Search
Saturday 21 July 2018
  • :
  • :

ఉచిత వైద్యం పేదలకువరం

LIFE

ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే సరైన వైద్య చికిత్సలు అందడం లేదని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే జేబులు గుల్లవుతున్నాయి. చాలా కుటుంబాలు తాము సంపాదించిన దానిలో సగానికి మించి వైద్యానికే ధారపోయాల్సి వస్తోంది. కొన్ని కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. ఏ ఖర్చు మానుకున్నా వైద్యానికి మాత్రం తప్పనిసరిగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ను ప్రభుత్వం ప్రారంభించి ఉచితంగా రోగనిర్థారణ పరీక్షలకు అవకాశం కల్పించడం  చెప్పుకోతగ్గది. క్లినికల్ పేథోలజీ, మైక్రోబయాలజీ, సిరాలజీ, క్లినికల్ బయోకెమిస్ట్రీకి సంబంధించి దాదాపు 53 రకాలకు పైగా పరీక్షలకు ఎలాంటి సొమ్ము చెల్లించకుండా  ఉచితంగా చేయించుకోవచ్చు. 24 గంటల్లోపే నివేదిక అందేలా ఏర్పాట్లు చేశారు. చాలా వ్యాధులకు ప్రాథమిక స్థాయిలో చికిత్స అందిస్తే  సరిపోతుంది. అయితే నిర్థారణ పరీక్షలు అందుబాటులో లేనందున చాలామంది ప్రైవేటు ఆస్పత్రులకు గత్యంతరం లేక వెళ్లవలసి వస్తోంది. ఇప్పుడు ఉచిత వైద్య పరీక్షలు పేదలకు వరమే. నారాయణ గూడలోని ప్రధాన డయాగ్నోస్టిక్ కేంద్రంతో నగరంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా, ప్రాంతీయ ఆస్పత్రులు, వెల్‌నెస్‌సెంటర్లు, బస్తీదవాఖానాలు మొత్తం 120 కేంద్రాలను అనుసంధానించారు. ఈ కేంద్రాల్లో వ్యాధి లక్షణాలనుబట్టి రక్తం, మూత్రం, మలం నమూనాలు సేకరించి ప్రధాన కేంద్రానికి పంపినతరువాత ఆన్‌లైన్‌లోనే   24  గంటల్లో ఫలితాల నివేదిక అందుబాటులోకి వస్తుంది. వ్యాధి నిర్థారణ అయిన తరువాత అదే ఆస్పత్రిలో ఉచితంగా మందులు ఇస్తారు.  కొలెస్టరాల్ వంటి గుండె సమస్యలతోపాటు, డెంగీ, చికెన్‌గున్యా, స్వైన్‌ఫ్లూ, ప్లేట్‌లెట్స్ కౌంట్ తదితర పరీక్షలతో పాటు కాలేయ, మూత్ర పిండాల పరీక్షలను కూడా అందుబాటులోకి తెచ్చారు. అలాగే థైరాయిడ్, బ్లడ్‌షుగర్ తదితర పరీక్షలన్నీ ఉచితంగా చేస్తారు. ఈ పరీక్షలన్నీ ప్రైవేటు ఆస్పత్రుల్లో చేయించుకోవాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టక తప్పదు. కానీ ప్రభుత్వం కల్పించిన అవకాశం వల్ల పైసా కూడా వెచ్చించనక్కరలేదు.

Comments

comments