Home మహబూబ్‌నగర్ మద్యం మామూళ్ల గుట్టు రట్టు!

మద్యం మామూళ్ల గుట్టు రట్టు!

General list of the Collector, SP

కలెక్టర్, ఎస్‌పి చేతిలో మామూళ్ల జాబితా ?
మామూళ్ల గుట్టు విప్పిన బార్ యజమాని

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లాలో లిక్కర్ మాఫియా గుట్టు రట్టు  అయ్యింది. ఏకంగా ఒక బార్ యజమాని నెల నెల ఎవరెవరికి ఎంత మామూళ్లు ముడుతున్న విషయాన్ని బహిరంగ పర్చాడు. మామూళ్లు ఇవ్వక పోతే ఎక్సైజ్ అధికారులు తమను ఎలా వేపుకు తింటారో స్వయానా జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్, జిల్లా ఎస్‌పి అనురాధలకు వివరించారు. ఈ లిక్కర్ మాఫియాలో ఎక్సైజ్ అధికారుల నుంచి, పోలీసులు, పత్రికా విలేకర్లకు నెల నెల ఎంత ముడుతున్నా విషయాలను వెళ్లడించారు. పాలమూరు లిక్కర్ మాఫియాలో చేతులు తడిపిన వారిపై త్వరలో ప్రభుత్వానికి నివేదికలు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కాకుండా నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి మద్యం విక్రయాలపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆదేశిస్తుండగా, ఇక్కడి ఎక్సైజ్ అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి మద్యం మాఫియాకు గులాంగిరి చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి, మహబూబ్‌నగర్ జిల్లాలో 168 మద్యం షాపులు ఉన్నాయి. వీటిని అబ్కారీ శాఖ అధికారులు సక్రమంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. వైన్‌షాపులు, బార్‌లు నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా, ఎంఆర్‌పి ధరలకు విక్రయిస్తున్నారా, అక్రమ సిట్టింగ్‌లకు పాల్పడుతున్నారా వంటివి పరిశీలించి, నిబంధనలను అతిక్రమించిన వాటిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవేవి పట్టించుకోకుండా ఉండేందుకు మద్యం వైన్‌షాపు యజమానులందూ సిండికేట్‌గా ఏర్పడి ఒక బార్ యజమానిని నేతగా ఎన్నుకున్నారు.

ఈయన నెల నెల వైన్‌షాపులు, బార్‌ల పెద్ద మొత్తంలో ( 50 వేల నుంచి 60 వేల వరకు) వసూళ్లు చేసి అందరికి పంపిణీ చేస్తున్నాడు. అయితే ఇటీవల రాఘవేందర్ రాజు అనే వ్యక్తి ఇటీవల కొత్తగా బార్‌ను మం జూరు చేయించుకున్నాడు. బార్ నుంచి కూడా నెల మామూళ్లు ఇవ్వాలని సిండికేట్ నేత రాఘవేందర్‌రాజుకు ఆదేశించారు.కొన్ని నెలల పాటు ఆయన కూడా నెల మామూళ్లు ఇచ్చుకున్నాడు. ఇంత లో ఎమైందో ఏమో కాని ఇరువురి మద్య పొరపొచ్చాలు వచ్చాయి. గత వారం రోజుల క్రింత ఎక్సైజ్ శాఖ సిఐ దామోదర్‌రెడ్డి ఆధ్వర్యం లో రాఘవేందర్ రాజు బార్‌పై అబ్కారి పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. సమయ పాలన పాటించడం లేదని, ఇష్టారాజ్యం గా నడిపిస్తున్నావంటూ అబ్కారి పోలీసులు కేసు నమోదు చేశారు. అంతటితో ఆగకుండా ఎక్సైజ్ సిఐ దామోదర్ రెడ్డి, రాఘవేందర్ రాజుకు ఫోన్ చేసి తమకు కలెక్టర్, జిల్లా జడ్జి తెలుసంటూ, బార్‌ను సక్రమంగా నిర్వహించుకోవాలంటూ మాట్లాడిన విషయం ఫోన్ సం బాషణలు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఏకంగా బార్ యజమాని రాఘవేందర్ రాజు సోమవారం ప్రజాదర్బార్‌లో కలెక్టర్ రొనాల్డ్ రోస్‌కు ఫిర్యాదు చేశారు. తమపై అనవసరంగా అబ్కారీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారని, పైగా బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అబ్కారి శాఖ సిఐ ఫోన్ సంభాషణ సిడి ని కలెక్టర్‌కు వివరించారు. దీంతో కలెక్టర్ అబ్కారి శాఖ ఈఎస్‌ను పిలి చి మాట్లాడారు. అబ్కారి సూపరింటెండెంట్ కూడా రాఘవేందర్‌రాజే బ్లాక్ మెయిల్ చేసి ఫోన్‌లో మాట్లాడారని కలెక్టర్‌కు వివరించారు.
కలెక్టర్ జోక్యం చేసుకొని రాఘవేందర్ రాజు ఫిర్యాదును పరిశీలిస్తానని హామి ఇచ్చారు. అనంతరం రాజు మీడియా ముందుకు వచ్చి అబ్కారి సిఐ లిక్కర్ సీసాలు తీసుకెళ్లి తమకు 26 వేల రూపాయలు ఇవ్వాలని బహిరంగపర్చారు. ఈ డబ్బలు అడిగినందుకు తమపై కేసు నమోదు చేశారని చెప్పారు. అనంతరం ఎస్‌పి అనురాధను కలి సి మామూళ్లు దందాపై ఫిర్యాదు చేశారు.

