Home ఎడిటోరియల్ గిరి పుత్రికల స్వర్ణ విజయాలు

గిరి పుత్రికల స్వర్ణ విజయాలు

Golden achievements of tribal girls
ఇటీవల ఇండోనేసియాలోని జకర్తాలో జరిగిన ఆసియా క్రీడల మహిళల ‘హెప్టాథ్లాన్’ విభాగంలో 21 ఏళ్ల నిరుపేద గిరిజన ఆదివాసీ యువతి స్వప్న బర్మన్ అసాధారణ రీతిలో దేశానికి స్వర్ణ పతకాన్ని అందించి ప్రపంచంలోనే భారత్ గర్వపడేలా చేసింది. గత ‘ఆరేళ్ల’ నుండి ఆమె పడ్డ శ్రమ/ వ్యధకు ఫలితం ‘స్వర్ణం’ లభించినా, దేశం గర్వపడినా కుటుంబం దుర్భర స్థితి పోవాలన్న ఆకాంక్ష స్వప్నంగా మిగలకూడదు. అప్పుడే భారతీయుల ముఖాల్లో స్వర్ణ కాంతులు ప్రసరిస్తాయి. కుటుంబ పోషణ సరిగాలేని దీన స్థితిలోనూ ఆటలనే నమ్ముకున్న స్వప్నలాంటి ఎందరో నిరుపేద ఆదివాసీ యువతుల సాహస క్రీడలకు, పోరాట పటిమలకు గుర్తిం పు వస్తుంది.

స్వప్న బర్మన్ పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్ గురి ప్రాంతంలో 1996, అక్టోబర్ 29న ఒక గిరిజన తెగకు చెందిన పంచానవ్ బర్మన్, బసాన దంపతులకు జన్మించింది.

తండ్రి రిక్షా కార్మికుడు, తల్లి తేయాకు తోటల్లో పనిచేసే దినసరి కూలీ. ఇద్దరు రెక్కల కష్టం చేసినా ఆరుగురు పిల్లల కడుపు నింపడం కష్టమైన కుటుంబంలో పుట్టిందీ అమ్మాయి. ఈ స్థితిలో ఆటల్లోకి రావడం, అంతర్జాతీయ స్థాయికి చేరడం, పతకాలు గెలవడమంటే ఆషామాషీ కాదు. ఆమె సంకల్ప బలం, ఆదివాసీ పోరాట వారసత్వం, మరోప్రక్క పేదరికం సవాలుగా, శారీరక అనారోగ్యాన్ని అణగదొక్కుకుంటూ ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది.

స్వప్న నివసించేది పూరిగుడిసె. తల్లిదండ్రుల సంపాదన తిండికి సరిపోక, పాఠశాలకు వెళ్తూ అప్పుడప్పుడూ అమ్మతో కలిసి తేయాకు తోటల్లో పనికి వెళ్లేది. చిన్నప్పుడు ఫుట్‌బాల్ ఆట ఇష్టం. నాలుగో తరగతిలో ఆమె వేగం గమనించిన పాఠశాల కోచ్ సకంత అథ్లెటిక్స్‌లోకి తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో బూట్లు కొనుక్కునే స్తోమత లేక చెప్పులు కూడా లేకుండానే ఆడేది. నాలుగు కి.మి. దూరంలో ఉన్న స్టేడియానికి నడిచి వెళ్లేది. స్వప్న తొలిసారి పోటీలో నెగ్గినప్పుడు బహుమతిగా వచ్చిన రూ. 500 అమ్మకు ఇచ్చేసింది. తన కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆటలే మార్గమని భావించింది.
స్వప్న తండ్రి రిక్షా తొక్కడం వల్ల అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్సకు ఖర్చులు భారంగా మారినా ఆటలను విడిచి పెట్టలేదు. ఆమె ప్రతిభ ఆధారంగా 2016లో రూ. 1,50,000 స్కాలర్ షిప్ మంజూరయ్యింది. 2017లో న్యూఢిల్లీలో, భువనేశ్వర్‌లో జరిగిన హెప్టాథ్లాన్ విభాగంలో ఫెడరేషన్ కప్ చాంఫియన్ షిప్ సాధించింది. స్వప్నను బాధించిన సమస్యల్లో తన పాదాలలో ఆరోవేలి వేదన ముఖ్యమైంది. ఐతే పుట్టుకతో వచ్చిన అదనపు వేళ్లు ఆమె ఆటకు ఇబ్బంది కల్గించాయి. బూట్లు తొడుక్కుని పరుగెత్తితే చాలా నొప్పి ఉండేది. డిజైనర్ బూట్లు కొనుక్కునే స్తోమత వచ్చాక కూడా, నొప్పితోనే గెలవాలనే పట్టుదల వస్తుందని నమ్మింది. గతేడాది చీలమండ గాయమైంది. వెన్నునొప్పి కూడా, వీటివల్ల ఏడాది పాటు ట్రాక్‌కు దూరమయ్యింది. అందుకోసం ప్రతినెల ఇంజక్షన్ తీసుకుంటోంది. ఛాక్లెట్ల్లు తినడం వల్ల పంటి నొప్పి.

