Home తాజా వార్తలు ఖజానాలో నిధుల కొరత లేదు: ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి

ఖజానాలో నిధుల కొరత లేదు: ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి

 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఖజానాలో నిధుల కొరత లేదని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాధాన్యమైన పథకాలకు అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణమాఫీ అమలు చేస్తామని వివరించారు. 15 శాతం జిఎస్‌డిపి వృద్ధిరేటుతో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని వెల్లడించారు. తెలంగాణ సొంత పన్ను రాబడుల్లో అగ్రగామిగా ఉందని చెప్పారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.1,64,519 కోట్ల ధన వ్యయం చేశామని, పూర్తియిన పనులకు రూ.3474.22 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందన్నారు. ఎన్నికల నియమావళి వల్ల ఎక్కడైనా చెల్లింపుల్లో జాప్యం జరిగి ఉండొచ్చని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ పనులకు ఇంకా రూ.659.40 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందన్నారు. రైతు బంధు, పెంచిన పింఛన్లు, రైతుబీమాకు నిధులు బడ్జెట్‌లో పొందుపర్చామన్నారు. రైతు రుణమాఫీకి సరిపడా నిధులను బడ్జెట్‌లో పొందుపరిచామని, ఎన్నికల కోడ్ ముగియగానే రైతు బంధు సాయం చేస్తామని, మే నెలాఖరు నుంచి జూన్ తొలి వారం వరకు రైతుబంధు సాయం అందుతుందని, ఆన్‌లైన్ ద్వారానే రైతుబంధు సాయం అందజేస్తామని వెల్లడించారు. ఆర్‌బిఐ బాండ్లు కొనుగోలు చేయడం సాధారణమేనని, 2019-20లో రూ.29,751 కోట్ల వరకు రుణం తీసుకునే అవకాశం ఉందని రామకృష్ణరావు తెలియజేశారు.

 

Funds Available in Telangana Budget: Rama Krishna Rao