అబ్కారి శాఖలో ఎవరిది వారికే
జిల్లా అబ్కారి శాఖ అధికారులకు ఉన్నంత అవినీతి ఆదాయం ఎవరికి లేదేమో. ఎవరెవరికి ఎంత ముడుతుందన్న ముడుపుల వ్యవహా రం మద్యం మాఫియా రాసుకున్న చీటి షోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వాటి ప్రకారం ఎక్సైజ్ అధికారుల జాబితాలో పెద్ద స్థాయి అధికారులకు నెలకు రూ. 4 వేలు కాగా, కింది స్థాయి అధికారికి 5 వేలు ఉంది.అంటే 168 షాపులకు లెక్క వేస్తే రూ.8 లక్షల 40 వేలు అవుతోంది. అంతేకాకుండా అబ్కారి శాఖలో సిఐ స్థాయి మొదలుకొ ని కింది స్థాయి అధికారుల వరకు మామూళ్లు ముడుతున్నాయి. అంతేకాకుండా ప్రతి పోలీస్ స్టేషన్‌కు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు కొంత ముడుపులు ముడుతున్నాయి. అలాగే కొందరు పోలీసు అధికారుల పాత్ర కూడా ఉంది. బార్ యజమానికి, ఇతర సిండికేట్ నేతకు మద్య వచ్చిన విబేధాలతో సిండికేట్ రద్దు కావడంతో మామూళ్లు నిలిపి వేశారు. దీంతో నెల మామూళ్లు స్లిప్ చీటి షోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని కూడా కలెక్టర్, ఎస్‌పీలకు అందజేశారు.

పత్రికా విలేకర్ల పేరిట రూ.70వేలు
పత్రికా విలేకర్లను మేనేజ్ చేసుకుంటామంటూ ఒక పత్రికా విలేకరి, మరో పత్రికా విలేకరి కలిసి నెలకు రూ.70వేలు తీసుకెళ్లుతున్నుట్లు జిల్లా ఎస్‌పి అనురాధకు బార్ యజమాని రాఘవేందర్ రాజు ఫిర్యా దు చేశారు. పత్రికల్లో వైన్‌షాపులకు వ్యతిరేకంగా వార్తలు రాయకుండా చేసేందుకు వీరు లిక్కర్ మాఫియా నుంచి నెల మామూళ్లు తీసుకుంటున్నట్లు ఫిర్యాదు చేశారు.
రహస్య విచారణ :
లిక్కర్ మాఫియాలో చేతులు తడిపిన వారిపై పై అధికారులు రహస్య విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అటు కలెక్టర్, ఇటు ఎస్‌పిలు కలిసి ఈ విచారణ చేయిస్తున్నట్లు సమాచారం. అలాగే సిండికేట్‌ను నేతను కూడా విచారించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ మామూళ్లు బాగోతంపై త్వరలో రాఘవేందర్ రాజు అనే బార్ యజమాని అబ్కారి శాఖ డిజి అకున్‌సబర్వాల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.