Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) ఎయిర్‌టెక్ పేరుతో నిధుల గోల్‌మాల్

ఎయిర్‌టెక్ పేరుతో నిధుల గోల్‌మాల్

జలమండలిలో బినామీలదే హవా

AIRTECH

మన తెలంగాణ/సిటీ బ్యూరో : ఎయిర్‌టెక్ మిషన్ల పేరుతో జలమండలి నిధుల దుర్వినియోగం పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైనేజీ పనుల నిర్వహణ పేరిట జలమండలిలో ప్రైవేట్ ఎయిర్‌టెక్ మిషన్ల ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు దండుకుంటున్నా ప్రభుత్వం పట్టించు కోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. జలమండలి చేపట్టే ప్రతి పనిలో కొందరు అధికారులు తమ జేబులు నింపుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా జలమండలిలో బినామీ పేర్లతో ఎయిర్‌టెక్ మిషన్ల ఏర్పాటు చేసి డ్రైనేజీ పనుల పేరుతో పెద్ద ఎత్తున దండుకుంటు న్నట్లు తెలిసింది. ప్రస్తుతం జలమండలిలో మొత్తం 57 ఎయిర్ టెక్ మిషన్లు ఉన్నాయి.

ఇందులో పది జలమండలికి చెందినవి కాగా, మిగితా 47 ఎయిర్‌టెక్ మిషన్లు ప్రైవేట్ వ్యక్తులకు చెందినవి. ప్రస్తుతం జలమండలిలో కొనసాగుతున్న ప్రైవేట్ ఎయిర్‌టెక్ మిషన్లను చాలా వరకు గతంలో బోర్డులో పని చేసిన మాజీ అధికారులకు చెందినవిగా ఆరోపణలు ఉన్నాయి. 1996లో జలమండలి మొట్ట మొదటి సారిగా 8 ఎయిర్‌టెక్ మిషన్లను కొనగోలు చేసి వాటిని డ్రైనేజీ పూడికతీత పనుల కోసం వినియోగించింది. కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిన ఆ మిషన్లు పాడైపోయాయి. దీంతో అధికారులు వాటిని మరమ్మత్తుల పేరిట గ్యారేజీలకు పంపించారు. అనంతరం ఎయిర్‌టెక్ మిషన్ల అవసరాన్ని గుర్తించిన అధికారులు కొత్తవి కొనుగోలు చేయకుండా ఢిల్లీలో వాడిన పాత మిషన్లను కొనుగోలు చేసి తీసుకుని వచ్చి వాటిని వినియోగించారు. అవి కూడా పాడైపోవడంతో పది ఎయిర్‌టెక్ మిషన్ల ను కొనుగోలు చేసిన అధికారులు కావాల్సినన్ని మిషన్లను కొనుగోలు చేయలేకపోయారు. రానురాను నగరంలో డ్రైనేజీ సమస్యలు పెరిగిపోవడంతో ప్రైవేట్ మిషన్లను అద్దెకు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. దీనిని ఆసరాగా చేసుకుని మాజీ డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు బినామీల పేరుతో ప్రైవేట్‌గా ఎయిర్‌టెక్ మిషన్లలో జలమండలిలో పెట్టి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్న ట్లు తెలిసింది.

ప్రస్తుతం జలమండలి, ప్రైవేట్‌కు చెందిన 57 ఎయిర్‌టెక్ మిషన్లతో నగరంలోని రెండున్నర లక్షల మ్యాన్‌హోళ్లు, 5 వేల కిలో మీటర్ల మేర విసర్తించి ఉన్న డ్రైనేజీ పైపులైన్ వ్యవస్థను శుభ్రం చేయిస్తున్నారు. ఒక్కో డివిజన్‌కు రెండు ఎయిర్‌టెక్ మిషన్ల వినియోగిస్తున్నారు. అయి తే ప్రైవేట్ ఎయిర్ మిషన్లు నిర్వహణ కోసం అధికారులు లక్షాలాది రూపాయలు చెల్లిస్తున్న, పూడిక తీత పనులు సక్రమంగా జరగడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం 24 గంటల పాటు జలమండలిలో అందుబాటులో ఉండాల్సిన ప్రైవేట్ ఎయిర్‌టెక్ మిషన్లు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే పని చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

డ్రైనేజీ పూడిక తీత పనుల్లో ప్రైవేట్ ఎయిర్‌టెక్ మిషన్ల డ్రైవర్లు, సిబ్బంది పూర్తి నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ యంత్రాలతో పని చేయించిన తరువాత కూడా తిరిగి ఫిర్యాదులు వస్తున్నాయంటే వీటి పని తీరుకు అద్దం పడుతుంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ ఎయిర్‌టెక్ మిషన్ల నిర్వాహకులు చేయని పనులకు సంబంధించి కూడా బిల్లులు పెట్టి డబ్బులు దండుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్ ఎయిర్‌టెక్ మిషన్ల నిర్వహణపై జలమండలి అధికారులకు పలు ఫిర్యాదులు అందుతున్న అవి తమ మాజీ అధికారులకు చెందనవి కావడంతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం, జలమండలి ఉన్నతాధికారు లు స్పందించి ఎయిర్ యంత్రాల మాటున జరుగుతున్న దోపిడీని ఆరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.