Home తాజా వార్తలు ఆరు వారాల కనిష్ఠానికి పసిడి ధరలు

ఆరు వారాల కనిష్ఠానికి పసిడి ధరలు

bold

ముంబై: బంగారం ధరలు ఆరు వారాల కనిష్టానికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు దిగివచ్చాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు నుంచి మోనెటరీ పాలసీ ఆదేశాల కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్న నేపథ్యంలో డాలర్ విలువ మూడున్నర నెలల గరిష్ఠానికి చేరింది. మరోవైపు బంగారానికి డిమాండ్ మందగించి ధర దిగివస్తోంది. అంతర్జాతీయంగా ఔన్స్ (31.1 గ్రాములు) బంగారం ధర 0.6 శాతం (7.6 డాలర్లు) క్షీణించింది. దీంతో ఔన్స్ పసిడి ధర 1,312 డాలర్లకు పడిపోయింది. ఇది ఆరు వారాల కనిష్ఠ స్థాయి.. గతవారం బంగారం ధరలు 1 శాతానికి పైగా పడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు వెండి కూడా ఔన్స్ 0.75 శాతం తగ్గి 16.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇటీవల అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు పసిడి అమ్మకాలకు కారణమయ్యాయి. ఉత్తర, దక్షిణ కొరియాలు చేతులు కలపడం, చమురు ధరలు నాలుగేళ్ల గరిష్టాలకు చేరడం, డాలరు బలపడుతుండటం వంటి అంశాలు బులియన్ మార్కెట్‌లో అమ్మకాలకు కారణమవుతున్నాయని నిపుణులు అంటున్నారు. దీంతో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడికి డిమాండ్ క్షీణిస్తోందని తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నేడు రెండు రోజుల పాలసీ సమావేశాలను ప్రారంభించనుంది. బుధవారం పాలసీ నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ సారి యథాతథ పాలసీ అమలుకే ఫెడ్ కట్టుబడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే రానున్న సమీక్షల్లో కనీసం రెండుసార్లు వడ్డీ రేట్ల పెంపును చేపట్టే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతోపాటు బ్యాలన్స్‌షీట్‌కు కోతపెట్టే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. మార్చి పాలసీ సమీక్షలో ఫెడ్ రేటును  పావు శాతం పెంచిన విషయం తెలిసిందే. 2008లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా అమలు చేసిన సహాయక ప్యాకేజీలతో ఫెడ్ బ్యాలన్స్‌షీట్ 4.5 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ పురోగతి బాటపట్టడంతోపాటు ఇటీవల ద్రవ్యోల్బణం, ఉపాధి అవకాశాలు బలపడటంతో తిరిగి వడ్డీ రేట్ల పెంపువైపు ఫెడ్ మొగ్గుచూపుతోంది.