Home నల్లగొండ ఉచిత శిక్షణ శిబిరానికి విశేష స్పందన

ఉచిత శిక్షణ శిబిరానికి విశేష స్పందన

police-recruitmentపోలీసు ట్రైనింగ్‌ను మరిపిస్తున్న శిబిరం
దూరప్రాంతాల నుంచి హాజరవుతున్న అభ్యర్థులు
ఉన్నత విద్యనభ్యసించిన విద్యార్థులూ ఆసక్తి చూపుతున్న వైనం

మిర్యాలగూడ క్రైం : పోలీసు ఉద్యోగ నియామకాలకు ఆసక్తి గల అభ్యర్థులకు జిల్లా ఎస్.పి దుగ్గల్ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఉచిత శిక్షణ శిబిరానికి మంగళవారం విశేష స్పందన లభించింది. శిబిరానికి సోమవారం 220మంది హాజరుకాగా మంగళవారం మరో 300మంది హాజరయ్యారు. వీరిలో 50మంది మహిళా అభ్యర్థులే కావడం విశేషం. మిర్యాల గూడ పట్టణ పరిధిలోనే కాకుండా వేముల పల్లి, దామరచర్ల మండలాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు శిబిరానికి హాజరవు తున్నారు. మిర్యాలగూడ సి.ఐలు, భిక్షపతి, పాండురంగారెడ్డి, రవీందర్, ఎస్.ఐలు సర్ధార్ నాయక్, విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో విద్యా ర్థులకు ఆయా విభాగాల్లో ఇచ్చే శిక్షణలు పోలీసు ట్రైనింగ్‌ను తలపిస్తున్నాయి. ఉన్నత విద్యనభ్యసించిన విద్యార్థులు సైతం ఈ శిక్షణ శిబిరంపై ఆసక్తి చూపడం శిబిరం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది. అవాంతర సంఘటనలు జరిగినప్పుడు ప్రథమచికిత్స అందించేందుకు 108వాహనాలను అందు బాటులో ఉంచారు. పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయానికి విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శిబిరం ఉత్తేజాన్నిచ్చింది: దాసరి నాగేంద్ర
పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈశిబిరంలో నూతన ఉత్తేజాన్ని కలిగించిందని శిబిరానికి హాజరైన వేములపల్లి మండలం కల్వెలపాలెం గ్రామానికి చెందిన డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థిని దాసరి నాగేంద్ర అన్నారు. తాను 2013లో వెలువడిన కానిస్టేబుల్ భర్తీ నోటిఫికేషన్‌కు ధరఖాస్తు చేసుకున్నానని, మెరుగైన శిక్షణ లేకపోవడంతో ఉద్యోగం పొందలేకపోయాయని ఈ శిబిరం ద్వారా తప్పక ఉద్యోగం సాధిస్తానని నమ్మకం వ్యక్తం చేశారు.

పోలీసు ఉద్యోగంపై మక్కువ: నాగమణి
పోలీసు ఉద్యోగంపై మక్కువతోనే ఈశిబిరానికి హాజరైనట్లు పట్టణంలోని రాంనగర్‌కు చెందిన నాగమణి అన్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తనకు ఈశిబిరం ద్వారా పోలీసు ఉద్యోగంపై ఇంకా ఆసక్తి పెరిగిందన్నారు.