Home దునియా వింత బాంధవ్యం

వింత బాంధవ్యం

Friendship1

ప్రతి మనిషికి ప్రేమ కావాలి. అటెన్షన్ కావాలి. తను చెప్పింది ఎదుటివారు వినాలి కాని ఎదురు చెప్పకూడదు. తిరిగి పోట్లాడకూడదు. ప్రేమ, కేవలం ప్రేమ కావాలి. ఒకటే పరిష్కారం. కుక్కనో, పిల్లినో తెచ్చుకుని పెంచుకోవడమే. చిన్న పిల్లగా తెచ్చుకున్న వాటిని పెరుగుతుంటే చూడటంలో ఒక ఆనందం ఉంటుంది. అంతకుముందు ఎవరితో లేని, ఉండబోనంత గాఢమైన బంధం ఏర్పడుతుంది. యజమానిని ప్రేమించడమే దాని జీవిత లక్షంగా ఉంటుంది. అది యజమాని మీద చూపించే ప్రేమ, విశ్వాసం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఒక చికిత్స. 

‘నేను జీవితంలో ప్రతి విషయంలో ఘోరంగా దెబ్బ తిన్నాను. మంచి జీవితభాగస్వామి ఉండాలనుకున్నాను. కాని అనుకున్నదేం జరగలేదు. మానవ సంబంధాలు నిజానికి చాలా కష్టం’. ఇది అంకిత బాధ. ప్రేమలో మోసపోయి, ప్రేమికుడు/ప్రేమికురాలిని మరిచిపోలేక కొంతమంది ఆవేదన. అసంతోషకరమైన పెళ్లి, విడాకులు, ఇలాటివన్నీ చేదు అనుభవాలను మిగులుస్తాయి. వాటి నుంచి బయటకు రావాలంటే మళ్లీ ఇంకో మనిషిని నమ్మి ప్రేమించాలంటే భయం. ఎందుకంటే మళ్లీ అదే అనుభవం ఎదరువదనే గ్యారంటీ ఏం ఉండదు. అయితే జీవితంలో ఎప్పుడూ మంచి విషయాలే, విజయాలే చూస్తున్నా కూడా నిజమైన ఆనందానికి విలువ తెలీదు. ఆనందాన్ని పంచుకోడాకి ఇంకోరు కావాలి. ఇలా కారణం, వివరం ఏదయినా పెంపుడు జంతువులతో బాంధవ్యాన్ని ఇష్టపడతారు.

పెంపుడు జంతువులతో ఉన్న బాంధవ్యానికి, మానసిక ఆరోగ్యానికి ఉన్న క్లిష్టమైన సంబంధం ఉంది.
మనం మనుష్యులం. అందుకే ముందుగా మానవ సంబంధాలు మెరుగు పరచుకోవడం చాలా ముఖ్యం. కోపతాపాలతోనో, మొండి పట్టుదలలతోనో సొంత మనుషుల్ని కూడా దూరం చేసుకునేవారు ఉంటారు. ఎవరితోనూ ఎక్కువ కలవలేక బలహీనమైన సామాజిక సంబంధాలు కలిగి ఉండేవాళ్లు కొంతమంది. మనుషుల్లో స్వార్థం, అహంకారం పెరిగిపోయాయనో, నమ్మక ద్రోహం చేశారనో మనుషుల మీద విరక్తి, ద్వేషం పెంచుకుని జంతువులను ప్రేమిస్తే అంతకు మరింతగా ప్రేమించి విశ్వాసం చూపిస్తాయని కూడా పెంపుడు జంతువులతో తమ ప్రపంచాన్ని ఏర్పరచుకుంటారు. సామాజికంగా మనుషుల మద్దతు, ప్రేమ అభిమానాలు తక్కువగా ఉండి మానవ సంబంధాలు సరిగా లేకుండా పెంపుడు జంతువులతో మాత్రమే ఎక్కువ అనుబంధం కలిగి ఉండటం వలన ఒంటరితనం, డిప్రెషన్‌కి లోనవుతారు. ఈ సమతౌల్యం పాటించడం చాలా ముఖ్యం.

ఇండియన్ కుక్కలు అన్ని విధాలా భేష్

టివిల ప్రభావం కావచ్చు, సామాజిక స్థాయి కోసం కావచ్చు పెడిగ్రీ మాత్రమే తినే కుక్కల్ని తెచ్చి పెంచుకోవడం ఫ్యాషన్ అయింది. ఎక్కువగా యూరోపియన్, అమెరికన్ బ్రీడ్స్ కుక్కలకు మన దేశంలో కూడా ప్రాముఖ్యత. డాల్‌మేటియన్, పగ్ సెయింట్ బెర్నాడ్ బ్రీడ్‌లు ఈమధ్య మనం సాధారణంగా చూసేవి. కుక్కలను ఇంటికి తెచ్చుకునేవారే కాని వాటి గురించి పూర్తిగా ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పెంచడం కష్టం.

