Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

దుమకనున్న సాగర్

Gates opening of nagarjuna sagar dam

నేడో,రేపో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత, పూర్తిస్థాయికి 30టిఎంసిలే తరువాయి, స్థిరంగా ఇన్‌ఫ్లో

మన తెలంగాణ/హైదరాబాద్: ఎగువ నుంచి స్థిరంగా ఇన్‌ఫ్లోలు కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ గేట్లు తెరిచే సమయం ఆసన్నమైంది. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం మధ్యాహ్నానికి సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని ప్రాజె క్టు అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. సాగర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకుగాను బుధవారం సాయంత్రానికి 580 అడుగుల వరకు నీరు చేరుకుందని అధికారులు పేర్కొన్నారు.రిజర్వాయర్‌లో 312.05 టిఎంసిల సామర్థానికిగాను ప్రస్తుతం 282 టిఎంసిల మేర నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇంకో 30 టిఎంసిలు నీరు చేరితే గేట్లను ఎత్తాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం 1.55లక్షల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తోందని, ఇదే స్థాయిలో కొనసాగితే ఒక టి రెండు రోజుల్లోనే పూర్తిస్థాయిలో సాగర్ నిండుతుందని తెలిపారు.

వర్షాకాలం ఇంకా నెల రోజులకు పైగా ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగానే రిజర్వాయర్లో కొంత ఖాళీ ఉంచుకుని గేట్లు ఎత్తి దిగువకు వదలాల్సి ఉంటుందని, ఇన్‌ఫ్లోకు అనుగుణంగా గురువారం గేట్లు ఎత్తడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నాలుగేళ్ల క్రితం నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలినట్లు పేర్కొన్న ఒక అధికారి ప్రతీసారి సాగర్ కనీస నీటిమట్టం నిర్వహణకు, కృష్ణాబోర్డును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగి, శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయించుకోవాల్సిన స్థితి ఉందని గుర్తుచేశారు. ఈ సంవత్సరం ప్రకృతి కరుణించడంతో స్థానికంగా వర్షాలు పడకపోయినా, కర్ణాటక పరిధిలో భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యాంలు నిండి, దిగువకు వదిలిన నీటితో నాగార్జునసాగర్ నిండడానికి చేరువగా రావడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే గత ఏడాది కూడా నాగార్జుసాగర్‌కు ఎగువన ఉన్న ప్రాజెక్టులు శ్రీశైలం వరకు భారీగా నీరొచ్చింది.

మూసీ నదికి భారీ వరదతో దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తాల్సి వచ్చింది. కానీ సాగర్ మాత్రం నిండలేదు.శ్రీశైలం రిజర్వాయర్‌కు 1.43 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1.83 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లకు 90 వేల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తుంది. జూరాల ప్రాజెక్టుకు 70 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 67 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. తుంగభద్రకు 20469 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.  గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్‌లో నీటి నిల్వ 72 టిఎంసిలకు చేరింది. 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1086.7 అడుగుల మేర నీటిమట్టం ఉండగా, 90.3 టిఎంసిలకు గాను 72 టిఎంసిలు నీరు నిల్వ ఉంది. ఇంకా 18 టిఎంసిల నీరొస్తే శ్రీరాంసాగర్ పూర్తిస్థాయిలో నిండి గేట్లు ఎత్తాల్సి ఉంటుంది. లోయర్ మానేరుకు 4605 క్యూసెక్కులు, కడెం రిజర్వాయర్‌కు 4419 క్యూసెక్కులు, ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు 6955 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది.

Comments

comments