Home ఎడిటోరియల్ కనిపించని నయీంల సంగతేంది?

కనిపించని నయీంల సంగతేంది?

Nayeem-Encounterవారం రోజులుగా ప్రింట్, ఎలాక్ట్రానిక్ మీడియా తక్కువ వాస్తవాల్ని, ఎక్కువ ఊహాగానాల్ని మేళవిస్తూ గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ మీద ప్రత్యేక కథనాలు వండి వడ్డిస్తున్నాయి. ఒక రకంగా దుర్మార్గుణ్ణి హీరోగా ప్రొజెక్ట్ చేస్తున్నరు. ఇది మిస్‌గైడెడ్ యువతను డెడ్ ఎండ్ వైపు నడిపిస్తది. సోషల్ మీడియా కూడా తమ వంతు ‘బాధ్యత’ నిర్వహిస్తోంది. బాధితుల తరపున కథనాల కన్నా బాధ్యుడిపైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. సరే.. బాధ్యుడు కరడు గట్టిన హింసోన్మాది నయీం చనిపోయిండు. అది వాస్తవం. ‘ఎన్‌కౌంటర్’లో చనిపోయిండా, పట్టుకొచ్చి చంపేసిండ్రా? దీని వెనుక పోలీసులున్నరా? నాయకులున్నరా? ఢిల్లీ పెద్దలున్నరా? ఎవ్వరు లేరా? అనే విషయం తేలాల్సి ఉంది. అయితే వీటన్నింటి కన్నా ముందు ఒక మామూలు రౌడీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతలను, వాళ్ళను నడిపించే వారిని వణికించే స్థాయికి ఎలా ఎదిగిండు? దానికి కారణం ఎవ్వరు అనేది పరిశీలించాలి. ఆయుధాల సరఫరా, ట్రెయినింగ్, గైడెన్స్ ఎవరిది? అనేది కూడా లెక్కలోకి తీసుకోవాలి.

విద్యార్థి దశలో రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో పని చేసిన నయీం ఆ తర్వాత ఆలేరు బాలన్న దళంలో చేరిండు. పీపుల్స్‌వార్‌కి దగ్గరయిండు. 1990లో యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాల్లో బాంబు పేల్చి అరెస్టయిండు. జైల్లో పీపుల్స్‌వార్ అగ్రనాయకుల సహచర్యంతో రాటుదేలిండు. లోపమెక్కడుందో గానీ పీపుల్స్ వార్ సిద్ధాంతం నయీంకు ఒంట బట్టలేదు. అయితే ఆయు ధాన్ని ఏ అవసరానికి ఎలా వాడాలో మాత్రం పర్‌ఫెక్ట్‌గా నేర్చుకున్నడు. డిఐజీ వ్యాస్‌ను చంపడానికి నయీంని పీపుల్స్ వార్ ఒక ఆయుధంగా వాడుకుంది. సిద్ధాంత బలంలేని ఆ ఆయుధం ఒక హింసోన్మాది రూపం తీసుకుంది. నిజానికి కోవర్టు రూపంలో బూమరాంగ్‌ని వార్ తయారు చేసుకుంది. బెల్లి లలిత, పురుషోత్తం, ఈదన్న, ఆజం అలీ, కనకాచారి, సాంబశివుడు, కొనపురి రాములు, పటోళ్ళ గోవర్ధన్‌రెడ్డి ఇట్లా అనేక మంది హతం కావడానికి ఈ ఆయుధమే కారణం. పులిమీద స్వారీ చేసేవాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక మజిలీ లో దాన్ని దిగక తప్పదు. దిగిన వెంటనే ఆ పులి వారిని తినక మానదు. నయీం కథ కూడా అట్లనే ముగిసింది.

