Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

గర్వంగా నిలిచిన గణసముద్రం

Lake

వేలసంవత్సరాల సుదీర్ఘచరిత్రను ఒడిలో దాచుకున్న తెలంగాణ  మట్టిపొరల్లో మహా అద్భుతాలు దాగిఉన్నాయి. సముద్రమట్టానికి సగటున 480 నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉన్న దక్కన్ పీఠభూమిలో విస్తరించిన తెలంగాణలో సముద్రాలులేని లోటును వందల సంవత్సరాల క్రితం ఆనాటి రాజవంశాలు తీర్చి చెరువులను సముద్రాల పేరుతో నిర్మించి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన ఆధారాలు పుష్కలంగా లభిస్తున్నాయి.కళ్యాణి చాళుక్యులతో ప్రారంభమైన చెరువుల నిర్మాణం కాకతీయుల కాలంలో ఉద్యమంగా కొనసాగింది. కాకతీయరాజులు,సామంతరాజులు చెరువుల నిర్మాణాల్లో భాగస్వాములయ్యారనడానికి మహబూబ్‌నగర్ జిల్లాలోని గణసముద్రం ఓ తార్కాణం.గణపురప్రాంతాన్ని రుద్రమదేవి కాలంలో వర్థమానపురం (నేటి మహబూబ్ నగర్) పాలకుడైన గోనగన్నారెడ్డి సోదరుడైన విఠలుని కొడుకు  బుద్దారెడ్డి రంగనాథ రామాయణం రాసి చరిత్రపుటల్లో నిలిస్తే ఆయన కొడుకు గోన గణపరెడ్డి సుస్థిరపాలకుడిగా ప్రఖ్యాతిగాంచాడు.

కాకతీయుల సామంతులుగా రాజ్యపాలన చేసిన గోన గణపరెడ్డి తండ్రిపేరుమీద గోపాల్ పేటలో బుద్దేశ్వర ఆలయం. గణపురంలో గణపతేశ్వర ఆలయం. ఈశాన్యంలో  కోటనిర్మించి పెద్దచెరువును తవ్వించి చరిత్రలో నిలిచారు. గణపురం లోని గుట్టల్లో కాకతీయుల సామంతులు మేడికోట,బండకోట,వీరన్న కోట,ఆగారం కోట,తక్కిళ్ళకోట, వావిళ్ళకోట, బర్వనికోటను నిర్మించి చెరవుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. గణసముద్ర నిర్మాణంతో వ్యవసాయం అభివృద్ధి చెందింది.

పొంగిపొరలే నీరు ఈచెరువుకు సొంతమైంది. కాకతీయుల వాస్తురీతులతో నిర్మించిన గణసముద్రం ఆనాటి వర్థమాపురంలో సుప్రసిద్ధి చెందింది. గణసముద్రం  ప్రస్తావన 18 జులై 1099 లోని పోలెపల్లి శాసనం లో ఉంది. ఈ చెరువు గణపురం గుట్టు దేవునిగుట్ట, కొండయ్యగుట్ట, వీరన్నగుట్ట, చౌడమ్మగుట్ట, చంద్రమ్మగుట్ట, ముర్రయ్యగుట్ట,దుర్గంగుట్ట లను అనుసంధానంచేస్తూ గణపురం కోటకు నీరు అందించినట్లు తెలుస్తుంది. అలాగే ఎన్నో సముద్రాలకు నిలయమైన మహబూబ్ నగర్ లో వనపర్తిలో సప్తసముద్రాల నిర్మాణం ఎంతో ప్రసిద్ధ్దిగాంచింది. సంస్థానాధీశులు సముద్రాలను నిర్మించి కరువును దూరంగా తరిమివేశారు,

ప్రాంతం           తటాకం పేరు                         కాలం                      నిర్మాత
శ్రీరంగాపురం    రంగసముద్రం                   1654-1676               అష్టభాషా బహరిగోపాల రావు
శ్రీరంగాపురం    వీరసముద్రం                    1654-1674                అష్టభాషా బహరిగోపాలరావు
శ్రీరంగాపురం    గాయనిసముద్రం              1654-1674                అష్టభాషా బహరిగోపాలరావు
వెంకటాపురం    రాయసముద్రం                1625-1653                ఇమ్మడి వెంకటరెడ్డి
సంకిరెడ్డిపల్లి      కృష్ణసముద్రం                   1592-1625                 పెద్దవెంకటరెడ్డి
కాసాయపల్లి    శంకరసముద్రం                  1866-1892                 రాణిశంకరమ్మ
పెబ్బేర్            మహాభూపాల్ సముద్రం      1893-1922                 రెండవరామేశ్వర రావు

వి. భూమేశ్వర్, మనతెలంగాణ ప్రతినిధి

Comments

comments