Home ఆఫ్ బీట్ హమ్మయ్య..! రామసేతువు మిగిలినట్టే..!!

హమ్మయ్య..! రామసేతువు మిగిలినట్టే..!!

Ramasethu-images

శ్రీరామచంద్రుడు వానరసైన్యంతో సముద్రంపై వారధి నిర్మించి రావణ లంకపై దండెత్తి విజయం సాధించాడు. రాముడు నిర్మించిన వారధినే రామసేతువు అని పిలుస్తున్నారు. ఈ వారధి గురించి వాల్మీకి రామాయణంలోనూ, రామ చరితమానస్‌లోనూ వివరాలున్నాయి. నలుడు, నీలుడి స్పర్శ సోకి రాళ్లు నీటిలో తేలియాడాయట. యుద్ధకాండ రామసేతు నిర్మాణదశలను వివరించింది. మెుదటిరోజు 14, రెండవరోజు 20, మూడవరోజు21, నాల్గవరోజు 22, ఐదవరోజు 23 యోజనాల రామసేతు నిర్మించినట్లు ఉంది. రామాయణకాలం గడిచి శతాబ్దాలు గడిచినా రామసేతు నేటికి అగుపిస్తూనే ఉంది.

రామేశ్వరం దగ్గరున్న ధనుష్కోటి నుంచి శ్రీలంక దగ్గర ఉన్న మన్నార్ తీరం వరకు నిర్మించిన రామసేతు చారిత్రిక, పురాణ అంశాలను ఆవిష్కృతం చేస్తుంది. అందుకే చరిత్రలో రామేశ్వరాన్ని ‘సేతుబంధ రామేశ్వరం’ అని పిలవడం ఆనవాయితి అయింది. 10 వ శతాబ్దంలో అరబ్ యాత్రికులు ఇక్కడ వంతెన ఉన్నట్లు స్పష్టంగా పేర్కొనగా 1480లో పెనుతుఫాన్ వచ్చి వంతెనలో చాలా భాగం కనుమరుగైంది. అయినా ఈ సేతువు ఆధారాలు చెక్కుచెదరలేదు. వానరసేనతో కలిసి శ్రీరాముడు నిర్మించినట్లు పురాణ ఆధారాలు ఉన్న రామసేతు మానవనిర్మితమని సైన్స్ ఛానల్ పరిశోధనలు చేసి చెప్పడంతో ప్రపంచమంతా ఒక్కసారే రామసేతు వైపు దృష్టి సారించింది. ఇక్కడి ఇసుక నాలుగువేల సంవత్సరాల నాటిదని ఏడు వేల ఏళ్ళక్రితం ఏర్పడిన రాళ్ళను ఇక్కడకు తీసుకువచ్చారని పాశ్చాత్య పరిశోధనల నివేదికలు వెల్లడించాయి. డిస్కవరీ కమ్యూనికేషన్‌కు చెందిన సైన్స్ ఛానల్ ఈ నిర్మాణంపై సంచలన విషయాన్ని బయటపెట్టింది. రామాయణం నిజంగానే జరిగిందని – రామసేతు మానవ నిర్మిత కట్టడమేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన సవివర కథనాన్ని ప్రసారం చేసింది. పూర్తిగా సున్నపురాయి (లైమ్ స్టోన్)తో నిర్మించిన ఈ వారధిలో ఉపయోగించిన రాళ్లు.. నీటి మీద తేలుతూ.. ఇసుక శక్తితో ధృఢంగా నిలిచాయని వెల్లడించింది.

తమిళనాడులోని ఆగ్నేయ ప్రాంతంలోనున్న రామేశ్వరం నుంచి… శ్రీలంకలోని వాయువ్య ప్రాంతంలోని మన్నార్ ప్రాంతం వరకూ నిర్మించిన ఈ వారధిని ఆడమ్ బ్రిడ్జిగా ఆంగ్లేయులు వ్యహరించారు. 2002 లో నాసా అంతరక్షం నుంచి తీసిన ఒక చిత్రంలో రామసేతు స్పష్టంగా కనిపించడంతో ఈ వంతెన గురించి శాస్త్రీయ అధ్యయనం ప్రారంభమైంది. రామసేతు దగ్గరి రాళ్ళపై పరిశోధనలు జరిగాయి. భారత్-శ్రీలంక మధ్యనున్న అంతర్జాతీయ జలాల్లో ఈ రామసేతువు ఉంది. వారధి విషయంలో వాస్తవాలు వెలికి తీసేందుకు దాదాపు 30 మైళ్ల దూరం వరకు సైంటిస్టులు పరిశోధనలు చేయడం విశేషం. ఈ రాళ్ళు లావాతో ఏర్పడే ప్యూమిస్ రాళ్ళు కావడంతో నీటిలో తేలియాడుతున్నాయని వాదించినా ప్యూమిస్ రాళ్ళు కొద్దిసేపు మాత్రమే నీళ్ళపై తేలియాడుతాయి. రాముని మహిమతోనే వేలాది సంవత్సరాలుగా ఈ రాళ్ళు నీటిమీద తేలియాడుతున్నాయనే నమ్మకానికి కార్బన్ డేటింగ్ బలం చేకూర్చింది. గతంలో శ్రీరామ వారధిని తవ్వి శ్రీలంకకు దారి వేయాలనే తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నించడంతో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం రామసేతువు మానవ నిర్మితంకాదని, దానికి ఎలాంటి చారిత్రక ప్రాధాన్యతా లేదని సుప్రీంకోర్టుకు చెప్పింది. ఆ రాళ్ళగుట్టను తొలగించడానికి ఎలాంటి అభ్యంతరాలులేవని క్లీన్‌చిట్ ఇవ్వడంతో ఆందోళన మిన్నంటింది. చాలాకాలం కోర్టు జోక్యంతో సేతువు కూల్చివేత పనులు నిలిచిపోయాయి. ఇటీవలే ఎన్‌డీఏ ప్రభుత్వం రామసేతు నిర్మాణాన్ని కూల్చబోమని, ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తామని ప్రకటించింది. దాంతో రామభక్తుల గుండెలు చల్లబడ్డాయి. రామసేతు నిర్మాణం తొలగించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. శ్రీరామచంద్రుడు వానరసేనతో నిర్మించిన రామసేతు తాత్విక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్న నిర్మాణం. ఆ సేతు శీతాచలానికి ప్రేరణగా నిలుస్తున్న సేతువు పదికాలాలు నిలిచి మరిన్ని రామాయణ రహస్యాలను వెలుగులోకి తేవాల్సి ఉంది.