‘పీపుల్స్‌వార్ అగ్రనాయకులు శాఖమూరి అప్పా రావు, పటేల్ సుధాకర్‌రెడ్డిలతో విబేధాలు రావడం’తో ఐజీ స్థాయి పోలీసు అధికారుల అండతో పోలీసులకు లొంగిపోయిండు. పోలీసుల కనుసన్నల్లోనే బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నక్సలైట్లను ఖతం చేయడం తన జీవిత లక్ష్యమని ప్రకటించిండు. ఇట్లా లొంగిపోయిన నయీంని తొలుత నక్సలైట్లను, హక్కుల కార్యకర్తలను చంపేం దుకు పోలీసులు కిరాయి హంతకునిగా వినియో గించుకున్నరు. నక్సల్ ప్రభావిత తెలంగాణ జిల్లాల్లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఉన్న ఐపీఎస్ అధికారు లందరూ నయీం ‘సేవలు’ వినియోగించు కున్నరు. లెక్క చెప్పా ల్సిన అవసరం లేని డబ్బు కుప్పలు తెప్పలుగా ఉండ డంతో దాన్నిఎరగా వేసి ‘కోవర్టు’ వ్యవస్థకు తెర లేపిండ్రు. నయీంతో పాటుగా కత్తుల సమ్మయ్య, బయ్యపు సమ్మిరెడ్డి, జడల నాగరాజు, గోవిందరెడ్డి, సోమ్లా నాయక్, శివకుమార్ ఇట్లా అనేక మంది కోవర్టులు తయారయిండ్రు. అంతేగాదు నార్స కోబ్రాస్, బ్లాక్ కోబ్రాస్, కాకతీయ కోబ్రాస్, క్రాంతిసేన, గ్రీన్ టైగర్స్, బ్లాక్ టైగర్స్, ఫియర్ వికాస్ పేరిట భయానక వాతావర ణాన్ని సృష్టించారు. పోలీసుల కనుసన్నల్లో ఈ కార్యకలా పాలు రూపొందేవి. అమలయ్యేవి. వీటిని అమలు జేస్తున్న నయీంకు పీపుల్స్‌వార్ నుంచి ప్రమాదం ఉందని పోలీసులు తమ పహారాలో పూర్తి రక్షణ కల్పించారు.

నయీం సృష్టించిన భయానక వాతావరణాన్ని ఆసరాగా చేసుకొని పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసు కున్నరు. పరిష్కారం కోసం తమ పరిశీలనకు వచ్చిన కేసులను డైరెక్ట్‌గా నయీంకి అప్పగించి టాప్ టూ బాటo పోలీసు వ్యవస్థ మొత్తం తమ అవసరాలను తీర్చుకుంది. ఆటవిక రాజ్యం సాగింది. ముఖ్యంగా రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు, హైదరాబాద్ చుట్టు పక్క ల అనేక మంది ఐపిఎస్ అధికారులు, ఎస్పీలు, ఏసిపిలు నయీం అంటే విధేయత ప్రకటించేవారు. దానికి తగ్గట్టుగానే కొన్ని కోట్ల రూపాయలు, ప్లాట్లు, ఫ్లాట్లు నజరానా గా వాళ్ళకు దక్కినాయి. ఐపిఎస్‌లే గ్యాంగ్ స్టర్‌తో లావా దేవీలు నిర్వహించడంతో ఎస్సై స్థాయి పోలీ సులకు నయీం అనుచరులకు అండగా నిలవడం, ప్రోత్స హించడం తప్పనిపించలేదు. నయీం ‘సేవలు’ చట్ట బద్ధంగా వినియోగించుకున్నరు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం మాత్రమే కాదు ఆయన ఇన్ఫార్మర్ ‘సేవల్ని’ గుజ రాత్ లాంటి రాష్ట్రాలు కూడా వినియోగించుకున్నాయి. గుజరాత్‌లో 2003లో నరేంద్రమోడి మంత్రివర్గం లో హోం మినిస్టర్ హరేన్ పాండ్యా హత్యకేసులో నయీం (కలీముద్దీన్) ప్రధాన నిందితుడు. ఈ హత్యకు భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకులే కారకులని పాండ్యా భార్య అప్పట్లో ఆరోపించింది. తర్వాత 2005 లో పోలీస్ ‘ఎన్‌కౌంటర్’లో గ్యాంగ్‌స్టర్ సోహ్రబుద్దీన్‌షేక్ చనిపోయిండు.

