Home తాజా వార్తలు గణపతి దేవుని న్యాయ విశిష్టత

గణపతి దేవుని న్యాయ విశిష్టత

Kakatiya'sగణపతిదేవుని ఘనతను తెలియజేసే అరుదైన రెండు శాసనాలు కరీంనగర్ జిల్లా మంథనికి చెందినవే. అందులో ఒకటైతే 770 సంవత్సరాల నుంచి మోతేరాం సంజీవరావు కుటుంబ సంరక్షణలో ఉన్నదే. ఇది రాగి రేకుల శాసనం. దీనిని ఆయన రాష్ట్ర ప్రభుత్వ పురావస్తు శాఖ వారికి ఇచ్చి అందులోని విషయం ప్రపంచానికి తెలియజేసేటట్లు కృషి చేశారు. మరొక శాసనం రాతి ( శిలా) శాసనం. ఇది మంథనిలోని తమ్మ చెవురు కట్ట మీదున్న హనుమంతుని గుడిలోని స్తంభానికి చెక్కి ఉంది. రాగి శాసనం గణపతి దేవ చక్రవర్తి న్యాయానికి ఎంత విలువ ఇచ్చేవాడు అనే విషయం తెలియజేస్తుంది. ఇది పైన పేర్కొన్న రాతి శాసనం వేయించిన తరువాత సరిగ్గా నలభై ఏడవ సంవత్సరంలో అనగా క్రీ.శ. 1246 డిసెంబర్ 15 శనివారం (విక్రమ శకం 1303 పరాభవ నామ సంవత్సరం పౌష్య మాసం శుద్ధ షష్టి ) నాడు రాయించబడింది. ఇది ఒక కాలువ వివాదంలో గణపతి దేవుడిచ్చిన తీర్పును గురించి వివరిస్తుంది. అది: నేఢవూరు అనే గ్రామంలో (కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం) ఉండే గొనుగు కాలువ మీద హక్కు గురించి వివాదం తలెత్తింది. రవిదత్తుడు, నాథదేవుడు, హింగదేవుడు అనేవారు అక్కడి స్థానిక అధికారులు – ఈ వివాదాన్ని గణపతిదేవుని దృష్టికి తీసుకువెళ్ళారు.

ఆయన తన గజ సైన్యాధిపతి జాయప దేవుని మంత్రి అయిన మంచిరాజును వివాదాన్ని పరిష్కరించమని నియమించి పంపాడు. మంచిరాజు నేఢవూరును దర్శించి, వివాదానికి సంబంధించిన గ్రామాలైన చామనపల్లి, కుమ్మరికుంట, దేవనపల్లి, కట్యకోలపల్లి గ్రామాల మహాజనులను (బ్రాహ్మణులు), పెద్దలను సమావేశపరిచి వారి అభిప్రాయాలను సేకరించాడు. ఈ అభిప్రాయాలను ఓరుగల్లుకు వెళ్ళి గణపతిదేవునికి వినిపించాడు. మంచిరాజు నివేదిక ఆధారంగా గణపతిదేవ చక్రవర్తి తన తుది తీర్పును నేఢవూరు ప్రాంత రాజప్రతినిధి అయిన మహారాజు అక్షయ చంద్రదేవుని సమక్షంలో ప్రకటించి స్థానికాధికారులకు, గ్రామ ప్రజలకు ఆ తీర్పును తెలియజేయడానికి ప్రాడ్వివాకుడు (న్యాయమూర్తి) అయిన శ్రీపాఠకుని మేన అల్లుళ్ళయిన నారాయణ, మహారూక అనే అధికారులను చామనపల్లికి పంపించాడు. ఈ అధికారులు మళ్ళీ విచారణ జరిపి, మంచిరాజు నివేదిక సరైనదని నిర్ధారించుకొని రాజు తీర్పును రాగి శాసన రూపంలో ప్రకటించారు.

కాలువ మీద అధికారం చామనపల్లి మహాజనులదేనని, ఇతర గ్రామాల ప్రజలకు దాని మీద ఎటువంటి హక్కు లేదని ఆ తీర్పు ప్రకటించింది. పై శాసన వివరణను బట్టి గణపతిదేవుని కాలంలో న్యాయం విషయంలో సామాన్యులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించడానికి అవకాశముండేదని, రాజు కూడా ప్రజాభిప్రాయాన్ని ఎంతో గౌరవించేవాడని, ప్రజలు – ప్రభువు సాధారణంగా న్యాయబద్ధంగా వ్యవహరించేవారని స్పష్టంగా తెలుస్తున్నది. ఇలా న్యాయం సరిగా అమలైనప్పుడు పైన పేర్కొన్న రాతి శాసనంలో వివరించినట్లు రాజ్యంలో శాంతి సౌభాగ్యాలు విలసిల్లడం సాధ్యమే. అలాంటి గణపతిదేవుని పాలన తెలంగాణలో పునరుద్ధరించబడితే ప్రజలకు మరోసారి స్వర్ణయుగాన్ని అందుబాటులోకి తేవచ్చు. అది త్వరలో సాకారం కావాలని, చంద్రునికో నూలు పోగు లాగా ఈ విషయాన్ని జనసామాన్యానికి చేరవేయడానికి నా వంతు కృషి చేసే అదృష్టం కలిగినందుకు సంతోషిస్తున్నాను.