Search
Wednesday 26 September 2018
  • :
  • :

శ్రీరాంసాగర్ ఆయకట్టుకు నీరు

Godavari inflows to Sriramsagar project increase

మన తెలంగాణ/ హైదరాబాద్: ఎగువ నుంచి భారీగా వరద నీరు శ్రీరాంసాగర్‌లోకి వస్తుండడంతో ఖరీఫ్ సీజన్‌లో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా వరదల స్థితిగతులు, తాగు, సాగునీరు అంశాలపై జలసౌధలో నీటిపారుదల శాఖమంత్రి టి.హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డిలతో కలిసి సమీక్షించిన సందర్భంగా ఈ ఖరీఫ్‌కే నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. శ్రీరాంసాగర్ నుంచి కాకతీయ, లక్ష్మీ కాలువతో పాటు లక్ష్మీ కాంప్లెక్స్‌లోని చౌటుపల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్, నవాబ్ లిఫ్ట్‌ల కింద ఆయకట్టు, సరస్వతి కాలువ, గుత్ప, అలీసాగర్, ఐడిసి ఆధ్వర్యంలో నడిచే 24 లిఫ్టుల పరిధిలోని ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. శ్రీరాంసాగర్‌లో మొత్తం 90 టిఎంసిల సార్థానికిగాను ఇప్పటికే 50 టిఎంసిలు దాటిందని, ఇంకా రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని, ఈ ప్రవాహం మరికొద్ది రోజులు నిలకడగా కొనసాగే అవకాశం ఉందని ఇంజనీర్లు వివరించారు. ప్రాజెక్టు పరిధిలోని, కాలువల పరిధిలోని చెరువులు, కుంటలను నీటితో నింపాలని మంత్రి హరీశ్‌రావు ఇం జనీర్లను ఆదేశించారు. శ్రీరాంసాగర్‌కు ఎగువన ఉన్న వరద నీరు ఎక్కడెక్కడి నుంచి ఎలా వస్తుందో ఆరా తీశారు. విష్ణుపురి ప్రాజెక్టు, అంధురా బ్యారేజి, బాబ్లీ బ్యారేజి నుంచి వరద ప్రవాహం శ్రీరాంసాగర్‌కు వస్తోందని వివరించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలోకి వరద నీటితో జలకళ సంతరించుకోవడం పట్ల మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు.
ఖరీఫ్‌కు నీటి విడుదల ప్రణాళిక :వరద నీరు వస్తుండడంతో వచ్చే ఖరీఫ్‌కు నీటి విడుదల ప్రణాళిక తయారు చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు, రైతులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి, నీటి విడుదల ప్రణాళికలు వివరించాలని మంత్రి సూచించారు.
కాలువల పరిధిలో రైతులకు నీటి విడుదల సమాచారం అందేలా, ఇంజనీర్లు, రెవె న్యూ సిబ్బంది గ్రామాల్లో చాటింపు వేయించాలన్నారు. నీటిని విడుదల చేసే కాలువలను పటిష్ట పరచాలని, కాలువల పూడికను ఉపాధి హామీ పథకంలో బాగంగా తీయాలని సూచించారు. నీటి వృధాను అరికట్టేందుకు టెయిల్ టు హెడ్, ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిని అవలంభించాలని సూచించారు. గత రబీ లో ఈ పద్ధతిని అమలు చేయడం ద్వారా ఒక్క టిఎంసి నీటితో 13 వేల నుం చి 14 వేల ఎకరాలకు నీరు ఇవ్వగలిగామని, రైతులు సైతం ఈ పద్ధతితో ఎక్కువ దిగుబడి సాధించామని ఆనందం వ్యక్తం చేశారని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. ఈ ఖరీఫ్‌లోనూ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్, ఈఎన్‌సి మురళీధర్, ఇరిగేషన్ ఓఎస్‌డి శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ప్రత్యేకాధికారి కె.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments