Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

విరాట్‌కోహ్లి కంటే గంగూలీ బెటర్: క్లార్క్

Clarkeముంబయి: విరాట్ కోహ్లితో పోల్చితే తన దృష్టిలో సౌరవ్ గంగూలీ అత్యుత్తమ కెప్టెన్ అని ఆస్ట్రేలియా మాజీ సారథి మైఖేల్ క్లార్క్ అభిప్రాపడ్డాడు. భారత జట్టులో పోరాట పటిమను పెంచి పోషించడంలో గంగూలీ పాత్ర వేలకట్టలేనిదన్నాడు. గంగూలీకి ముందు ఏ భారత కెప్టెన్ కూడా ఇంతలా దూకుడుగా వ్యవహరించలేదన్నాడు. యువ ఆటగాళ్లలోని ప్రతిభను వెలికితీసి వారిని ఉత్తమ క్రికెటర్లుగా తీర్చిదిద్దిన ఘనత గంగూలీకే దక్కుతుందన్నాడు. గంగూలీ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత భారత జట్టు ఆటలో పెను మార్పులు చోటు చేసుకున్నాయన్నాడు. లక్ష్యాన్ని ఛేదించడంలో, లక్ష్యాన్ని కాపాడుకోవడంలో గంగూలీ జట్టుకు ఎదురే లేకుండా పోయిందన్నాడు. సొంత గడ్డపై, విదేశాల్లో భారత్‌ను ముందుండి నడిపించిన ఘనత గంగూలీకి దక్కుతుందన్నాడు. జట్టులో ఆత్మస్థైర్యాన్ని నింపడంలో గంగూలీ దిట్టగా మారాడని, అతని సారథ్యంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగిన విషయాన్ని క్లార్క్ గుర్తు చేశాడు. అతని సారథ్యంలో టీమిండియా కొన్ని చారిత్రక విజయాలను సొంతం చేసుకున్న విషయాన్ని మరువకూడదని అన్నాడు. యువరాజ్, సెహ్వాగ్, హర్భజన్, ధోనీ, రైనా, మునాఫ్, ఇర్ఫాన్, యూసుఫ్ వంటి ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తెచ్చిన ఘనత గంగూలీకే దక్కుతుందన్నాడు. అతను యువ క్రికెటర్లకు సదా అండగా ఉండేవాడని, వారిని మంచి క్రికెటర్లుగా తీర్చి దిద్దేందకు సర్వం ఒడ్డేవాడని క్లార్క్ పేర్కొన్నాడు. అతని సారథ్యంలోనే భారత్ ప్రపంచ క్రికెట్‌లో బలమైన జట్టుగా ఎదిగిందన్నాడు. తర్వాత బాధ్యతలు తీసుకున్న ద్రావిడ్, కుంబ్లే, ధోనీలు భారత్‌ను మరింత పటిష్ట జట్టుగా తీర్చిదిద్దారని క్లార్క్ గుర్తు చేశాడు. కాగా, కోహ్లితో పోల్చితే కెప్టెన్‌గా గంగూలీకే తాను అగ్రస్థానం ఇస్తానని క్లార్క్ స్పష్టం చేశాడు. కోహ్లి కూడా మెరుగైన సారథి అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అయితే గంగూలీ సారథ్యం చేపట్టే నాటికి టీమిండియా చాలా బలహీనంగా ఉందన్నాడు. అటువంటి జట్టును అగ్ర జట్ల సరసన చేర్చిన గంగూలీ అంటే తనకు చాలా గౌరవమన్నాడు.
హోరాహోరీ ఖాయం..
కాగా, భారత్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే వన్డే సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయమని క్లార్క్ జోస్యం చెప్పాడు. రెండు జట్లలోనూ ప్రతిభకు కొదవలేదన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమంగా ఉన్నాయన్నాడు. అయితే సొంత గడ్డపై ఆడనుండడం భారత్‌కు కాస్త కలిసి వచ్చే అంశమన్నాడు. అయినా ఆస్ట్రేలియాను కూడా తక్కువ అంచనా వేయలేమన్నాడు. వార్నర్, స్మిత్, ఫల్కనర్, మాక్స్‌వెల్ తదితరులతో ఆస్ట్రేలియా చాలా బలంగా ఉందన్నాడు. కమిన్స్, అష్టన్ అగర్, ఆడమ్ జంపా తదితరులతో బౌలింగ్ కూడా బలంగా ఉందన్నాడు. ఈ సిరీస్‌లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడం తథ్యమన్నాడు. కాగా, స్మిత్‌తో పోల్చితే విరాట్ కోహ్లి వన్డేల్లో మెరుగైన ఆటగాడు అనడంలో సందేహం లేదన్నాడు. అంతేగాక కెప్టెన్‌గా కూడా కోహ్లిదే పైచేయి అని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. అంతేగాక, శ్రీలంక సిరీస్‌లో గెలిచిన టీమిండియా సొంత గడ్డపై మరింత చెలరేగి ఆడడం ఖాయమన్నాడు. కానీ, యువ ఆటగాళ్లతో కూడిన స్మిత్ సేనను కూడా తక్కువ అంచనా వేసే వీలు లేదన్నాడు. వన్డేల్లో ఆస్ట్రేలియాను ఓడించడం ఇతర జట్లకు అంత తేలిక కాదన్నాడు.

Comments

comments