Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

టైటిల్ వేటకు థిమ్, నాదల్

sprts

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ఆస్ట్రియా స్టార్, ఏడో సీడ్ డొమినిక్ థిమ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో థిమ్ 75, 76, 61 తేడాతో ఇటలీ ఆటగాడు మార్కొ సెచ్చినాటోను ఓడించాడు. హోరాహోరీగా సాగిన పోరాటంలో థిమ్ అద్భుత ఆటతో ప్రత్యర్థిని మట్టి కరిపించాడు. ప్రారంభం నుంచే ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. కళ్లు చెదిరే షాట్లతో ఇద్దరు కనువిందు చేశారు. మార్కొ తన మార్క్ షాట్లతో థిమ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. థిమ్ కూడా పట్టు వదలకుండా పోరాడాడు. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో తొలి సెట్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఇద్దరు నువ్వానేనా అన్నట్టు తలపడడంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. ఇందులో థిమ్ పైచేయి సాధించాడు. మార్కొ జోరుకు బ్రేక్ వేస్తూ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. మరోవైపు ప్రత్యర్థి వరుస తప్పిదాలకు పాల్పడడం కూడా థిమ్‌కు కలిసి వచ్చింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన థిమ్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో కూడా పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ప్రారంభం నుంచే ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. ఇద్దరు కళ్లు చెదిరే షాట్లతో విరుచుకు పడ్డారు. దీంతో అభిమానులకు పసందైన ఆటను చూసే అవకాశం దక్కింది. ఇద్దరు పట్టు సడలించకుండా ముందుకు సాగడంతో ఉత్కంఠ పెరిగి పోయింది. అనుకున్నట్టే ఈ సెట్ కూడా టైబ్రేకర్ వరకు వెళ్లకు తప్పలేదు. కానీ, కీలక సమయంలో మార్కొ మళ్లీ ఒత్తిడికి గురయ్యాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న థిమ్ పట్టు బిగించాడు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక మూడో సెట్‌లో ఆస్ట్రియా స్టార్ జోరుకు ఎదురే లేకుండా పోయింది. ప్రారంభం నుంచే థిమ్ చెలరేగి పోయాడు. తొలి రెండు సెట్లలో అద్భుత పోరాట పటిమను కనబరిచిన మార్కొ ఈసారి చేతులెత్తేశాడు. కనీస ప్రతిఘటన కూడా ఇవ్వకుండానే పరాజయం చవిచూశాడు. తేలికగా సెట్‌ను గెలుచుకున్న థిమ్ టైటిల్ పోరుకు చేరుకున్నాడు.
ఎదురులేని నాదల్…
మరో సెమీఫైనల్లో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ రఫెల్ నాదల్ (స్పెయిన్) విజయం సాధించాడు. పదకొండో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌పై కన్నేసిన నాదల్ ఒక విజయం దూరంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన సెమీస్‌లో నాదల్ 64, 61, 62 తేడాతో అర్జెంటీనా స్టార్, ఐదో సీడ్ జువాన్ మార్టిన్ డెల్‌పొట్రోను ఓడించాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన నాదల్ ఏదశలోనూ ప్రత్యర్థికి కోలుకునే ఛాన్స్ ఇవ్వలేదు. దూకుడుగా ఆడుతూ ముందుకు సాగాడు. నాదల్ చెలరేగి ఆడడంతో డెల్‌పొట్రో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో నాదల్ ప్రత్యర్థిపై విరుచుకు పడ్డాడు. పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వరుసగా మూడు సెట్లు గెలిచి టైటిల్ పోరుకు చేరుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో నాదల్ ఆస్ట్రియా స్టార్ డొమినిక్ థిమ్‌తో తలపడుతాడు.

Comments

comments