మన తెలంగాణ/ వికారాబాద్ రూరల్ ః కేంద్ర ప్రభుత్వ నుంచి వెలువడిన ఆర్మీ ఉద్యోగాల ఎంపిక ప్రకటనలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా జవహర్లాల్ నెహ్రూ గ్రౌండ్ నందు మే 21 నుంచి 31 వరకు నిర్వహింపబడు ఆర్మీ ఉద్యోగాల ఎంపిక కొరకు జిల్లా యువతకు(పురుషులకు) కావల్సిన (ఫిజికల్ ట్రైనింగ్) మెళకువలను నేర్పిస్తామని జిల్లా ఎస్పి టి.అన్నపూర్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించేటట్లు యువతకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మరొక సువర్ణావకాశమని ఆమె చెప్పారు. ఇట్టి ఉద్యోగాల కొరకు అభ్యర్థులు ఏప్రిల్ 6 నుంచి మే 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారు, చేసుకోవలసిన వారు త్వరగా త్వరగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ ఉచిత శిక్షణ గురించి జిల్లాలోని వారి వారి సమీప మండల ఎఎస్లకు వెళ్ళి అభ్యర్థులు పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు. నమోదు చేసుకున్న వారికి ఈ నెల 28వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు వికారాబాద్‌లోని కొండా బాలక్రిష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ నందు అవగాహన సదస్సు నిర్వహింపబడునని ఆమె చెప్పారు. ఈ సమావేశానికి హాజరయ్యే వారు 8 సర్టిఫికెట్స్, 10వ తరగతి పాస్/పేయిల్ మెమో, ఇంటర్ ఆపై చదువుల సర్టిఫికెట్స్ (ఒక సెట్ జిరాక్స్) ఆధార్ కార్డ్, 2 పాస్ ఫోటోలను తీసుకొని రావాలని ఆమె సూచించారు. అర్హతలుః 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు, వయస్సు 17 సం.ల 6 నెలల నుంచి 23 సం.ల వరకు, ఎత్తుః 162సెం.మీ. నుంచి 166 సెం.మీ. వరకు ఉండునని ఆమె తెలిపారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి పాస్/ఫేయిల్ వారికి ఎత్తు 166సెం.మీ.(జనరల్ డ్యూటీ), ఇంటర్ ఆపై చదువుల వారికి 162 సెం.మీ. ఎత్తు, (క్లర్క్ డ్యూటీ), ఇట్టి ఆర్మీ ఎంపికకు /ఫిజికల్ ట్రైనింగ్ పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు అని ఆమె పేర్కొన్నారు.