Home లైఫ్ స్టైల్ పింక్ మార్కెట్.. అన్నీ ఒకచోటే!

పింక్ మార్కెట్.. అన్నీ ఒకచోటే!

 

మహిళలు ఇంట్లో ఉండి కూడా అనేక వస్తువులను తయారుచేస్తుంటారు. వాటిని ఎలా అమ్ముకోవాలో తెలియక సతమతమవుతుంటారు. ప్రతి ఒక్కరికీ ఆన్‌లైన్ వ్యాపారంపై అవగాహన ఉండదు. అలాంటివారికోసం ఏర్పడిందే
‘షీ మార్ట్ అండ్ లూస్’.
చందానగర్‌లో ఏర్పాటైన ఈ షీ మార్ట్‌ను జీహెచ్‌ఎంసీ ఏర్పాటుచేసింది. ఇక్కడ మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులను వారే విక్రయించుకోవచ్చు. వారు ఇబ్బంది పడకుండా ప్రత్యేకంగా మరుగుదొడ్లు, చిన్నారులకు పాలిచ్చేందుకు అనువైన ఓ గది ఇక్కడ ఏర్పాటుచేయడం విశేషం. ఇలా అన్ని సదుపాయాలు ఒకచోటే లభ్యం కావడం దేశంలో ఇదే మొదటిసారి. వీటి నిర్వహణ మొత్తం మహిళలే చూసుకుంటారు.
ఈ పింక్ మార్కెట్‌లో రెండు స్టాళ్లు ఉంటాయి. ఒక దాంట్లో స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన వస్తువులు, మరోదాంట్లో తినుబండరాలు ఉంటాయి. బాలింతలు పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక గది, పింక్ టాయిలెట్లు, దివ్యాంగ మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఇక్కడ ఉన్నాయి.
జవహర్‌నగర్‌లోని స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన జూట్, కాటన్ బ్యాగులు, చిరుధాన్యాలతో తయారుచేసే స్వీట్లు ఇక్కడ తక్కువ ధరకే లభిస్తాయి.
మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతను చందానగర్ సర్కిల్ పరిధిలోని వేముకుంట మహిళా సమాఖ్య చేపట్టింది. స్టాళ్లలో అమ్మకాల ద్వారా వచ్చే లాభాలతో పింక్ టాయిలెట్లను నిర్వహిస్తారు. వీటిని పరిశుభ్రంగా ఉంచడం కోసం ఇద్దరు మహిళలు షిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాల ఏర్పాటు కూడా ఉంది. మరో ఇద్దరు మహిళలు స్టాల్స్‌లో వస్తువులు విక్రయిస్తున్నారు.

 

GHMC established She smart and loose in Chandanagar