Home తాజా వార్తలు క్లే కోర్టు కింగ్ నాదల్

క్లే కోర్టు కింగ్ నాదల్

nadal

ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో థిమ్ చిత్తు

పారిస్: ఊహించినట్టే జరిగింది. మట్టి కోటలో తనకు ఎదురు లేదనిస్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ మరోసారి నిరూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో తనకు రొలాండ్ గారస్‌లో ఎదురులేదని చాటాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో టాప్‌సీడ్ నాదల్ 64, 63, 62 తేడాతో ఆస్ట్రియా ఆటగాడు, ఏడో సీడ్ డొమినిక్ థిమ్‌ను చిత్తు చేసి కెరీర్‌లో పదకొండో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. నాదల్ కెరీర్‌లో ఇది 17వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. తనకు అచ్చొచ్చిన క్లేకోర్టులో నాదల్ పదకొండో టైటిల్‌తో చరిత్ర సృష్టించాడు. ఎర్రమట్టిపై తనకున్న అపార అనుభవం ముందు ఎంత పెద్ద స్టార్ అయినా తలవంచాల్సిందేనన్న రీతిలో నాదల్ ఫైనల్లో చెలరేగి పోయాడు. అతని ధాటికి ఆస్ట్రియా ఆశాకిరణం థిమ్ కనీస ప్రతిఘటన కూడా ఇవ్వకుండానే చేతులెత్తేశాడు. టోర్నీ ప్రారంభం నుంచే నాదల్‌ను ఫేవరెట్‌గా పరిగణించారు. అందరి అంచనాలకు అనుగుణంగానే నాదల్ ఒక్కొ అడ్డంకిని తొలగించుకుంటూ ముందుకు సాగాడు. ఫైనల్‌కు చేరే క్రమంలో ఒకటి రెండు మ్యాచుల్లో తప్ప నాదల్‌కు పెద్దగా పోటీ ఎదురు కాలేదనే చెప్పొచ్చు. క్లేకోర్డు కింగ్‌గా పేరొందిన నాదల్ వరుసగా రెండో ఏడాది కూడా చాంపియన్‌గా నిలిచాడు. చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెదరర్ బరిలోకి దిగక పోవడం, నొవాక్ జొకొవిచ్ సెమీస్‌కు చేరుకుండానే నిష్క్రమించడం నాదల్‌కు కలిసి వచ్చింది. తనకు పోటీగా వస్తారని భావించిన సిలిక్, జ్వరెవ్, నిషికోరి తదితరులు ప్రారంభంలోనే వెనుదిరగడంతో నాదల్ పని మరింత సులువైంది. సెమీస్‌లో డెల్‌పొట్రోను వరుస సెట్లలో చిత్తు చేసిన నాదల్ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించాడు. మరోవైపు తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడాలని భావించిన థిమ్‌కు నిరాశే మిగిలింది. కాగా, ఈ విజయంతో నాదల్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు. నాదల్ కంటే కేవలం రోజర్ ఫెదరర్ మాత్రమే ముందంజలో ఉన్నాడు. నాదల్ 17 టైటిల్స్ సాధించగా, ఫెదరర్ 2౦ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇద్దరి మధ్య ఇప్పుడు మూడు టైటిల్స్‌ల తేడాతో మాత్రమే ఉంది. దీంతో ఇకపై జరిగే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో నాదల్, ఫెదరర్‌ల మధ్య హోరాహోరీ ఖాయంగా కనిపిస్తోంది.
అలవోకగా…
థిమ్‌తో జరిగిన ఫైనల్లో నాదల్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ప్రారంభం నుంచే దూకుడగా ఆడుతూ ముందుకు సాగాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో నాదల్ అలరించాడు. కళ్లు చెదిరే ప్రత్యర్థిపై విరుచుకు పడ్డాడు. మరోవైపు థిమ్ కూడా ప్రారంభంలో కాస్త బాగానే ఆడాడు. నాదల్ జోరుకు అడ్డుకట్ట వేస్తూ లక్షం దిశగా సాగాడు. ఇద్దరు నువ్వానేనా అన్నట్టు తలపడడంతో తొలి సెట్ కాస్త హోరాహోరీగానే సాగింది. కానీ, కీలక సమయంలో థిమ్ ఒత్తిడికి గురయ్యాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో నాదల్ సఫలమయ్యాడు. అద్భుత షాట్లతో విజృంభించిన నాదల్ వరుసగా మూడు గేమ్స్ గెలిచి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో మరింత చెలరేగి పోయాడు. ఈసారి నాదల్‌కు ఎదురే లేకుండా పోయింది. థిమ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన నాదల్ లక్షం దిశగా అడుగులు వేశాడు. అతన్ని కట్టడి చేసేందుకు థిమ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండో సెట్ కూడా నాదల్ వశమైంది. ఇక, మూడో సెట్‌లో మరింత రెచ్చి పోయిన నాదల్ సునాయాస విజయాన్ని అందుకున్నాడు. థిమ్ ఈసారి రెండు గేమ్‌లను మాత్రమే సాధించాడు. పూర్తి ఆధిపత్యం కొనసాగించిన నాదల్ 62తో సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో నాదల్ క్లేకోర్టుల్లో తనకు ఎదురే లేదని మరోసారి నిరూపించాడు.