Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు నిధులు కరవు

Metro-Train

ప్రధాని నరేంద్రమోడీ స్వప్నంగా భావించే బుల్లెట్‌రైలు ప్రాజెక్టుకు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు నిధుల సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. కేంద్ర ఆర్థిక మంత్రి ఈ పాజెక్టుకు నిధులు మీరే సమకూర్చుకోవాలని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. బడ్జెట్ నుంచి దీనికి అదనంగా నిధులు ఆశించివద్దని కూడా రైల్వే శాఖకు సూచించారు. 1.08 లక్షల కోట్ల రూపాయలతో తలపెట్టిన ఈ భారీ ప్రాజెక్టుకు ఈ ఏడాది భూసేకరణ కోసం దాదాపు 10 వేల కోట్ల రూపాయలు కావలసి ఉంది. సరుకుల రవాణా కారిడార్ ప్రాజెక్టుకు కూడా 5వేల కోట్లు కేటాయించడానికి ప్రభుత్వం కట్టుబడింది. మొత్తం 18 వేల కోట్ల రూపాయలు కావాలని ఆర్థిక శాఖను జాతీయ రవాణా శాఖ కోరింది.

దీనిపై ఆయా శాఖల మంత్రులతో సమావేశాలు జరిగాయి. కానీ వేరేగా నిధులు సేకరించుకోవాలని రైల్వేశాఖకు ఆర్థిక శాఖ సూచించింది. తరువాత ఆర్థిక శాఖ ఆ రుణాలను చెల్లిస్తుందని నచ్చచెప్పింది. అయితే ఈ రుణాల చెల్లింపు భారాన్ని ఏటా తాము భరించలేమని రైల్వేశాఖ చేతులెత్తేసింది. రుణాలు బయటి నుంచి తీసుకురావడమంటే ఈ ప్రాజెక్టు వ్యయం విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని రైల్వే శాఖ అభిప్రాయ పడుతోంది. జపాన్ నుంచి అతి తక్కువ నామమాత్రపు వడ్డీతో రుణం తీసుకురావాలని యోచిస్తోంది. అయితే భాగస్వామ్య పద్ధతి ప్రకారం ప్రభుత్వం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్)కు రూ.10 వేల కోట్లు చెల్లించవలసి ఉంది. ఇందులో గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు రెండూ చెరో 5 వేలు కోట్లు వంతున భరించవలసి ఉంది. మిగతా మొత్తం 0.1 శాతం వడ్డీపై జపాన్ నుంచి రుణం తీసుకోవలసి ఉంటుంది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం నిధుల కొరత లేదని చెబుతోంది. ఆర్థిక లోటు రాకుండా చూడడానికే ఈ ప్రయత్నంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. వేరే విధంగా ప్రాజెక్టులకు నిధులు సమీకరించడం ప్రభుత్వ విధానాల్లో ఒక భాగంగా వారు పేర్కొన్నారు. అయితే రైల్వేలకు సంబంధించి తన ఆర్థిక విభాగం ఇండియన్ రైల్వే పైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సి) నుంచి రుణం తీసుకురావడం ఒక్కటే ప్రత్యామ్నాయం. వివిధ ప్రాజెక్టులను అమలు చేయడానికి ఎల్‌ఐసి నుంచి రుణం తీసుకునే పద్ధతి పరిపాటి. కానీ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ఎల్‌ఐసి నుంచి రుణం తెచ్చుకోవడం సమస్యే. ఎందుకంటే భారత రైల్వే నిబంధనల ప్రకారం లాభసాటి ప్రాజెక్టులకే ఆ విధంగా రుణం తీసుకురావాలి. తిరిగి ఆర్థికంగా లాభాలు తెచ్చే వాటికే ఎల్‌ఐసి రుణం వినియోగిస్తారు. అయితే ప్రస్తుత ఆర్థిక బడ్జెట్‌లో ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రయన్ ప్రాజెక్టుకు 1800 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇంతకు మించి నిధులు ఇవ్వలేమని ఆర్థికశాఖ తెల్చి చెప్పడం గమన్హారం.
-మన తెలంగాణ, పరిశోధన విభాగం

Comments

comments