Home లైఫ్ స్టైల్ జార్జిరెడ్డి, జంపాల

జార్జిరెడ్డి, జంపాల

Geoge-reddy-and-Jampala

‘ఈవిప్లవాగ్నులు ఎచటివని అడిగి తే శ్రీకాకుళం వైపు చేయి చూపించు’  అన్నట్లు తెలంగాణలో ఈ చైతన్య దీపికలు ఎచటివని అడిగితే వేలాది వేళ్లు ఉస్మానియా యూనివర్శిటీ వైపు చూపిస్తాయి. ఒయుకి ప్రపంచ ఖ్యాతి తెచ్చి పెట్టింది అక్కడి విద్యార్థుల సామాజిక స్పృహనే అని చరిత్ర రుజువు చేస్తోంది. గత యాభై ఏళ్ల కాలంలో వివిధ దశలుగా యూనివర్శిటీలో వచ్చిన మార్పులు తొలి యాభై ఏళ్ల చరిత్రను వెనక్కి నెట్టిశాయని చెప్పవచ్చు. ఆరంభంలో ఈ ప్రాంగణం ఆధిపత్య కులాల విలాస విద్యాలయం. బలహీన వర్గాలకు ప్రవేశంలేని దొరల గడీలతో సమానం. ప్రవేశం లభించినా అగ్రకులాల విద్యార్థుల దురహంకారాన్ని  అంగీకరించక తప్పని పరిస్థితులుండేవి.

1970 దశకంలో తొలి నాళ్లలో సాహిసిక మేధావి జార్జిరెడ్డి ఇతర మిత్రులతో  కలిసి మీ దాష్టి కాలకు కాలం చెల్లిందని, ఇకపై సాగవంటూ బరిగీసి నిలిచినంక ఒయులో కొత్త పొద్దుపొడుపు మొదలైంది. జార్జిరెడ్డి ఓ ఎగిసిపడిన మేధో సంద్రం. వెరపులేని ధీరుడు. చమక్కుమన్న వజ్రం. తల్లిదండ్రులు ఉన్నత్యోద్యోగులైనా తాను మాత్రం సాధారణ జీవితాన్నే ఇష్టపడేవాడు. పుస్తక పఠనం ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆ రోజుల్లో జార్జిరెడ్డి కోసం వెతికే వాళ్లు ముందుగా లైబ్రరీలో చూసేవారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఎస్‌సి ఫిజిక్స్ చదవడానికి కాలుపెట్టిన రోజు నుంచే ఆధిపత్యకులాల ఆగడాలను ఎదురించడం ఆరంభించాడు. ఆయన ధైర్యాన్ని మెచ్చి కొందరు ఆయనకు చేరువయ్యారు. అలా ఏకమయిన మిత్ర బృందం క్యాంపస్ కాలేజీల్లో, హాస్టళ్లలో జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవడం మొదలుపెట్టింది.

యూనివర్శిటీ కళాశాలల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరిగినా హిందూమతవాద విద్యార్థి సంఘాన్ని ఎదిరించి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. ఆ విధంగా ఒయులో ఎదురులేని విధంగా రాజ్యమేలుతున్న శక్తులకు మొదటిసారి ఎదురొడ్డి నిలిచిన వారు జార్జిరెడ్డి. ఎలక్షన్లలో తమ ప్యానల్‌ను సిద్ధం చేసి నామినేషన్లు వేయించాడు. అణగారి బతికిన వర్గాల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. మతవాద కూటమి ఓటమి ఖాయమైన సందర్భంలో జార్జిరెడ్డిని తొలిగించుకునే కుట్ర కుట్రం బీజం పడింది. ఆయన చర్యలు ప్రభుత్వానికి యూనివర్శిటీ పాలక వర్గానికి కంటగింపుగా తయారయ్యాయి. ఏప్రిల్ 14, 1972 నాడు కిరాయి హంతకులు ఒయు ఆవరణలోనే జార్జిని హతమార్చారు.

ముప్పయి మందికిపైగా రౌడీలు పోలీసు పికెట్‌కు సమీపంలోనే ఆయనపై తెగబడ్డారు. కంటితుడుపు చర్యగా హంతకులను అరెస్టు చేసినా రకరకాల సాంకేతిక కారణాలను చూపి జార్జిరెడ్డి హత్య కేసును ముందుకు సాగలేని విచారణగా కోర్టు కొట్టివేసింది. ఇరవై అయిదేళ్ల వయసులోనే జార్జి పేద విద్యార్థుల స్వేచ్ఛ కోసం అసువులు బాశాడు. అపూర్వ మేధో సంపత్తి గల వ్యక్తి వామపక్ష భావాలవైపు వెళితే భవిష్యత్తులో పెద్ద ఉపద్రవాన్నే  ఎదుర్కోవలసివస్తుందన్న భయంతో జార్జిని పిన్న వయసులోనే నులిమివేసింది పాలక వర్గం.  క్యాంపస్‌లో జరిగిన ఓ కోట్లాట కారణంగా ఒయు పాలక మండలి జార్జిరెడ్డికి ఏడాది కాలం పాటు బహిష్కరించింది. ఆ ఏడాది కాలం జార్జి వెంగళరావునగర్‌లో ఉండే తన మిత్రుడైన తమ్మారెడ్డి భరద్వాజ్ ఇంట్లో గడిపాడు. భరద్వాజ్ తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి కమ్యూనిస్టు బాటసారి. కృష్ణమూర్తి సేకరించిన సామ్యవాద, విప్లవ సాహిత్యాన్ని జార్జి సాంతం చదివేశాడు. యూనివర్శిటీ జార్జిని పరీక్షలకు అను మతించింది. ఆ రోజుల్లో పరీక్షా పత్రాలను మూల్యాంకనం కోసం బయటి యూని వర్శిటీలకు పంపేవారు. ఆ సంవత్సరం జవాబు పత్రాలు బెంగళూరు యూనివర్శిటీకి పంప బడ్డాయి.

