Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

గ్లోబల్ సంకేతాలు, రూపాయి కదలికలే కీలకం

Global

న్యూఢిల్లీ: వృద్ధి రేటు పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు, మొండి బకాయిల పరిష్కారం, సహా అంతర్జాతీయ సంకేతాలు ఈవారం మార్కెట్‌ను శాసించనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. దీంతోపాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ, విదేశీ నిధుల ప్రవాహం పరిస్థితులు కూడా ఈక్విటీ మార్కెట్ సూచీలకు కీలకం కానున్నాయి. సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కోంటాయని, ఇన్వెస్టర్లు ప్రధానంగా అంతర్జాతీయ సంకేతాలు, భౌగోలిక రాజకీయ పరిస్థితులపై దృష్టి పెట్టాలని జిఫిన్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నెవ్గీ తెలిపారు. దేశీయంగా పరిణామాలు, మొండి బకాయిల సమస్య పరిష్కారానికి సంస్కరణలు, జిడిపి గణాంకాలు మందగించడంతో వృద్ధి రేటుపై ఆందోళనలు వంటి అంశాలను ఈ వారం పరిశీలించాల్సి ఉంటుంది. శుక్రవారం వారాంతం సెన్సెక్స్ 162 పాయింట్లు లాభపడి 31,892 వద్ద స్థిరపడింది. నిప్టీ మళ్లీ 10వేల మైలురాయికి తాకింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 9,974 వద్ద ముగిసింది. ఇక అమెరికాలో పేటెంట్ హక్కుల కేసులో డాక్టర్ రెడ్డీస్‌కు అనుకూలంగా తీర్పు రావడంతో ఆ సంస్థ షేరు 9 శాతం వరకు పెరిగింది. నిఫ్టీ 10 వేల మార్కును అధిగమించింది. పది దాటినప్పటి నుంచి మార్కెట్‌కు అన్ని ప్రతికూల అంశాలే ఎదురవుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఇన్ఫోసిస్ సిఇఒ పదవికి విశాల్ సిక్కా రాజీనామా, ఉత్తర కొరియా జపాన్ మీదుగా క్షిపణీ ప్రయోగం చేయడం, తొలి త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు 5.7 శాతానికి పడిపోవడం వంటి ప్రతికూల అంశాలు మార్కెట్ కు ప్రతికూలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడులకు తొందరపడవద్దనే విషయాన్ని సూచిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. నూతన పెట్టుబడిదారులు ఇంకొంతకాలం వేచిచూడడం ఉత్తమమని వారంటునన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వీటిని సకాలంలో తిరిగి చెల్లించని కంపెనీలపై దివాలా చట్టం ప్రయోగించడానికి ఆర్‌బిఐ సిద్ధమైంది. ఇప్పటికే 12 పెద్ద కంపెనీల రుణాల ఎగవేతాలను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 40 కంపెనీలతో రెండో జాబితాను ఆర్‌బిఐ తయారుచేసిందని తెలుస్తోంది. ఈ అంశం కూడా మార్కెట్ ర్యాలీకి ప్రతికూల అంశంగా మారనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి నిర్ణయం తీసుకోడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. 9,800 నుంచి 10,000 మధ్య స్థాయిలో నిఫ్టీ కొంతకాలం పరిమితమవుతుందని వారంటున్నారు. కాగా దేశ విదేశీ మారక నిల్వలు మళ్లీ పెరిగాయి. ఆగస్టు 25తో ముగిసిన వారంలో 1.148 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది రూ.25.14 లక్షల కోట్లు(394.55 బిలియన్ డాలర్లు)గా నమోదయ్యాయి. అంతకు ముందు వారంలో ఇవి 1.142 బిలియన్ డాలర్లు పెరిగి 370 బిలియన్ డాలర్లు నమోదయ్యాయి.

Comments

comments