Home ఎడిటోరియల్ జన్యుమార్పిడి సాగు వద్దు

జన్యుమార్పిడి సాగు వద్దు

Green revolution in India fails

 

ఇండియాలో హరిత విప్లవం విఫలమైనట్లే జన్యు మార్పిడి (జిఎం) పత్తి పంటసాగు సైతం ఘోరంగా దెబ్బతింది. ఈ అనుభవం నేపథ్యంలో జిఎం ఆవాలు పంటను తిరస్కరించాల్సి ఉంది. హరిత విప్లవం మాదిరి గా జన్యుపరివర్తిత వ్యవసాయంలో కూడా అనేక నష్టాలుండడమే కాక, అస్థిరమైనది కూడా. నియంత్రణ సంస్థలు అసమర్థత, కుట్రపూరిత కలహాల ఊబిలో కూరుకుపోయాయి. అందువల్ల ఎం పంటలను కచ్చితంగా నిషేధించాలి.ఈ విషయం చాలాకాలం క్రితమే చర్చనీయాంశమైంది. అయితే ఈసారి గతంలోకంటే భిన్నంగా సుప్రసిద్ధ శాస్త్రవేత్త పి.సి. కేశవన్, ఆయన సహచరుడు, ప్రముఖ వ్యవసాయ, జన్యుశాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్‌లు సైతం ‘రెండవ హరిత విప్లవం’ పేరుతో దూసుకొస్తున్న జన్యు పరివర్తిత వ్యవసాయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

బిటి క్రిమిసంహారక పత్తి ఇండియాలో విఫలమైందని, అది పేద, చిన్న, సన్నకారు రైతులకు జీవనభద్రత కల్పించలేదని కేశవన్, స్వామినాథన్‌లు సంయుక్తంగా ‘కరెంట్‌సైన్స్’ అనే జర్నల్‌లో ఒక వ్యాసం రాశారు. ఈ అధ్యయనాలను నాగ్‌పూర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ కె.ఆర్. క్రాంతి, ప్రొఫెసర్ ఆండ్రూ పాల్ గుటేరెజ్ ఆయన సహచరులు సహా పలువురు శాస్త్రవేత్తలు అంగీకరించారని ఆ వ్యాసంలో ఉదహరించారు. బిటి పంటలు, కలుపు నివారణ పంటలు అస్థిరమైనవని, వాటి వల్ల విషపూరిత క్రిమిసంహారక మందుల వాడకం ఏ మాత్రం తగ్గలేదని ఆ వ్యాసంలో వారిద్దరూ ప్రధానంగా ఆరోపించారు.

బిటి విషపూరిత పంటలు జీవజాలమంతటికీ ప్రాణాంతకమైనవని వారు సాక్ష్యాధారాలుసహా వెల్లడించారు.జిఎం పంటలకు ప్రధానంగా గ్లైకోఫాస్పేట్ ఆ ధారిత కలుపునివారణ రసాయనాలను అధికంగా వినియోగిస్తారు. గ్లైకోఫాస్పేట్ రసాయనిక పదార్థం జన్యు విషపూరితమైనందువల్ల జన్యులోపాలతోకూడిన జననాలు సంభవిస్తున్నాయని, అదే సమయంలో అవి క్యాన్సర్‌కారకాలుగా ఉన్నాయనితెలిపారు.అదీకాక జిఎం పంటల కం టే జిఎంయేతర పంటల దిగుబడి అధికంగా ఉన్నట్లు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుపుతున్నాయని, ఇండియాలోని వివిధ రకాల ఆవాల పంటలు జిఎం పంటల దిగుబడిని అధిగమించిన విష యం ఇప్పటికే నిర్ధారణ అయిందని, అందువల్ల జిఎం పంటల్ని ప్రోత్సహించకుండా ప్రభుత్వాలు నిషేధించాలనివారు సూచించారు. జిఎంఒ నియంత్రణ కమిటీలు పూర్తిగా విఫలమైనాయనివారు తీవ్రంగా విమర్శించారు.

