Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) కార్డుకు గాలం!

కార్డుకు గాలం!

నమ్మారో…ఇక అంతే సంగతులు
సైబర్ నేరగాళ్లు ఉన్నారు…తస్మాత్ జాగత్త..!
బ్యాంకు ఖాతాలో నగదు మాయంపై పెరుగుతున్న ఫిర్యాదులు

నగదు రహితంను వరంగా  మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్ళు
అప్రమత్తతతోనే భద్రత

 CRIME

 పాత నోట్ల రద్దు తరువాత  నగదు రహిత లావాదేవీలు పెరుగుతుండడంతో సైబర్ నేరగాళ్లు డెబిట్, క్రెడిట్ కార్డులపై పడ్డారు. ప్రస్తుత తరుణాన్ని వారు అవకాశంగా మల్చుకుని అమాయకులపై వల విసురుతున్నారు. బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసి  ఎటిఎం కార్డుపై ఉన్న నెంబర్లను చెప్పండి’ అంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. అయితే అమాయకంగా వారి మాటలు నమ్మి వివరాలు చెప్పిన వారి అకౌంట్‌ల నుండి పెద్ద మొత్తంలో నగదును తస్కరిస్తున్నారు. తీరా విషయం తెలిసాక బాధితులు లబోదిబోమంటున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సైబర్ నేరాలపై     ‘మన తెలంగాణ’ ప్రత్యేక కథనం

మన తెలంగాణ/సిటీ బ్యూరో : పాత నోట్ల రద్దు తరువాత ప్రజలు ఎక్కువగా నగదు రహిత లావాదేవీలు పెంచారు. వీటిపై సైబర్ నేరగాళ్లు కన్ను పడింది. ఈ అవకాశాన్ని వారు వరంగా మార్చుకుంటున్నారు. ఫలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం ‘మీ ఎటిఎం కార్డుపై ఉన్న నెంబర్లను చెప్పండి’ అంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మూడు రోజుల వ్యవధిలోనే ఆరు ఘటనలు చోటుచేసుకున్నాయని అదనపు డిసిపి క్రైమ్స్ డి.జానకి తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తరువాత బ్యాంకులకు సరిపడ కొత్త నోట్లు పూర్తిస్థాయిలో రాకపోవడంతో ఖాతాదారులకు అనుకున్నంత నగదు డ్రా కావడం లేదు. దీంతో ప్రజలు ఎక్కువగా డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించడం పెరిగిపోయింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు సైబర్ నేరగాళ్లు డెబిట్, క్రెడిట్ కార్డుదారులకు ఫోన్‌లు చేసి గాలం వేస్తున్నారు. సైబరాబాద్, నగర పోలీసు కమిషనరేట్, రాచకొండ పరిధిలో తమ డెబిట్ కార్డులోంచి అక్రమంగా డబ్బులు డ్రా చేశారంటూ ప్రతి రోజు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. తరచూ వస్తున్న ఇలాంటి ఫిర్యాదులపై పోలీసులు అప్రమత్తమయ్యారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం వల్లనే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని పోలీసు అధికారులు అంటున్నారు. ఎవరైనా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటే నమ్మకండి, ఒకవేళ నిజంగా బ్యాంకు నుంచే ఫోన్ చేస్తే మీ కార్డు వివరాలు వారు అడగరు, అలా కార్డు వివరాలు అడిగారంటే వారు సైబర్ నేరగాళ్లన్న సంగతి మరచిపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రజలను చైతన్య పరిచేందుకు రాచకొండ సైబర్ క్రైమ్ అదనపు డిసిపి డి.జానకీ కొన్ని సూచనలు చేశారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్‌లలో సైబర్ నేరాలపై సిబ్బందితో పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. ఇలాంటి నేరాలు జరగకుండా అడ్డుకునేందుకే కొన్ని సూచనలు జానకీ గురువారం మీడియాకు విడుదల చేశారు. డెబిట్, క్రెడిట్ కార్డుల వెనుక ఉన్న కార్డు నెంబర్, కార్డు వెనకాల ఉన్న సివివి నెంబరు, కార్డు కాల పరిమితి తేదీలు ఎవరికి చెప్పవద్దని ఆమె తెలిపారు. ఎవరైనా ఈ వివరాలు అడిగారంటే వారి ఫోన్ నెంబర్లు నోట్ చేసుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

