Home ఎడిటోరియల్ అమెరికాలో తుపాకుల స్వేచ్ఛ

అమెరికాలో తుపాకుల స్వేచ్ఛ

BSNS

మన దేశం నుండి అమెరికాకు వెళ్లినవారు, వెళ్లివచ్చినవారు, వెళ్లాలనుకొనేవారు అక్కడి సంపద, సంపాదన, సౌకర్యాల గురించి ఎంత గొప్పగా చెప్పినా, ఆ దేశంలో ఉన్న తుపాకుల సంస్కృతి ప్రస్తావన వచ్చే వరకు మాట ముందుకు సాగని పరిస్థితి వస్తుంది. అప్పుడప్పుడు భారతీయుడో, తెలుగువాడో అక్కడ తుపాకీ గుండుకు అన్యాయంగా బలయినపుడు మన ఆకాశమంతా విషాద ఛాయలు కమ్ముకుంటాయి. ఈ నెల 7న వరంగల్‌కు చెందిన ఎంఎస్ విద్యార్థి శరత్ అమెరికాలోని కన్సాస్ నగరంలో రెస్టారెంట్‌లో పనిచేస్తూ దుండగుల తుపాకీ కాల్పులకు నేలకూలడం తాజా విషాదం. భారతీయులే కాకుండా అమెరికాలో తుపాకులకు బలవుతున్న వారిలో చైనీయులు కూడా ఉన్నారు. చైనా ప్రభుత్వం ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ఆయుధాల వాడకం హద్దులు దాటవద్దని కోరింది. పరాయి దేశస్థులనే కాకుండా అమెరికా పౌరులపై కూడా విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్న సంఘటనలు ఆ దేశాన్ని కుదిపివేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఫిబ్రవరి 4న ఫ్లోరిడాలో జరిగిన దుస్సంఘటన ట్రంప్‌ను చిక్కుల్లో పెట్టింది. పౌరులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకొచ్చి ఆందోళనకు దిగారు. ఆ రోజు ఫ్లోరిడాలోని డగ్లాస్ హైస్కూలుపై దుండగులు దాడి చేసి 17 మంది విద్యార్థులను పొట్టనపెట్టుకున్నారు. క్లాస్‌రూంను రక్తసిక్తం చేశారు. ఇలాంటి సంఘటనలను దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధ్యాపకులకు తుపాకులు సరఫరా చేయాలని అధ్యక్షులవారు ఉచిత సలహా ఈయడంతో వ్యతిరేకత భగ్గుమంది. ‘మాకు తుపాకులు కాదు, పుస్తకాలు కావాలి’ అని నిరసన తెలిపిన పాఠశాల సిబ్బంది ట్రంప్‌కు తాము విద్యాబుద్ధలు చెప్పేవారమని గుర్తు చేశారు.
అక్టోబర్ 2017లో 64 ఏళ్ల స్టీఫెన్ పడాక్ లాస్‌వేగాస్‌లో రెండు చేతుల్లో తుపాకులతో 1100 రౌండ్లు కాల్చి 58 మంది ప్రాణాలు తీశాడు. లాస్‌వేగాస్‌లోని హార్వెస్ట్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో పాల్గొని ఆనంద డోలికల్లో ఉన్నవారిపై ఆయన విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. 2012లో న్యూటౌన్‌లో ఆడమ్ లోజా అనే దుండగుడి కాల్పులకు 26 మంది విద్యార్థులు, పాఠశాల సిబ్బంది బలిఅయ్యారు. 2007లో వర్జినీయాలో జరిగిన కాల్పుల్లో 32 మంది చనిపోయారు. ఇలా విచ్చలవిడిగా గుంపులపై కాల్పులు జరిగే సంఘటనలు చాలా ఉన్నాయి. ‘తుపాకులు మనుషుల్ని చంపవు. మనుషుల్ని మనుషులే చంపుతారు’ అనే అమెరికా సామెత ఉంది. ఈ మాట నిజమే అయినా తుపాకులు చేబూనినవారే నేరస్థులయినా పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా! తుపాకుల తయారీ వాడకానికి అమెరికా ఆర్థిక వ్యవస్థకు బలీయమైన లంకె ఉన్నది. ఆయుధ కర్మాగారాలకు అమెరికా పుట్టిల్లు, అమెరికాలో ఏటా 30 బిలియన్ డాలర్ల ఆయుధ వ్యాపారం సాగుతుంది. ఉద్యోగ కల్పనలో కూడా ఈ పరిశ్రమ ముందుంది.