జన్యు ఇంజనీరింగ్ సాంకేతికతఅనేది అనుబంధరంగం మాత్రమేనని, ఆవశ్యకతనుబట్టి మాత్రమేదాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 99 శాతం కేసులలో చాలా కాలంనుంచి ఆచరణలో ఉన్న సాంప్రదాయక విత్తన వృద్ధి పద్ధతులే సరిపోతాయనే అభిప్రాయంవారు వ్యక్తం చేశారు. అంటే జిఎం అవసరంలేదనివారి భావన. పర్యావరణ, సామాజిక ప్రతికూల ప్రభావాల కారణంగా హరిత విప్లవం ఏ మాత్ర మూ సుస్థిరమైనదికాదని ఆ రచయితలు రాశారు. దిగుబడి కేంద్రిత సరళమైన పద్ధతులను విడనాడి ‘వ్యవస్థలఆధారిత’ (ప్రకృతిలోని వివిధ ప్రక్రియలు) వ్యవసాయ విధానాన్ని చేపట్టాలని కొందరి అభిప్రాయం. దిగుబడి ఆధారిత విధానంవల్ల స్థానిక ఆహారభద్రత, ఆహార సార్వభౌమత్వం ప్రమాదంలో పడ్డాయని, అదే విధంగా హరిత విప్లవం కారణంగా వ్యవసాయ, వ్యవసాయేతర సామాజిక, పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయనివారి అంచనా.

ఈ నేపథ్యంలో హరిత విప్లవం కాకుండా ‘వ్యవస్థల ఆధారిత’, ‘పర్యావరణ వ్యవసాయం’ ఆధారిత సుస్థిర ‘సతతహరిత విప్లవం’ గ్రామీణ సమాజాల ఆహార భద్రతకు హామీగా నిలుస్తుందని కేశవన్, స్వామినాథన్‌లు తమ పత్రంలో వెల్లడించారు.ఢిల్లీలో వేలాది రైతులు వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలనే డిమాండ్‌తో నిరసన ప్రదర్శనలు చేయడానికి రెండు రోజుల ముందు (నవంబర్ 25న) కేశవన్, స్వామినాథన్‌లు తమ పత్రాన్ని విడుదల చేశారు. ‘రైతులు గత కాలపు అవశేషాలు ఎంత మాత్రమూ కాదు, వ్యవసాయం, భారతీయ గ్రామం అనేవి ఈ ప్రపం చం, ఇండియా భవిష్యత్‌లో అంతర్భాగం కూడా’ అని ఢిల్లీ మార్చ్ సందర్భంగా భారతీయ రైతాంగం విడుదల చేసిన హక్కుల పత్రం (చార్టర్) గంభీరంగా ప్రకటించింది.

ఇప్పటిదాకా అధికారంలోకి వచ్చిన పాలకులందరూ భారత ఆర్థికవ్యవస్థకు వెన్నెముకగాఉన్న చిన్న, సన్నకారు రైతాంగాన్ని గత కాలపు ‘అవశేషం’గా భావించడమే కాక, విదేశీ వ్యవసాయ వాణిజ్య పెట్టుబడి విస్తరణకువారిని పెద్ద అడ్డంకిగా చూస్తున్నా రు. గ్లోబల్ వ్యవసాయవ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ రంగంలో ‘ఆధునికీ కరణ’ ముసుగులో రైతాంగం నడ్డివిరుస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. అందుకోసం ప్రపంచ బ్యాంకు ఆదేశాలు, విధానాలను వేగంగా అమలు చేస్తున్నాయి. స్థానిక పరిస్థితులకు పొసగని వాణిజ్య పంటల సాగును, నయా ఉదారవాద వ్యవసాయ విధానాలను, వ్యవసాయోత్పత్తుల దిగుమతులను పోత్సహిస్తూ, వ్యవసాయ రంగంలో వినియంత్రణ, ప్రైవేటీకరణ, మద్దతు ఉపసంహరణ వంటి సంస్కరణలను ప్రభుత్వాలు చేపడుతున్నాయి.

