Home తాజా వార్తలు మూడు దశాబ్దాలకు నిండిన గణపసముద్రం

మూడు దశాబ్దాలకు నిండిన గణపసముద్రం

 sea

 తవ్వారు..తెలంగాణ సర్కారు నింపింది 

(మన తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి):ముప్పై ఏండ్లుగా బీడుపడిన చారిత్రక నేపథ్యం ఉన్న గణప సముద్రం నిండి అలుగు పారుతున్నది. ప్రతి చెరువు అలుగు పారాలన్న ప్రజల ఆకాంక్ష గణప సముద్రంతో తీరినట్లయింది. రైతు బతుకుదెరువుకు చెరువులే జీవనాడులు. తెలంగాణ రాష్ర్టం వచ్చిన మూడేండ్లకు చెరువులు ఆనందతాండవం చేస్తున్నాయి. మూడేండ్లలోనే వేలాది ఎకరాలకు నీరందిస్తున్న చెరువులిపుడు సముద్రాలను తలపిస్తున్నవి. మిషన్ కాకతీయను ఉద్యమంలా చేపట్టడం వల్లనే చెరువులు, వాగులు వంకలు నిండుతున్నవి. ఇంక రావనుకున్న నీళ్ళు కండ్లముందరే నిండుతుంటే రైతులకు సంబురమేస్తున్నది.
గణప సముద్రం చరిత్ర
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మారుమూల ఖిల్లా గణపురంలో గణప సముద్రం ఉంది. 12వ శతాబ్దం చివరిలో కాకతీయులు నిర్మాణం ప్రారంభించి, 13 వ శతాబ్దం తొలి నాళ్లకు పూర్తి చేసినట్లు చరిత్రలో ఉంది.సప్త సముద్రాలలో ఒకటైన గణపసముద్రాన్ని కాకతీయ సామంత పాలకుడు గోనగన్నారెడ్డి గణపతిదేవుడి పేరుమీద ఈ చెరువును తవ్వించాడు. కిలోమీటర్ల పొడవు, 29 అడుగుల లోతులో చెరువును కట్టారు. దీని నిర్మాణానికి 34 ఏళ్లు పట్టిందని చరిత్రకారులు చెబుతుంటారు. అప్పటి నుంచి ఈ చెరువు నిండినట్టు ఆధారాలు లేవు. ప్రతాప రుద్రుని కాలంలో ఒకసారి చెరువు కొంత నిండినట్టు చెబుతున్నారు. గడిచిన వందేళ్ల లో మూడుసార్లు మాత్రమే నిండింది. 1964, 1981లో కొంచెం నిండగా మళ్లీ నేడు 2018లో కల్వకుర్తి నీటితో కళ కళలాడుతోంది. సముద్రం పూర్తిగా నిండడంతో ఆ మండలమంతా సస్యశ్యామలమవుతున్నది. మండలంలోని మామిడిమాడలోని నేరెడు చెరువుతోపాటు ఖిల్లా గణపురం తాండ సమీపంలో ఉన్న ఎర్రకుంటను రిజర్వాయరుగా మార్చి తే ఖిల్లాగణపురం మండలానికి శాశ్వతంగా నీరు అందుతుందని ఈ ప్రాంతపు రైతులు అంటున్నారు.
మాట తప్పని మంత్రి
గతంలో పాలమూరుకు వెళ్లిన హరీశ్‌రావును ఖిల్లా గణపురం రైతులంతా కలిసి, గణప సముద్రానికి నీళ్లివ్వాలని కోరగా, తప్పకుండా ఇస్తామని మంత్రి మాట ఇచ్చారు. జీరో పాయింట్ నుంచి గణపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా గణప సముద్రం నింపారు. 600 ఏళ్ల తరువాత చెరువు నిండటం ఇదే తొలిసారి అని రైతులు సంబర పడుతున్నారు. దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షాలు వల్ల చెరువు నిండటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జల మట్టం కూడా అనూహ్యంగా పెరిగింది. ఈ చెరువు పరిసర ప్రాంతాల్లోని దాదాపు 190 బోర్లు రీ చార్జ్ అయ్యాయని రైతులు సంతోషంగా ‘మనతెలంగాణ’కు చెబుతున్నారు.
80 వేల టన్నుల ధాన్యం దిగుబడి
నీటిపారుదల మం త్రి హరీశ్‌రావు కృషితో గణపురం ఆనకట్టకు 3.5 టీఎంసీల నీళ్లు ఇచ్చి బీడుభూముల్లోకి మళ్లించారు. కేవలం 11 నెలల 3 రోజుల రికార్డు సమయంలో కేఎల్‌ఐ బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి గణప సముద్రం చెరువును నింపారు. ఈ ఏడాది గణపురం ఆనకట్ట కింద 80 వేల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, గణప సముద్రం చెరువు కింద వచ్చే సీజన్‌లో 3 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఎత్తిపోతల పథకం 29 ప్యాకే జీ ద్వారా ఖిల్లాగణపురం బ్రాంచ్ కెనాల్‌ను నిర్మించి గణప సముద్రానికి సాగునీరందించడం ఊహకందని విషయం. దీంతో గణపురంలోని ప్రజలే గాక చుట్టుముట్టూ గ్రామాల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు.
బంగారంగా మారుతున్న బంజరు భూమి
‘ గతంలో ఇక్కడ సాగునీరు లేక భూములన్నీబీడుగా మారాయి. ఈ చెరువు నిండినంక 1000 ఎకరాల వరకు సాగుకు అనువుగా మారాయి. దుక్కి దున్ని విత్తులేద్దామనుకుంటన్నాం ’ అని మల్కాపూర్ గ్రామస్తులంటున్నారు.