Home తాజా వార్తలు ఇది ఆధిపత్యానికి, నైతికతకు మధ్య పోరు…

ఇది ఆధిపత్యానికి, నైతికతకు మధ్య పోరు…

Galla-Jayadev

ఢిల్లీ: లోక్ సభలో అవిశ్వాసంపై టిడిపి ఎంపి గల్లా జయదేవ్ చర్చ ప్రారంభించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చిన పార్టీలన్నింటికి గల్లా ధన్యవాదాలు తెలిపారు. తొలిసారి ఎంపికైన తనకు ఇంత గొప్ప అవకాశం దక్కిందన్నారు. మార్చి 17న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇది బిజెపి, టిడిపి మధ్య యుద్ధమని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు  బిజెపికి, టిడిపికి మధ్య జరుగుతున్నది యుద్ధం కాదని, ఆధిపత్యానికి, నైతికతకు మధ్య జరుగుతున్న పోరాటమని తెలిపారు. మోడీ ప్రభుత్వం ఎపికి చేసిన వాగ్దానం నెరవేర్చకపోవడం గౌరవం కాదని దుయ్యబట్టారు.

ఇది భరత్ అనే నేను సినిమా సందేశమన్నారు. పార్లమెంటులో చేసిన వాగ్దానం నెరవేర్చకపోవడమనేది జాతీయ సమస్యగా మారిందని వివరించారు. భారతదేశంలో భాగమైన ఎపికి కనీస బిజెపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించిన అనంతరం కొత్తగా ఏర్పడింది ఎపి అని తెలంగాణ కాదని స్పష్టం చేశారు. అనేక సమస్యల సుడిగుండంలో ఎపి ఉందని, విభజన జరిగి నాలుగేళ్లు అవుతున్న కనీస సౌకర్యాలు ప్రజలకు అందించలేకపోతున్నామని, మోడీ ప్రభుత్వం ఎపిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండడంతో ఎపి మరింత వివక్షకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎపికి ఇవ్వాల్సింది కేంద్రం ఇవ్వలేదని, హామీలు నెరవేర్చలేదన్నారు. ఎపి పునర్విభజన చట్టాన్ని అప్రజాస్వామికంగా ఆమోదించారని ఇదే సభలో విభజన బిల్లు ఎలా ఆమోదించారో ప్రతి ఒక్కరికి తెలుసని, విభజనతో ఎపి భారీగా నష్టపోయిందని ధ్వజమెత్తారు.  రూ.16 వేల కోట్ల కనీస రెవెన్యూ లోటును కూడా పూడ్చుకోలేని పరిస్థితిలో ఎపి ఉందని, ఇంకా రూ.24 వేల కోట్లు లోటును కేంద్రం భర్తీ చేయాల్సి ఉందని తెలియజేశారు.

అప్రజాస్వామికంగా ఉమ్మడి ఎపిని విభజించారన్న గల్లా జయదేవ్ వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్ ఎంపిలు అభ్యంతరం తెలిపారు. దీంతో టిడిపి, టిఆర్‌ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.