Home స్కోర్ బ్యాట్స్‌మెన్‌ల వైఫల్యంతోనే ఓటమి

బ్యాట్స్‌మెన్‌ల వైఫల్యంతోనే ఓటమి

rth

టీమిండియా ఓటమిపై గంగూలీ ధ్వజం

కోల్‌కతా: స్వదేశంలో వరుస సిరీస్‌ల్లో గెలిచిన భారత్ క్రికెట్ జట్టు సత్తా దక్షిణాఫ్రికా పర్యటనలో తేలబోతుందని ముందుగానే వ్యాఖ్యానించిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తొలి టెస్టులో ఓటమి తరువాత విరాట్ సేన ప్రదర్శనపై విమర్శలు కురిపించాడు. ప్రధానంగా బ్యాటింగ్‌లో టీమిండియా వైఫల్యం చెందడమే ఓటమి కారణమంటూ ధ్వజమెత్తాడు. మ్యాచ్‌లో బౌలర్లు గొప్ప ప్రదర్శన కనబరిచినా.. బ్యాట్స్‌మెన్ కనీసం పోరాట పటిమ ఇవ్వలేకపోవడంతోనే ఘోర పరాజయం ఎదురైందన్నాడు. ‘పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కనీసం 300-350 పరుగులైనా చేయాల్సింది. బ్యాట్స్‌మెన్ సరైన ప్రదర్శన ఇవ్వలేనప్పుడు పరిస్థితులు క్రమేపీ కఠినంగా మారతాయి. బౌలర్లు రాణించినా.. బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనబడింది. ఒకవేళ వచ్చే టెస్టుల్లో భారత మెరవాలంటే కనీసం ప్రతీ ఇన్నింగ్స్‌లో 300కు పైగా స్కోరు తప్పదు. ఈ ఓటమితో భారత క్రికెట్ బృందం నిరాశకు గురి కావొద్దు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి. తర్వాత మ్యాచ్‌ల్లో విరాట్ బ్యాట్ నుంచి భారీ స్కోరు వస్తుందని ఆశిస్తున్నా’ అని గంగూలీ పేర్కొన్నాడు.

గత మ్యాచ్‌ల ప్రదర్శనతోనే తుది జట్టులోకి రోహిత్ : కోహ్లి
సౌతాఫ్రికాతో మొదటి టెస్ట్ పరాజయం తర్వాత టీ మిండియా వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో సఫారీ గడ్డపై రాణించిన అజింక్య రహానేను పక్కనబెట్టి రోహిత్ శర్మను జట్టులోకి తీసుకోవడంపై మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు విమర్శిస్తున్నారు. పేస్ మైదానంపై చెలరేగిపోయే రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 21 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ను అనవసరంగా ఎంపిక చేశారంటూ సెలక్షన్ కమిటీ నిర్ణయా న్ని తప్పుబడుతున్నారు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం ఆ నిర్ణయం సరైందేనని వ్యాఖ్యానించారు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లి ‘రోహిత్ ఆడిన చివరి మూడు టెస్టు మ్యాచ్‌లలో బాగానే స్కోర్ చేశాడు. శ్రీలంక సిరీస్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ప్రస్తుత ఫామ్ ఆధారంగానే మేం అతడిని తుది జట్టులోకి తీసుకున్నాం. ఓ జట్టుకు అదే కీలకం కూడా. విమర్శలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జట్టు బాగా ప్రాక్టీస్ చేసింది. కానీ, విఫలమయ్యాం’ అని వివరించాడు. మరో వైపు సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ కూడా భారత జట్టులో బుమ్రా, రోహిత్ శర్మ ఎంపికపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

కోహ్లి అభిమాని మృతి

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన అభిమాని చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మధ్యప్రదేశ్‌లోని రాట్లామ్‌కు చెందిన బాబూలాల్ (63) కోహ్లికి వీరాభిమాని. విరాట్ ఆడే మ్యాచ్‌లను క్రమం తప్పకుండా చూస్తాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్‌లో కోహ్లి తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో బాబూలాల్ మనస్తాపం చెందాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన అతడి భార్య వెంటనే ఆస్పత్రికి తరలించింది. అయితే ఈ ఘటనలో బాబూలాల్ తల, చేతులు, కాళ్ల భాగాలు తీవ్రంగా కాలడంతో ఆతడు మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.