పరిమితమైన ఆహారపు నిబంధనలతో పెరిగే ఆధునిక కుక్కలతో ఇండియన్ కుక్కలు మార్కెట్లో పోటీ పడలేకపోతున్నాయి. వాటికి సరైన ఆదరణ దొరకట్లేదు. మనదేశంలో అభివృద్ధి చెందిన బ్రీడ్‌లు ఇప్పుడు నిర్లక్షానికి గురవుతున్నాయి. నిజానికి మన ఇండియన్ బ్రీడ్ కుక్కలకు వేరేవి సాటి రావు. చాలా ప్రత్యేకమైన కుక్కలు ఇండియన్ బ్రీడ్‌లలో ఉన్నాయి. వాటిలో ఈ తొమ్మిది వేటకుక్కలు కాపలాకి బాగా పనికివస్తాయి. అవి…

చిప్పిపరాయ్
ఇది మనదేశపు ప్రముఖ బ్రీడ్‌లలో ఒకటి. తమిళనాడులో మధురై జిల్లాలో రాయల్ కుటుంబాలవారు పెంచి పోషించారు ఈ బ్రీడ్‌ని. దీన్ని, పంది, జింక, కుందేలు లాటివి వేటాడటానికి వేటకుక్కగా ఉపయోగించేవాళ్లు. ఈ కుక్కలు రాయల్ డిగ్నిటీ(రాచరికపు హోదా)కి ప్రతీకగా ఉండేవి.

ఇండియన్ పరియా
ఇది అత్యంత పురాతనమైన బ్రీడ్.. దీనికి చెందినవే ఆఫ్రికన్ బాసెంజి, ఆస్ట్రేలియన్ డింగో, ఆస్ట్రేలియన్ పోడెంగో. మనం రోడ్ల మీద చూసే స్ట్రే/మాంగ్రెల్ బ్రీడ్ కుక్కలను చూసి ఇదే బ్రీడ్ అనుకుని పొరపడవద్దు.

ముధోల్/కారవాన్ హౌండ్
ఈ బ్రీడ్‌ను రకరకాల పేర్లతో పిలుస్తారు. దక్కను ప్రాంతపు వాళ్లు కార్వాని అంటారు. వేటాడటం కోసం, కాపలా కోసం వీటిని వాడతారు. ఇందులోనే జూలు ఉన్న వెరైటీని ముధోల్ హౌండ్ అంటారు.

రాంపూర్ హౌండ్
దీన్నే రాంపూర్ గ్రేహౌండ్ అంటారు. ఉత్తర భారతదేశంలో రాంపూర్ ప్రాంతపు బ్రీడ్ ఇది. ఆ ప్రాంతంలో మహారాజులు తోడేళ్లు, సింహాలు, చిరుతలను వేటాడేటప్పుడు తమకు రక్షణగా ఈ కుక్కలను ఉపయోగించుకునేవారు. రాంపూర్ హౌండ్ చాలా వేగంగా పరిగెత్తగలదు.

ఇండియన్ మస్టిఫ్
దీన్ని బుల్లీ కుట్టా అంటారు. పం.జాబ్ ప్రాంతానికి చెందినది. కాపలాకి బాగా పనికొచ్చేవి ఇవి. కాని చాలావరకు ఈ కుక్కలను డాగ్ ఫైటింగ్‌లకు కూడా ఉపయోగిస్తారు. అది మాత్రం చాలా బాధాకరమైన విషయం. జంతువుల మీద సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రాజపాళయం
తమిళనాడు లోని రాజపాళయం ప్రాంతానికి చెందింది ఈ బ్రీడ్.. ఇవి కొన్ని యుద్ధాల్లో బ్రిటీషు అశ్వికదళానికి వ్యతిరేకంగా పోరాడాయని కూడా చెప్తారు. తెల్లగా ఉండి పింక్ రంగు ముక్కుతో ఉంటాయి. కాశ్మీరు సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉపయోగిస్తుంది.

కొంబాయ్
ఇది కూడా వేట కుక్క. వీటి దవడలు పెద్దవిగా, బలంగా ఉంటాయి. ఇప్పుడు ఈ బ్రీడ్ దొరకడం కష్టం అవుతోంది. ఏవో కొన్ని ప్రాంతాల్లో తప్పితే ఎక్కడా ఈ బ్రీడ్ లేదు.

గడ్డి
ఇది కూడా మస్టిఫ్ తరహా కుక్క. హిమాలయ ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది ఈ బ్రీడ్. క్రూరజంతువుల నుంచి కాపాడుతుంది. కుక్కల బ్రీడ్‌లలో చాలా తెలివైన బ్రీడ్ ఇది. దీన్ని ఫైటింగ్ డాగ్ అంటారు.

కన్ని
తమిళనాడు బ్రీడ్ ఇది. చిప్పిపరాయ్‌కి దగ్గరగా ఉంటుంది ఇది కూడా. లేళ్లను వేటాడే కుక్క ఇది. కాళ్లు తేలిగ్గా ఎత్తి వేగంగా పరిగెత్తగలదు. యజమానిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది . కేవలం యజమాని సూచనలకు లోబడటం కాకుండా స్వతంత్రంగా పోరాడగలదు. చాలా తక్కువగా దొరికే బ్రీడ్ ఇది. కన్ని బ్రీడ్‌ని అభివృద్ధి చేయడానికి తగిన ప్రయత్నాలు జరగలేదు.