వీటన్నింటికి చికిత్స తీసుకున్నా.. ఆసియా క్రీడల సందర్భంలో మళ్లీ వచ్చాయి. అయినా పట్టు సడలకుండా దవడపై పట్టి వేసుకుని బరిలోకి దిగింది. బాధ భరిస్తూనే పోటీలో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఈ బాధలేవి ఆమె విజయాన్ని ఆపలేకపోయాయి. ఆసియా క్రీడల ‘హెప్టాథ్లాన్’ అంటే ఏడు ఈవెంట్లు కలిగిన ఆట. హైజంప్, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, షాట్‌పుట్, 100 మీ. పరుగు, 200 మీ పరుగు, 800 మీ పరుగు. ఈ ఏడు ఈవెంట్లను అవలీలగా నెగ్గింది. కనీవినీ ఎరుగని రీతిలో 6000 పాయింట్ల మైలురాయి దాటేసి భారత్‌కు తొలి పసిడి తీసుకొచ్చింది. ఆసియా క్రీడలలో తొలిసారి స్వర్ణం సాధించిన స్వప్న బర్మన్ ఆటలలో పోరాట యోధురాలు. ఈ స్వర్ణ విజేత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం ప్రభుత్వం కర్తవ్యంగా భావించాలి.

‘స్వర్ణ’ సరిత ఆసియా ‘గిరి’జన ముత్యం
ఇటీవల ఇండోనేసియాలోని జకర్తాలో జరిగిన ఆసియా క్రీడల మహిళల 4-x400 మీ. రిలే ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన సరితా గైక్వాడ్ భారతీయ రెండో గిరి పుత్రిక. ఇప్పటికే మహిళల హెప్టాథ్లాన్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి తొలి గిరిజన ఆసియాడ్ అథ్లెట్‌గా స్వప్న బర్మన్ రికార్డు కెక్కినది విదితమే. కనీస సౌకర్యాలకు నోచుకోని ఓ గిరిజన కుగ్రామం నుండి వచ్చిన నిరుపేద గిరిపుత్రిక సరిత అత్యున్నత వేదికపైకి చేరుకోవడానికి కొండంత ఆత్మ విశ్వాసంతో అలుపెరుగని పోరాటమే చేసింది. ఈ యేటి ఆసియా క్రీడలలో స్వర్ణ పతకం సాధించిన పరుగుల బంగారు కొండ సరితను ఆసియా ‘గిరి’ జన ముత్యం అనడం సముచితం.

సరితా గైక్వాడ్ జీవన నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆమె గుజరాత్‌లోని ప్రకృతి అందాల విరబోత ఐన డంగ్ జిల్లా కరాడి అంబా అనే కొండ ప్రాంతంలో జన్మించింది. కేవలం 45 కుటుంబాలే నివసించే ఆ కొండ కోనల్లోని గిరిజనులది మౌలిక వసతుల లేమితో కూడిన నిత్య జీవన పోరాటం. ఇంటర్‌నెట్ సంగతి అటుంచితే కరాడి అంబా గ్రామానికి బస్సు సౌకర్యం సుదూరమైన సరైన రోడ్డు కూడా లేదు.

