Home జాతీయ వార్తలు ఆయన కరుణించలేదు.. చిల్లిగవ్వ ఇవ్వలేదు

ఆయన కరుణించలేదు.. చిల్లిగవ్వ ఇవ్వలేదు

Galla-Jayadev1

ఢిల్లీ: అమరావతి నిర్మాణానికి 30 వేల ఎకరాలు ఎందుకని మా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, ముంబయి నగర విస్తరణకు 48 వేల ఎకరాలు సేకరిస్తున్న విషయం మీకు గుర్తుకు రాలేదా అని టిడిపి ఎంపి గల్లా జయదేవ్ ప్రశ్నించారు. లోక్‌సభలో ఎన్‌డిఎ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గల్లా మాట్లాడారు. యుసిలకు సబంధించిన పత్రాలను సభకు తీసుకొచ్చామని, ఎవరైనా చూసూకోవచ్చని, గుంటూరు నగరానికి కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించిన అంశాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన నిధుల్లో 92 శాతం ఖర్చు చేశామని, 12 శాతమే ఖర్చే చేసిందని బిజెపి నాయకులు చెబుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వాస్తవ విషయాలను గమనించాలని, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని ఎపి ప్రత్యేక హోదా ఇవ్వలని విజ్ఞప్తి చేశారు.

వాస్తవ లెక్కలన్నీ కాగితాలు చూసే చెప్పాలని, నోటికి వచ్చినట్లు చెప్పలేమన్నారు. లోక్‌సభలో సమయం విషయంలో ఇక్కడ కూడా మమ్మల్ని వివక్షకు గురిచేయవద్దని స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరారు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినవాటిలో తమ రాష్ట్రానికే ప్రత్యేకంగా ఇచ్చినవి ఏవీ లేవని స్పష్టం చేశారు. చట్టంలో భాగంగా అన్ని రాష్ట్రాలను ఇచ్చిన మాదిరిగానే ఎపికి నిధులు ఇచ్చారని, ఎపిపై అదనంగా కురిపించిన వరాల జల్లులేవీ లేవని కేంద్రాని నిలదీశారు. కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10శాతం భాగస్వామ్యంతో అభివృద్ధికి నిధులిస్తామని ఆర్థిక మంత్రే చెప్పారని ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు.

ఇంత జరిగినా కేంద్ర ఆర్థిక మంత్రి కరుణించలేదని, చిల్లిగవ్వ విదల్చలేదని గల్లా ధ్వజమెత్తారు. జిఎస్‌టి అమలు తరువాత ప్రత్యేక హోదా అనేదే ఉండదని కేంద్రం చెప్పందని, దేశంలో వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులే ఎపిలో వెనకబడిన జిల్లాలకు ఇచ్చారని గుర్తు చేశారు. కెబికె, బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ తమకెందుకు ఇవ్వలేదని మోడీ ప్రభుత్వాన్ని అడిగారు. ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల పేరు చెప్పి తమపై అనేక ఆంక్షలు విధించారని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును రాజకీయ క్రీడలో భాగం చేశారని కేంద్రంపై విరుచుకపడ్డారు. ఎపి ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే మోడీ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని దుయ్యబట్టారు. టిడిపి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని బిజెపి, వైసిపి, జనసేన పార్టీలు ఆరోపణలు చేశాయని, తాము ఎక్కడ యూటర్న్ తీసుకున్నామో మీరు చెప్పాలని గల్లా ప్రశ్నించారు.