జార్జి రాసిన జవాబులు చూసిన అక్కడి ప్రొఫెసర్ అబ్బురపడి తన వద్ద పరిశోధన చేయమని ఆహ్వానించాడు. అయితే ఇక్కడి పరిస్థితులకు  ప్రాధాన్యతనిస్తూ జార్జి ఆయన దగ్గరికి వెళ్లలేదు. ఆ సంవత్సరం జార్జికి పరీక్షల్లో  గోల్డ్ మెడల్ లభించింది. యూనివర్శిటీకి దూరంగా ఉండి చదువుకు దూరమవు తాడనుకున్న జార్జి పతకాన్ని సాధించడంతో పాలక వర్గాల  పన్నాగం వృధా అయింది.  యూనివర్శిటీలో బడుగు జీవుల స్వాతంత్య్రం కోసం రక్త తర్పణం చేసిన జార్జి స్మృతి చిహ్నం ఒయు ప్రాంగణంలో  ఎక్కడా కనపడదు. ఏ భవనానికీ ఆయన పేరు లేదు. యూనివర్శిటీ ఇంజినీరింగ్ బిల్డింగ్ ముందుగాని, లైబ్రరీ భవనం ముందుగాని ఆయన నిలువెత్తు విగ్రహం నిలబెట్టుకొనే అవసరం ఉంది. జార్జి మరణం వృథా కాలేదు. ‘జీనా హైతో మర్‌నా సీఖో.. కదం కదం పర్ లడ్‌నా సీఖో’ అన్న ఆయన నినాదం యూనివర్శిటీ ఆవరణలో మారుమోగుతూనే ఉంటుంది.

జార్జిరెడ్డి మరణాంతరం  ఆయన చిరు దీపంగా వెలిగించిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం  పిడిఎస్‌యు) జంపాల చంద్రశేఖర ప్రసాద్ నాయకత్వంలో కాగడాలో ప్రజ్వలించింది. ఆర్థికంగా, సామాజికంగా బలహీనులైన విద్యార్థులకు బాసటగా నిలుస్తూ వారిలో కొత్త ఊపిరులూదింది. ఎలక్ట్రానిక్స్ విద్యార్థిగా నాలుగో సంవత్సరంలో ఉండగానే జంపాల ప్రసాద్ విప్లవోద్యమాలవైపు పయనించాడు. 1975లో విజయవాడలో అరెస్టు చేసిన పోలీసులు ప్రసాద్‌ను ఇల్లెందు అడవుల్లో ఎన్‌కౌంటర్ చేశారు. ఆ తర్వాత జార్జి, జంపాలలు రగిల్చిన ఉద్యమాలు ప్రగతిశీల భావజాల విద్యార్థుల చేతుల్లో దగ్ధాయమానంగా ముందుకు సాగాయి. యూనివర్శిటీల్లో ఆధిపత్య కులాల ఆగడాలకు తెరపడేందుకు  బిసిల ప్రవేశం తోడ్పడింది. అంత వరకు అన్ని రకాల సతాయింపులను భరిస్తూ వచ్చిన ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులకు ఓ అండ దొరికినట్లయింది.

ఈ రకంగా ఉస్మానియా యూనివర్శిటీ ఎందరో పేద విద్యార్థులకు తన స్థన్య మిచ్చి సాదుతోంది. పాల రుణం తీర్చేందుకు  సామాజిక స్పృహ పాఠాలు నేర్పుతోంది. బడుగు వర్గాల పిల్లలు క్యాంపస్ మెట్లెక్కడమే ఒయు అసలు సిసలైన అందం, నిండుదనం, సూటుబూటు టకటకలతో విసిగిపోయిన ఒయుకు ఈ మట్టి పాదాలు శ్వాసించడం నేర్పాయా లేక తలదించుకుని నడిచే వర్గాలకు తల ఎత్తుకొనమని ఆర్ట్ కాలేజీ శిఖరం నేర్పిందా. రెండూ పరస్పర ఆశ్రయాలే. 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం సర్కార్ కర్కశ పాదాల కింద అణచబడ్డ తర్వాత తెలంగాణ విద్యార్థి యువతను నక్సల్బరీ, శ్రీకాకుళం వేడి గాలులు ఆకర్షించాయి. ఒయులో ఘర్షణలను సాకుగా చూపుతూ ప్రభుత్వం 1984లో రాష్ట్రం ఆధీనంలోని యూనివర్శిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలను నిలిపివేసింది. ఎంత ఉద్యమాల వైపు ఆకర్షితులైనా ఉస్మానియా విద్యార్థులు విద్యలో ప్రవీణులు. పరిశోధనల్లో అగ్రగణ్యులు. పరీక్షల సమయంలో క్యాంపస్ నిశ్శబ్దంగా ఉంటుంది. ఒయు లైబ్రరీలో 5 లక్షలకు పైగా ఉన్న గ్రంథాలు వారి ఒడిలో పాపలవుతాయి. చదువు, ఉద్యమం ఒయు బిడ్డలకు రెండు నేత్రాలు. దేనిని అశ్రద్ధ చేసినా నష్టం తమకే అని వారికి బాగా తెలుసు.