Home తాజా వార్తలు పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ ముస్తాబు

పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ ముస్తాబు

 Hyderabad First in the real estate sector in the south

మన తెలంగాణ / హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం గోల్కొండ కోట ముస్తాబైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ వరుసగా ఐదవ సంవత్సరం గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు. బుధవారం ఉదయం 9.45 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నాలుగున్నరేళ్ళ కాలంలో తెలంగాణ సాధించిన విజయాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యతను, వచ్చిన ఫలితాలను వివరించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటను రంగురంగుల విద్యుద్దీపాలతో అధికారులు అలంకరించారు. నగరంలోని పలు చారిత్రక కట్టడాలను, ప్రభుత్వ కార్యాలయాలను కూడా విద్యుద్దీపాలతో అలంకరించారు. ముఖ్యమంత్రి జెండాను ఎగురవేయనున్నందున గోల్కొండ కోటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటైంది. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ప్రధాన కార్యదర్శి, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నందున పలు రోడ్లపై వాహనాల రాకపోకలకు సైతం ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మాత్రమే ప్రభుత్వం ప్రతీ ఏటా స్వాతంత్య్ర దినోత్సవానికి గోల్కొండ కోటను వినియోగిస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ తన ప్రసంగంలో నాలుగేళ్ళ ప్రభుత్వ ప్రగతిని వివరించడంతో పాటు కొత్తగా ప్రవేశపెడుతున్న ‘కంటి వెలుగు’, ‘రైతుబీమా’ పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. వెనకబడిన తరగతుల వారికి వివిధ రకాల వృత్తి కొనసాగించేందుకు వీలుగా పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్న అంశాన్ని కూడా తన ప్రసంగంలో పేర్కొనే అవకాశం ఉంది. మరోవైపు సచివాలయాన్ని కూడా అధికారులు రంగురంగుల దీపాలతో అలంకరించారు.
సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ తేనీటి విందు :
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం ’ పేరుతో రాజకీయ ప్రముఖులకు, ప్రభుత్వ అధికారులకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి తేనీటి విందు ఇస్తున్నారు. రాజ్‌భవన్ సైతం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముస్తాబైంది. సాయంత్రం ఐదు గంటల నుంచి 8.30 గంటల వరకు జరిగే తేనీటి విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల పెద్దలు హాజరుకానున్నారు.