపకరిస్తుంది. అయితే సూర్యకాంతి సంవత్సరం పొడవునా ఒకే స్థాయిలో లభ్యంకాదుకాబట్టి సౌరశక్తి సాంప్రదాయక థర్మల్, హైడల్ విద్యుచ్ఛక్తికితోడు దోహదకారి మాత్రమే అవుతుంది. అందువల్ల, సౌరవిద్యుత్‌తో మన సమస్యలన్నీ తీరిపోతాయి, కార్బన్ ఉద్గారాల విడుదల గణనీయంగా తగ్గిపోతుందనుకుంటే భ్రమ.
కౌంటర్ టెర్రరిజం, సెక్యూరిటీ, పౌరఅణువిద్యుత్, రైల్వేలు, రోదసీ సహకారం తదితర అంశాలపై 14 ఒప్పందాలపై ఈ సందర్భంగా ఇరు ప్రభుత్వాలు సంతకాలు చేశాయి. మార్స్‌మిషన్, థర్మల్ అబ్జర్వేషన్ మిషన్, ఉపగ్రహ ప్రయోగాల ఒప్పందాలపై ఇస్రో-సిఎన్‌ఇఎస్ సంతకాలు చేశాయి. బీహార్‌లో 800 విద్యుత్ రైలు ఇంజిన్‌లను సంయుక్తంగా ఉత్పత్తిచేసే ఒప్పందంపై అల్‌స్టోం-భారతీయ రైల్వేలు సంతకాలు చేశాయి. టెర్రర్‌పై పోరాటానికి సంబంధించి ఇంటెలిజెన్స్ సహకారం, దర్యాప్తు, న్యాయస్థానాల్లో విచారణ సహకారాన్ని సంయుక్త ప్రకటనలో వక్కాణించారు. “టెర్రరిజాన్ని, రాడికలిజాన్ని, టెర్రరిస్టుల కదలికలను, విదేశీ టెర్రరిస్టులు దిగటాన్ని ఎదుర్కొనటంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్, ఫ్రాన్స్ తీర్మానించుకున్నాయి” అని సంయుక్త ప్రకటన పేర్కొన్నది.
పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్, అంతకుముందు 2008లో ముంబయిపై టెర్రరిస్టు దాడిని ప్రోత్సహించిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టి శిక్షింపచేయాలని పాకిస్థాన్‌ను కోరారు. లస్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, హక్కానీ నెట్‌వర్క్‌పై, ఇతర టెర్రరిస్టు గ్రూపులపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని కోరారు. భారత్, ఫ్రాన్స్ రెండూ టెర్రరిస్టుల బాధిత దేశాలుగా ఉన్నందున ఈ విషయంలో సహకారం ప్రయోజనదాయకమే. టెర్రరిస్టులను, వారు ఏ బ్రాండ్‌కు చెందినా నిర్మూలించేందుకు అన్ని దేశాలు కంకణధారులు కావాలని ప్రధాని మోడీ ఐరాస తదితర వేదికలపై వక్కాణించినా, అది ఇంకనూ వృధా ప్రయాసగానే ఉంది. ఎందుకంటే, తమ ప్రయోజనాల రక్షణ సాకుతో ఏ ప్రభుత్వాన్నయినా కూలగొట్టదలుచుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా టెర్రరిజాన్ని ఉపయోగించుకోవటంలో అమెరికా నాయకత్వంలో పశ్చిమదేశాలు నేర్పరులన్న విషయాన్ని విస్మరించి చేసే ప్రయత్నాలు ఫలితాన్నివ్వవు. కాబట్టి భారత్-ఫ్రాన్స్ సహకారాభివృద్ధి ఆర్థికరంగంలోనే అవకాశాలు ఎక్కువ.