Home తాజా వార్తలు తెలుగు తేజానికి పసిడి పతకం

తెలుగు తేజానికి పసిడి పతకం

sports

 రాహుల్‌కు స్వర్ణం, వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ జోరు

గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న 21వ కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. శనివారం భారత్ మరో రెండు స్వర్ణాలు సాధించింది. శనివారం వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు ఈ రెండు స్వర్ణాలు దక్కాయి. తెలుగుతేజం వెంకట్ రాహుల్ 85 కిలోల విభాగంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 77 కిలోల విభాగంలో తమిళనాడు స్టార్ సతీష్ కుమార్ శివలింగం కూడా స్వర్ణం గెలుచుకున్నాడు. దీంతో ఈ క్రీడల్లో భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య నాలుగుకు చేరింది. శనివారం జరిగిన 85 కిలోల విభాగంలో తెలుగు రాష్ట్రానికి చెందిన వెంకట్ రాహుల్ అసాధారణ ఆటతో చెలరేగి పోయాడు. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో అతను అద్భుతంగా రాణించాడు. మొత్తం 338 కేజీలను ఎత్తిన వెం కట్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైనా రాహుల్ తన జోరును కొనసాగించాడు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణం దక్కించుకున్నాడు. వెంకట్ రాహుల్ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన వాడు. కాగా, వెంకట్ సాధించిన పతకంతో భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య నాలుగుకు చేరింది. అంతకుముందు శనివారం ఉదయం జరిగిన పురుషుల 77 కిలోల విభాగంలో సతీష్ కుమార్ శివలింగం స్వర్ణం గెలుచుకున్నాడు. అసాధారణ ఆటతో చెలరేగిన సతీష్ తన ఖాతాలో పసిడి జమా చేసుకున్నాడు. ప్రత్యర్థుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా సతీష్ పట్టు వీడకుండా పోరాడాడు. చివరి వరకు అదే జోరును కొనసాగిస్తూ తన ఖాతాలో స్వర్ణం జత చేసుకున్నాడు. అంతకుముందు మహిళల వెయిట్ లిఫ్టింగ్ మీరాబాయి చాను, సంజిత చానులు స్వర్ణ పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. కాగా, భారత్ శనివారం మూడో రోజు ముగిసే సమయానికి నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, మరో కాంస్యం సాధించింది. ఈ అన్ని పతకాలు కూడా వెయిట్ లిఫ్టింగ్‌లోనే రావడం మరో విశేషం.