Home దునియా అమ్మలక్కల ముచ్చట్లు

అమ్మలక్కల ముచ్చట్లు

Women's-Meeting

ఊర్లల్ల అమ్మలక్కల ముచ్చట్లు గమ్మతిగుంటయి. సకల సమాచారం ఆ ముచ్చట్లల్ల ఇనపడతది. అసలు అమ్మలక్కల ముచ్చట్లు అంటే ఆడవాల్లు ఒక దగ్గర కూసోసి పెట్టుకునే ముచ్చట్లు అసలు ఆడవాల్లకు తీరికగా కూసునే అలవాటు ఉంటదా! ఉండది. అయితె వాల్లు పని చేసు కుంటనే మాట్లాడుకుంటరు. ఎట్ల నంటే ఎక్కువగా ఊల్లె ఆడోల్లు అంత బిందెలు పట్టుకొని మంచి నీళ్ల బాయి కాడికి పోయి నీళ్లు తెచ్చుకునేది. అక్కడ కాస్తా పని రికాము దొరికితె అక్కడ ముచ్చట్లు పెట్టుకుంటరు. ఆ ముచ్చట్లలో అత్తకోడండ్ల ముచ్చట్లు వదినె మరుదండ్ల ముచ్చట్లు ఆడితిప్పల ముచ్చట్లు మొగడు పెండ్లాల లొల్లి నుంచి మొదలె పెడితె ఎవలింటికన్న సుట్టాల వస్తే పెండ్లిలు పెట్టుకుంటే, పెండ్లి సూపులకు వస్తే, పుష్పవతి అయితె ఇట్లా రకరకాల ఆడ ముచ్చట్లు ఉంటయి.

ఆడ ముచ్చట్లు అని ప్రత్యేకంగా ఎందుకు అన్ననంటే అవి వాల్లకు మాత్రమే పరిమితమైన భాషలోనూ ఉంటయి. ఎవలన్న మగ పురుగు అటు కనిపిస్తే అంత సులువుగ వాల్ల ముచ్చట్లు ఉండక పోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆడోల్ల కష్ట సుఖాలు చెప్పుకుంటరు. ఇవి శేదబాయి కాడ, అందరు కల్సి పొలం కలుపు తియ్యంగ, నాట్లు వేయంగ లేదా సకినాలు పోయంగ, లడ్డూలు తయారు చెయ్యంగ, ఎల్లిపాయలు పొట్టు తీయంగా, పల్లి కాయ పొట్టు తీయంగ మక్క కంకులు బూరు తియ్యంగ, చెలిమె కాడికి పోయి నీళ్లు తెచ్చుకోంగ ఇట్లా ఆడవాల్లు మాత్రమే పని చేసే చోట్ల రకరకాల ముచ్చట్లు ఉంటయి.

ఆ ముచ్చట్లల్లనే తీర్పులు ఉంటయి తప్పులను ఎంచుడు ఉంటది. కోడండ్లను ఏంచుక తినే అత్తల ముచ్చట్లు ఉంటయి. సాలు ఎనుక సాలు రాదా అనే శాపనార్థాలు ఉంటయి. అయ్యవ్వను అరుసుకోనోల్ల ముచ్చట్లు ఉంటయి. ఏది పాలు ఏది నీళ్ళు అనే ఇమరశ సుత ఆ ముచ్చట్లల్ల ఉంటయి. ఇంకో రకం ముచ్చట్లు సుత ఉంటయి. అక్కడ ఉన్న గుంపు అందరికి తెల్సిన ముచ్చట్లు గాకుండ గుసగుస ముచ్చట్లు సుత ఉంటయి. ఏదైన రహస్యం చెప్పేటప్పుడు ఆడోల్లు ఒగల చెవుల ఒగలు చెప్పుకుంటరు. ఈ సమాచారం ఆమె ఇంకో ఆమెకు అంటిస్తది. రహస్యమే అయినా బహిరంగం అయి అందరి నోట్లల్ల నానుతది. ఈ రహస్యాలు ఎక్కువగా రీతి తప్పిన సంబంధాలకు సంబంధించినవి ఉండవచ్చు. కొందరు ఇవతల గోడ నుంచి అవతల ఇంటి గోడ మీది ఆడోల్లకు చెప్పుతుంటరు.

ఇవే గాకుండా ఇంటికి సుట్టాలు వస్తే పెద్ద ఎగిలి వారంగ లేసి ఇంటికి వచ్చిన సుట్టాలతోని ముచ్చట పెట్టుకుంటరు. ముఖ్యంగా తల్లి తన తల్లితో తోడబుట్టిన వాల్లతో ఇంట్ల ఎవలు లేవనప్పుడు అన్ని ముచ్చట్లు చెప్పుకుంట నెత్తికి నూనె రాసుకుంటరు. అప్పుడైన ఏదైన చేతిల పని చేసికుంటనే ముచ్చట్లు కడుపు నిండ పెట్టు కుంటరు. ఇంక బాయికాడికి కల్సి పోయేటప్పుడు ఇట్లా స్త్రీలు ముచ్చట్లు కథలు కథలుగా పెట్టుకుంటరు. ఈ రోజుల్ల ఇట్లా ముచ్చట్లు పెట్టుకోకుండ ఊర్లల్ల సుత టెలివిజన్ సీరియల్లు వచ్చి సత్తె నాశనం చేసినయి. రాత్రి ‘8’ గంటలకే ఇండ్లల్ల తలుపులన్ని మూసుకొని టీవి సీరియల్లు సూస్తు అదొక మానసిక అంటు వ్యాధితో ఉంటున్నరు. ఇక చదువుకున్నోల్లు కూడా కాస్త ఇరాం దొరికితే సాలు ‘స్మార్ట్ ఫోన్‌లలో ఆటలు వాట్సప్‌లు ఫేస్ బుక్క్‌లు సూస్తు ఏకాంతంగా కాలం గడుపుతున్నరు ఏదీ ఏమైన నలుగురు కల్సి పని చేసికుంట పెట్టిందే అసలైన ముచ్చట్లు.

– అన్నవరం దేవేందర్, సెల్ :9440763479