2 లక్షల మంది ఉద్యోగులతో వర్ధిల్లుతున్న ఆయుధ తయారీ దినదినం పురోగమనం ఉంది. 25 శాతం ప్రభుత్వ ఆదాయం ఈ రంగం నుంచే వస్తోంది. ఆయుధాల అమ్మకాల్లో అమెరికా అన్ని దేశాల కన్నా అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ ఆయుధ అవసరాల్లో సగం ఈ దేశమే తీర్చుతోంది. ఆయుధ ఉత్పత్తి, ఎగుమతుల్లో రష్యా, చైనా, జర్మనీ, ప్రాన్సు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక దిగుమతుల విషయానికొస్తే భారతదేశం మొదటి స్థానం ఉంటుంది. ఆ తర్వాత సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్, పాకిస్థాన్ తదితర దేశాలున్నాయి. అమెరికాలో తుపాకుల తయారీతోపాటు వాటి వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వారి సంఖ్య కూడా తక్కువేం లేదు. గత 40 ఏళ్లలో అమెరికాలో 14 లక్షల మంది తుపాకీ గుండుకు బలి అయ్యారు. ఈ సంఖ్య టెక్సాస్, డల్లాస్ లాంటి నగర జనాభాతో సమానం. ఆత్మహత్యలకు కూడా సొంత తుపాకీ లభ్యత దగ్గరి దారిలా తయారైంది. 63 శాతం ఆత్మహత్యలకు తుపాకి గుళ్లే కారణం.
2017 లో జాతీయ భద్రతా సమితి అమెరికా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. తుపాకీ అమ్మకాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే పౌరులపై జరుగుతున్న కాల్పులను కట్టడి చేయవచ్చని చెప్పింది. తుపాకీ కొనుగోలుకు అభ్యర్థన పత్రం వచ్చిన వెంటనే ఆయుధాన్ని అందించకుండా కొంత సమయం తీసుకోవాలి. దీనివల్ల వెంటనే ఎవరినో చంపాలని అభ్యర్థి మనసులో ఉంటే దానిన ఆపినట్లవుతుంది. కొలుగోలుదారు నేపథ్యం, ఆయుధ అవసరంపై విచారణ జరపాలి. ఆయుధం వాడే విధానంపై శిక్షణ పూర్తి చేసి ఉండాలి. కొనేవారి మానసిక స్థితిపై వైద్యుడి ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేసింది. 21 ఏళ్లలోపు వారికి ఆయుధాలు విక్రయించకూడదు. అమెరికా పౌరసత్వం లేనివారికి కూడా ఆయుధ కొనుగోలు అర్హత ఉండదు. అయితే ఆయుధాలను ఇంట్లో సక్రమంగా భద్రపరచుకోవడం మరో ముఖ్యమైన విధి. 14 ఏళ్లలోపు పిల్లలు పిస్తోలు ఓ ఇంట్లో చిన్న పిల్లలు తుపాకీ వాడిన ఘటన జరిగింది. టివి రిమోట్ ఈయడం లేదని టేదని సొరుగులో ఉన్న పిస్తోల్ తీసి ఓ అమ్మాయి తమ్ముడిని కాల్చివేసింది. తుపాకులను బహిరంగ ప్రదేశాల్లో పెట్టకూడదని, ప్రదర్శిస్తూ వీధుల్లో తిరగకూడదని ఆంక్షలున్నా వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అమెరికాలో జనాభాకు సమానంగా ఆయుధాలు ఉన్నాయి. 