ఆయన భార్య కౌసర్‌బీని కూడా పోలీ సులు చంపేసిండ్రు. ఈ కేసులో నిందితుల్ని పట్టు కోవ డంలో విఫలమవుతున్న గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. ఈ విషయంలో అప్పటి ఆ రాష్ర్ట హోంమంత్రిగా ఉన్న అమిత్‌షా న్యాయవిచారణను తప్పు దారి పట్టిస్తున్నారని సుప్రీంకోర్టులో కేసుకూడా దాఖ లైంది. సోహ్రబుద్దీన్‌ని పట్టించిందీ, ఆయన పక్క సీట్లో కూర్చొని ప్రయాణించిందీ నయీమే అని గుజరాత్ పోలీ సుల అనుమానం. ఈయన కోసం అక్కడి పోలీసులు గత 11ఏండ్లుగా వెతుకుతున్నరు. ఆ వెతుకులాట మోడి తెలంగాణ రాష్ట్రానికి మొదటిసారిగా వచ్చిన తెల్లారే ముగిసింది. మెదక్ జిల్లాకు చెందిన ఒక సాహితీవేత్తను కూడా నయీం బెదిరించిండు. దీంతో ఆయన కొంతమంది జర్నలిస్టు మిత్రులతో అప్పటి హోంమంత్రి దేవేందర్ గౌడ్ ని కలిసి చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసిండు. గౌడ్ వారితో మాట్లాడుతూ నా చేతిలో ఏమీ లేదు. అంతా పై వాళ్ళే చూసుకుంటున్నరు. ఈ విషయంలో నేనేమి సహాయం చేయలేను అని తేల్చి చెప్పిండు. మొన్న దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ నయీంని పెంచి పోషించింది చంద్రబాబు నాయుడే అని చెప్పిండు. ఈ సంఘటన, ఆయన ఆరోప ణలు రెండూ కలిపి చూసినట్లయితే సీమాంధ్ర పాలకులు ఎంతటి నైచ్యానికి ఒడిగట్టారో అర్థమైతది. నయీం డైరీలో ఉన్న రాజకీయ నాయకుల చిట్టా పూర్తి గా బైటికి రావాల్సి ఉన్నది. నిజాయితీగా డైరీల్లో ఉన్న వారి పేర్లు బయటికి రావాలి. దోషులు ఏ రాష్ర్టంలో ఉన్నా శిక్షించాల్సిందే!

పోలీసులు, పొలిటీషియన్లు ఇద్దరూ కలిసి ఒక హింసోన్మాద నేర సామ్రాజ్యాన్ని పెంచి, పోషించిండ్రు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు బాధితులను బెదిరించిండ్రు. నేరస్థులకు అండగా నిలిచిండ్రు. పోలీసు ల అండతో భూకబ్జాలు, లాండ్ సెటిల్మెంట్స్, ధమ్కీలు, వసూళ్ళు ఈ గ్యాంగ్‌ల నిత్యకృత్యమయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించిన ఈ నేర సామ్రాజ్యం దాదాపు 20వేల కోట్లకు విస్తరించింది అంటే ఇది ఎంత పెద్ద నెట్‌వర్క్ అనేది అర్థమైతది. రాజకీయ నాయకులు, పోలీసులు, మీడియా చానల్స్ యజమానులు, జర్నలిస్టులు ఇట్లా ఈ నెట్‌వర్క్ లో చాలా మంది భాగస్వాములున్నరు. ప్రతి డీల్ గురించి సీడీల్లో పక్కా ఎవిడెన్స్ ఉందని తెలుస్తోంది. వీళ్లందరూ పైకి కనిపించని నయీంలు. అంతెందుకు ఈ నేరగాళ్ళు అర్ధరాత్రి పూట ఎమ్మార్వో కార్యాలయాల్లో భూములు తుపాకి మొన అంచున రిజిస్ట్రేషన్ చేయించు కున్నరు. ఒక్క భూములే కాదు, ఫ్లాట్లు, బిల్డింగ్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు ఏదినచ్చితే అది రిజిస్ట్రేషన్ చేయించుకున్నరు. టివి ఛానల్ స్థాపించ డానికి ఏర్పాట్లుచేసుకున్నరు. లైంగికదాడులకు తెగ బడిండు. ఏకె 47లాంటి అత్యాధునిక మారణా యుధాలు, కోట్లకొద్ది నగదు, కిలో ల కొద్ది బంగారం, సెటిలైట్ ఫోన్ – తెలంగాణ నలుమూలాల అనుచరులతో నయీం హల్‌చల్ చేసిండు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డ తర్వాత నయీం గ్యాంగ్ దూకుడు పెంచింది. ప్రభుత్వానికి అత్యంత ఆప్తులైన రియ ల్టర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసిండ్రు. అంతేగాదు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖరరెడ్డిని, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని చంపేస్తామని బెదిరించిండ్రు.