దాంతో వ్యవసాయం కోట్లాది మంది రైతులకు లాభసాటి కాకుండా పోయింది.దాంతోవారు వ్యవసాయాన్ని వదిలి బతుకుదెరువు కోసం పట్టణాలకు వలసపోతున్నారు. ఈ పరిస్థితి దృష్ట్యా ఉనికిలోఉన్న చిన్న,సన్నకారు వ్యవసాయం స్థానంలో కాంట్రా క్టు వ్యవసాయాన్ని, కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. మోన్‌శాంటోబేయర్, కార్గిల్, వాల్‌మార్ట్ వంటి అంతర్జాతీయ విత్తన, క్రిమిసంహారక, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ వాణిజ్య దిగ్గజాల స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవసాయ సంస్కరణలు చేపట్టా యి. కోట్ల మంది ఆహార భద్రత పునాదిగా సాగుతున్న వ్యవసాయం స్థానంలో ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణమైన సాగు విధానాన్ని ఈ సందర్భంగా పాలకులు ప్రోత్సహిస్తున్నారు. ఆ రకంగా ప్రభుత్వాలు వ్యవసాయ భారతాన్ని గ్లోబల్ కార్పొరేట్ ఆహార వాణిజ్య దిగ్గజాల ప్రయోజనాలకు బలిచేస్తున్నాయి.

వందల కోట్ల డాలర్ల జిఎం వాణిజ్యానికి భారత దేశం అత్యంత శక్తిమంతమైన మార్కెట్‌ను కలిగిఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యవసాయ వాణిజ్య దిగ్గజాలు ఇండియా మార్కెట్‌లో ఆధిపత్యం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. పత్తి, ఆవాలు, శెనగలు నుంచి గోధుమలు, మొక్కజొన్న వరకు వివిధ రకాల జిఎమ్ పంటలకు ఇండియాలో అవకాశాలున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద విస్తీర్ణంలో భారతీయ రైతులు పత్తి సాగు చేస్తున్నారు. వారు ప్రతి ఏటా 250 కోట్ల డాలర్లకు పైగా పురుగుమందులు, 35 కోట్ల డాలర్లకుపైగా కలుపు నివారణ మందులు వినియోగిస్తున్నారని, అది 2019నాటికి 80 కోట్ల డాలర్లకు చేరుకోగలదని’ 2017లో ‘పీజెంట్ స్టడీస్’ అనే పత్రికలో గ్లెన్ స్టోన్, అండ్రూ ఫ్లాక్స్‌లు రాసిన నివేదిక వెల్లడించింది. అయితే ఇండియాలో ఇప్పటికీ బిటి పత్తి మాత్రమే సాగులో ఉంది.

హరిత విప్లవంవల్ల ఏర్పడిన వ్యవసాయ విధ్వంసాన్ని సరిచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త జన్యుపరివర్తిత విధానాలు ప్రత్యామ్నాయంగా అమలు చేస్తే సరిపోతుందనే వ్యవసాయ వాణిజ్య దిగ్గజాల వాదనను సమర్థించడం అజ్ఞానం, అహంకారం మాత్రమేనని వివరిస్తూ సావె భాస్కర్ 2006లో స్వామినాథన్‌కు రాసిన లేఖలో వెల్లడించారు. సాంకేతికతల ప్రతికూల ప్రభావాలకు సంబంధించిన సరైన సాక్ష్యాధారాలను చూపించగలిగితే శాస్త్రవేత్తలు తమ గత వైఖరిని పూర్తిగా మార్చుకోగలరు. అయితే వ్యవసాయ కార్పొరేట్ దిగ్గజాల నిధులు, తాయిలాలకు ఆశపడుతున్న శాస్త్రవేత్తలు మాత్రం గుడ్డిగా జిఎం పంటల ఆహారభద్రతకు హామీ అని ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా విదేశీ వ్యవసాయ మదుపులు, ముడుపులకు దాసోహమంటున్న రాజకీయ నాయకులు భారతీయ రైతుల గోడును పట్టించుకోవడం లేదు. వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారంగా మార్కెట్ నియంత్రణతో పాటు, పర్యావరణహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ భారతాన్ని సంపన్న చేసేందుకు వీలవుతుందన్న వాస్తవాన్ని అర్థం చేసుకున్న పాలకులు ఎప్పుడు అధికారంలోకి వస్తారో వేచి చూడాల్సిందే!

                                                                                       – కొలిన్ టాడ్ హంటర్ (కౌంటర్ కరెంట్స్)

Gene conversion as the green revolution in India fails

Telangana Latest News