65 శాతం జనాభా ఆయుధాలు వాడుతున్నా ఒక్కొక్కరికి ఒకటిని మించి ఉండడమే దీనికి కారణం. అమెరికా తర్వాత సొంత తుపాకులు కలవారు జర్మనీలో 35 శాతం, కెనడాలో 25 శాతం, బ్రిటన్‌లో 10 శాతం ఉన్నారు. అమెరికాలో 40 కోట్ల ఆయుధాలుండగా మన దేశంలో 7 కోట్లు ఉన్నాయి. అనగా 5 శాతం జనాభా దగ్గర ఉన్నాయనుకోవచ్చు. ఆత్మరక్షణే ధ్యేయంగా మొదలైన తుపాకుల సంస్కృతి అమెరికాను విశృంఖల కాల్పుల దేశంగా మార్చివేసింది. బానిసలను అదుపులో ఉంచడానికి, ఎదురు తిరిగిన బానిసల్ని కాల్చివేయడానికి అమెరికన్లకు తుపాకులు అవసరం అయ్యాయి. సువిశాలమైన భూభాగంలో ప్రయాణాల్లో, వ్యవసాయ పనుల్లో మృగాల బారిన పడకుండా రక్షణగా, ఆ తర్వాత వేట వినోదం కోసం తుపాకీ తోడుగా నిలిచింది. 1807లో బానిసల వ్యాపారం రద్దు అయినా తుపాకులు మాత్రం వెంటబడే ఉన్నాయి. దూరదూరంగా ఉండే ఇళ్లలో దొంగతనాలను నిరోధించడానికి తుపాకీ గృహస్థుడికి రక్షణగా ఉంటుంది. మరో ప్రధానమైన సమస్య ఏమిటంటే అమెరికాలో రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు తుపాకీ తయారీ పరిశ్రమలతో బలమైన ఆర్థిక బంధముంది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అమెరికా రాజకీయ గతిని మార్చేంత శక్తివంతంగా తయారైంది. ట్రంప్ తన వంద రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా ఎన్‌ఆర్‌ఎ వార్షికోత్సవంలో పాల్గొన్న ఒకరికొకరి తోడు ఇలాగే కొనసాగాలని ప్రశంసించాడు. ఎన్నికలోల అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేయడంలో రైఫిల్ సంఘం ముందుండి పార్లమెంటును తన గుప్పిట్లో పెట్టుకుని తమ వ్యాపారానికి దెబ్బ తగిలే నిర్ణయాలు రాకుండా జాగ్రత్తపడుతోంది. పౌర హక్కుల కోసం పోరాడే వ్యక్తులను ఎన్నికల్లో గెలవకుండా అడ్డుకుంటోంది. 2016లో దెబోరా రాస్ అనే హక్కుల కార్యకర్త నార్త్ కరోలినా నుండి సెనెట్‌కు పోటీ చేయగా ఆయన ప్రత్యర్థి గెలిచేలా పావులు కదిపింది. తనను కాంగ్రెస్‌లో అడుగుపెట్టకుండా ఎన్‌ఆర్‌ఎ అడ్డుకుంటోదని స్వయంగా రాస్ ప్రకటించాడు. రైఫిల్ సంఘం 2016లో ట్రంప్ విజయానికి 11 మిలియన్ల డాలర్లను వెచ్చించింది. హిల్లరీ క్లింటన్‌ను వ్యతిరేకించే సంఘాలకు 19 మిలియన్ డాలర్ల విరాళాలిచ్చిందని వార్తలు వచ్చాయి. పౌరుల ప్రాణాలకన్నా తుపాకీ పరిశ్రమలే పాలకులకు ప్రీతిపాత్రమైనపుడు సమస్య మరింత జటిలమే అవుతుంది. తుపాకుల సంస్కృతిపై ప్రమాదం సంభవించినపుడే స్పందించడం కాకుండా ఓ ఉద్యమంగా ఎదురొడ్డితే తప్ప ప్రభుత్వాలు సానుకూల నిర్ణయంపై దృష్టిపెట్టవు.

బి.నర్సన్
9440128169