అంతకు ముందు టిఆర్ ఎస్ బాధ్యులు కొనపురి సాంబశివుడు ఆయన తమ్ముడు రాములును చంపే యడం ప్రభుత్వంలో కదలిక తీసు కొచ్చింది. శేఖరరెడ్డికి నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దు అని వార్నింగ్ ఇవ్వడమే గాదు అక్కడి నుంచి తాను స్వయంగా పోటీ చేసేందుకు కూడా నయీం స్కెచ్ వేసిండు. ఇన్నేండ్లు పోలీసులకు నయీం ఆచూకి దొరుకక కాదు. ఆయన అవసరం ఇంకా ఉంది గనక రక్షించిండ్రు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో అవసరం తీర డంతో ‘ఎన్‌కౌంటర్’ అయిండు. పోలీసులు తాము తయారు చేసిన హింసోన్మాదిని తమ శాఖలో ఉన్న ఆయన ఇన్ఫార్మర్లకు తెలియకుండా ‘ఆపరేషన్’ పూర్తి చేసిండ్రు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం క్రెడిబిలిటీ సామాన్య ప్రజల దృష్టిలో పెరిగింది. సమైక్యాంధ్రలో సృష్టించబడ్డ సమస్యకు తెలంగాణలో సమాధానం దొరికింది. ఇక ముందు ఇలాంటి కుక్కమూతి పిందెలు తలెత్త కుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. రాష్ర్టం నలు మూలాలా ఉన్న నయీం అనుచరులను వెంటనే అరెస్టు చెయ్యాలి. ‘సిట్’ పరిశోధనలో వేగాన్ని పెంచి దోషులు ఎంతటి వారైనా కఠిన శిక్ష పడేలా చూడాలి. అలాగే భవిష్యత్‌లో ఇట్లాంటి చట్ట వ్యతిరేక శక్తులు పుట్టుక రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. నిజానికి నయీం చేతిలో చనిపోయిన వాళ్ళందరూ ఇండైరెక్ట్‌గా పోలీసుల చేతిలో చనిపోయినట్టే. వాళ్ళం దరూ పోలీసుల చేతిలోనే చనిపోయినట్టుగా భావించి వారి కుటుంబ సభ్యులకు పదిలక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిం చాలి. లేదా ప్రభుత్వోద్యోగం ఇవ్వాలి. కబ్జాకు గురైన భూముల్ని న్యాయవిచారణ చేసి వాటి అసలు హక్కు దారులకు అందేలా చర్యలు తీసుకోవాలి. అలాగే నయీం చేతిలో చావు అంచుల వరకు వెళ్ళొచ్చిన పౌర హక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ లక్ష్మణ్ చెప్పిన ట్లుగా ఈ ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ కూడా చేయించాలి. – నివాస్