Home తాజా వార్తలు ఆ రెండు జట్లు వరల్డ్‌కప్‌ ఫేవరెట్స్: మెక్‌గ్రాత్‌

ఆ రెండు జట్లు వరల్డ్‌కప్‌ ఫేవరెట్స్: మెక్‌గ్రాత్‌

మెల్‌బోర్న్‌: ఇంగ్లండ్‌ వేదికగా మే 30న నుంచి ప్రారంభం కాబోతున్న ప్రపంచకప్‌లో ఈ సారి రెండు జట్లకు ట్రోఫీని గెలిచి సత్తా ఉందని ఆసీస్‌ దిగ్గజం గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ తెలిపారు. అందులో భారత జట్టు హాట్‌ ఫేవరెట్‌ కాగా, ఆతిథ్య ఇంగ్లండ్ కూడా వరల్డ్‌కప్‌ ఫేవరెట్‌ జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. టీమిండియా, ఇంగ్లండ్‌లు ప్రపంచకప్ పోరులో టాప్‌ జట్లుగా బరిలో దిగుతున్నాయని పేర్కొన్నారు. ఈ రెండు జట్లకే వరల్డ్‌కప్‌ గెలిచే అవకాశాలు ఎక్కువని చెప్పారు. అయితే, ఇటీవల స్వదేశంలో ఆసీస్ చేతిలో రెండు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో కోహ్లీసేన ఓడిపోయిన సంగతి తెలిసిందే. అలాగే విండీస్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఇంగ్లండ్‌ సైతం కొన్ని పరాజయాలు మూటగట్టుకుంది. అయినప్పటికీ ఈ రెండు జట్లే ప్రపంచకప్ హాట్‌ ఫేవరెట్స్‌ అని గ్లెన్ తేల్చి చెప్పారు. అన్ని విభాగాల్లోనూ భారత్‌-ఇంగ్లండ్‌లు చాలా పటిష్టంగా ఉన్నాయన్నారు.

అదే సమయంలో భారత్‌ పేస్‌ బౌలర్లు బుమ్రా, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మలు వచ్చే ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఇక టీమిండియాపై గెలిచి కంగారులు కూడా వరల్డ్‌కప్‌ రేసులోకి వచ్చిందని మెక్‌గ్రాత్‌ పేర్కొన్నారు. మరోవైపు బాల్ ట్యాంపరింగ్ తో గత ఏడాది కాలంగా జట్టుకు దూరమైన వార్నర్, స్మిత్ తిరిగి జట్టుతో కలవడం కూడా ఆసీస్ కు లాభిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లిని ఈ సందర్భంగా మెక్‌గ్రాత్‌ ప్రశంసలతో ముంచెత్తారు. కోహ్లి అసాధారణ ఆటగాడని, అతని కెరీర్‌ ముగిసే సమయానికి దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, బ్రియాన్‌ లారా తరహాలో చరిత్రలో నిలిచిపోతాడన్నాడని గ్లెన్ జోస్యం చెప్పారు.

Glenn Mcgrath picks his Favourites to lift World Cup 2019