ఈ స్థితి నుండి వెలుగులోకి వచ్చిన సరితతో ఫోన్‌లో మాట్లాడాలన్నా ఆమె ఫోన్ చేయాలన్నా సెల్ సిగ్నల్ కోసం కొండెక్కాల్సిందే. నలుగురు పిల్లలను పెంచడమే భారమైన సరిత తల్లిదండ్రులు లక్ష్మణ్ బాయ్, రేణూ గైక్వాడ్‌లు రెక్కాడితే డొక్కాడని వ్యవసాయ కూలీలు. అమ్మా నాన్నలు నిరక్షరాస్యులైన విపత్కర పరస్థితుల్లోనూ క్రీడల గురించి ఆమె ఆలోచించడం యాదృచ్ఛికమే. ఆర్థికంగా ఆమె అనేక అడ్డంకులు ఎదుర్కొన్నా తల్లిదండ్రుల ప్రోత్సాహమే ఈనాడు సరితను దేశానికి బంగారు కొండగా నిలిపిందన్నది నిస్సందేహం.

సరితను ఆసియాడ్ పసిడి పతాక విజేతగా నిలిపిన ఆమె క్రీడా స్ఫూర్తి వెనుక గిరిజన నిజ జీవన పరిస్థితులే ముఖ్య కారణంగా కన్పిస్తాయి. గుజరాత్ స్విట్జర్లాండ్‌గా పిలుచుకునే అందమైన ప్రదేశం డంగ్. డంగ్ పరిసరాల్లోని కరాడి అంబా లాంటి కొండల మధ్య నివసించే గిరిజనులది నిత్య జీవన పోరాటం. వర్షా కాలం వస్తే వారికి బాహ్య ప్రపంచం అంటే తెలియదు. స్వగ్రామంలో నీటి కొరత వల్ల తాగునీటి కోసం సరిత చిన్నప్పటి నుంచే కొండలు ఎక్కేది. పసి వయస్సులోనే కష్టాలను ఓర్చి నిలిచేది. ఇలా శారీరక, మానసిక దృఢత్వాన్ని పోగు చేసుకుంది. ఓసారి బంధువుల ఇంట్లో టివిలో ఆటల పోటీలు చూసి క్రీడలపై మక్కువ పెంచుకున్నది. పాఠశాల స్థాయిలో ఖోఖో ఆడేది. డిగ్రీలో ఆమె టాలెంట్‌ను గుర్తించిన కోచ్ అజిమోన్ అథ్లెటిక్స్ వైపు మళ్లించాడు. రన్నింగ్ మెళకువలు నేర్చుకున్నది. బూట్లు లేకుండానే పరుగు పందెంలో పాల్గొన్నది. కాని తన ఆర్థిక పరిస్థితిని చూస్తే తినడానికి సరైన తిండి, బూట్లు కూడా కొనలేని స్థితిలో కళాశాల యాజమాన్యం సరితకు అండగా నిలిచింది.
2012లో సరిత స్పోర్ట్ అధారిటీ శిక్షణా కార్యక్రమానికి ఎంపికైంది. తదుపరి 2014లో పటియాలాలోని జాతీయ శిబిరంలో అవకాశం దక్కించుకుంది. గుజరాత్ ప్రాధికార సంస్థ నిర్వహించిన 400 మీటర్ల పరుగు ట్రయల్స్‌లోని 1ని. 1సెకెను టైమింగ్‌ను నమోదు చేసుకొని గుజరాత్ క్రీడల అకాడమీలో ఆమె ప్రగతి సాధించింది. 2016లో జాతీయ అథ్లెటిక్స్ చాంఫియన్ షిప్‌లో రజతం సాధించింది. లక్నోలో జరిగిన ఓపెన్ అథ్లెటిక్స్ చాంఫియన్ సిప్‌లో 400 మీ.లో క్యాంసం, 400 మీ హార్డిల్స్‌లో రజితంతో మెరిసింది.

జాతీయ స్థాయిలో సత్తా చాటిన సరితకు కామన్వెల్త్ క్రీడలలో అవకాశం దక్కినా అపజయం పాలైంది. ఆ అపజయాన్ని విలువైన అనుభవంగా మార్చుకొని ఈ యేటి ఆసియా క్రీడలలో స్వర్ణ పతకంతో పునర్వైభవాన్ని తీసుకొచ్చింది. ‘డంగ్ ఎక్స్‌ప్రెస్’గా పేరు తెచ్చుకున్న సరితా గైక్వాడ్ ఇదే ప్రతిభతో త్వరలో టోక్యోలో జరుగబోయే ఒలింపిక్స్‌లో తన లక్షాన్ని చేరుకోవాలని ఆశిద్దాం.