 క్రెడిట్, డెబిట్ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనక విధిగా సంతకం చేయాలి. ఈ విషయంలో చాలామంది నిర్లక్షంగా వ్యవహరిస్తుంటారు. ఇది సరికాదు.
దుకాణ యజమానులు సైతం ఎవరికైనా కార్డు ద్వారా లావాదేవీలు జరిపినప్పుడు వారి సంతకాన్ని కార్డుపై ఉన్న దాంతో సరిచూడాలి. దీని వల్ల ఇతరులు ఆ కార్డులను వినియోగిచడానికి అవకాశం ఉండదు.
ప్రతి కార్డుకి వెనుక భాగంలో మూడు అంకెల సివివి (కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ) నెంబర్ ఉంటుంది. దీన్ని కచ్చితంగా గుర్తుంచుకుని, కార్డుపై లేకుండా చెరిపేయాలి.
మీ కార్డులను స్వైప్ చేయడానికి ఎవరికైనా ఇచ్చినప్పుడు..మీ దృష్టి ఆ ప్రిక్రియపైనే ఉంచండి. దీనివల్ల స్కిమ్మింగ్‌కు అవకాశాలు తక్కువవుతాయి.
మీ క్రెడిట్ కార్డును చాలా కాలం పాటు వినియోగించకుండా ఉంటే..ఆ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేయండి. సంబంధిత అకౌంట్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేయించండి.
ఆన్‌లైన్ ద్వారా వ్యవహారాలు సాగించినట్లయితే..మీరు వినియోగిస్తున్న సైట్ అడ్రస్ (http://)తో ప్రారంభమైతేనే ముందుకు వెళ్లండి.
కార్డులను పొగొట్టుకున్న వెంటనే సంబంధిత బ్యాంకుకు టోల్‌ఫ్రీ, ఇతర నెంబర్ల ద్వారా సమాచారం ఇచ్చి తక్షణం బ్లాక్ చేయించండి.
ఫలనా బ్యాంకు నుంచి చేస్తున్నామంటూ..వచ్చే ఫోన్లను నమ్మకండి, మీ ఖాతాకు క్రెడిట్, డెబిట్ కార్డులకు చెందిన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని, పిన్ నెంబర్లను చెప్పకండి.
మీ కార్డు ద్వారా లావాదేవీలు జరిగిన ప్రతిసారీ ఆ సమాచారం ఈ-మెయిల్, ఎస్‌ఎమ్మెస్ ద్వారా మీకు వచ్చేలా చూసుకోండి. ప్రతి బ్యాంకు ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఒక్కసారి సంబంధిత అధికారుల్ని సంప్రదించి యక్టివేట చేసుకుంటే చాలు.
‘కార్డుల’ ద్వారా జరిగే మోసాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తల్ని తెలుసుకోవడానికి నగర పోలీసు వెబ్‌సైట్ (www.hyderabadpolice.govt.in) చూడండి.

అప్రమత్తత అవసరం : అదనపు డిసిపి జానకి
డెబిట్, క్రెడిట్ కార్డు కలిగిన బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉంటే వారి నగదును సైబర్ నేరగాళ్లు దొంగిలించలేరు. ఈ-మెయిల్, ఫోన్ ద్వారా అపరిచిత వ్యక్తులు పంపించే సందేశాలకు స్పందించకండి. ఎవరైనా ఫోన్ చేసి మీ డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు అడిగితే ఒక్క క్షణం ఆలోచించాల్సిందే. ముఖ్యంగా కార్డువెనకాల ఉన్న సివివి నెంబర్‌ను ఎవరికి చెప్పవద్దు. బ్యాంకు అధికారులు ఫోన్‌లో అడిగినా సరే నిరాకరించండి. ఇలాంటి వివరాలపై వచ్చే ఫోన్ నెంబర్లను నోట్ చేసుకుని పోలీసులకు సమాచారం ఇవ్వండి.డెబిట్, క్రెడిట్ కార్డుల వెనకాల ఉన్న సివివి నెంబర్‌ను తుడిచేయండి, ఆ నెంబర్‌ను ఎక్కడైనా మీకు గుర్తు ఉండేలా రాసుకోండి, నోట్ చేసుకోండి.

అప్రమత్తత అవసరం : అదనపు డిసిపి జానకి
డెబిట్, క్రెడిట్ కార్డు కలిగిన బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉంటే వారి నగదును సైబర్ నేరగాళ్లు దొంగిలించలేరు. ఈ-మెయిల్, ఫోన్ ద్వారా అపరిచిత వ్యక్తులు పంపించే సందేశాలకు స్పందించకండి. ఎవరైనా ఫోన్ చేసి మీ డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు అడిగితే ఒక్క క్షణం ఆలోచించాల్సిందే. ముఖ్యంగా కార్డువెనకాల ఉన్న సివివి నెంబర్‌ను ఎవరికి చెప్పవద్దు. బ్యాంకు అధికారులు ఫోన్‌లో అడిగినా సరే నిరాకరించండి. ఇలాంటి వివరాలపై వచ్చే ఫోన్ నెంబర్లను నోట్ చేసుకుని పోలీసులకు సమాచారం ఇవ్వండి.డెబిట్, క్రెడిట్ కార్డుల వెనకాల ఉన్న సివివి నెంబర్‌ను తుడిచేయండి, ఆ నెంబర్‌ను ఎక్కడైనా మీకు గుర్తు ఉండేలా రాసుకోండి, నోట్ చేసుకోండి.