Home తాజా వార్తలు రాష్ట్రంలో ముస్లింలకు స్వర్ణ యుగం

రాష్ట్రంలో ముస్లింలకు స్వర్ణ యుగం

Golden age for Muslims in the state

దేశంలో కెసిఆర్‌కు మించిన సెక్యులరిస్టు లేరు
ముస్లింలకు ముస్లిం సిఎంలకంటె ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు : ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
నిజాం కాలంలో కూడా ఇమామ్‌లు, మౌజంలకు గౌరవ వేతనం ఇవ్వలేదు : బాబా ఫసియుద్దీన్

మన తెలంగాణ/ హైదరాబాద్: దేశంలో సిఎం కెసిఆర్‌కు మించిన లౌకికవాది మరొకరు లేరని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. కాంగ్రెస్, టిడిపి కలిసి రాష్ట్రాన్ని సుమా రు ఆరవై ఏడు సంవత్సరాలు పాలించినప్పుడు జరగని ముస్లిం ల సంక్షేమం, అభివృద్ధి ప్రస్తుతం నాలుగున్నర ఏళ్ల టిఆర్‌ఎస్ పాలనలో కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలోని ముస్లింలంతా కెసిఆర్ పాలపై పూర్తి సంతృప్తితో ఉన్నారని చెప్పారు. తెలంగాణకు ముస్లిం సిఎం ఉన్నా చేయలేని పనులను కెసిఆర్ అమలు చేస్తున్నారన్నారు. అన్ని రంగాల్లో ముస్లిం ప్రజలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఇది తాను చెబుతున్న మాటలు కావని… ముస్లిం వర్గాల్లోని మతపెద్దలు చెబుతున్నవి అని ఆయన తెలిపారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ సోమవారం సచివాలయంలో ‘మన తెలంగాణ’ ప్రతినిధితో ముచ్చటించారు. కాం గ్రెస్, టిడిపి పాలనలో ముస్లింలకు ఒనగూరిన ప్రయోజనం అంటూ ఏమీ లేదన్నారు. సరైన విద్యా అవకాశాలను కూడా ప్రొత్సహించ లేదన్నారు.

ఆ రెండు పార్టీల హయంలో ముస్లీం కోసం కేవలం 12 రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పాయన్నారు. టిఆర్‌ఎస్ హయంలో కేవలం రెండేళ్ళలోనే 240 రెసిడెన్షియల్ పాఠశాలలను కెసిఆర్ మంజూరు చేశారన్నారు. ముస్లింలో ఉన్న పేదరికన్ని రూపుమాపాలంటే మంచి విద్యను అందించాలన్న లక్షంతో కెసిఆర్ విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని పేర్కొన్నారు. అలాగే విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు రూ. 20లక్షల ఆర్ధిక సహాయాన్ని సిఎం కెసిఆర్ అందిస్తున్నారన్నారు. అలాగే ప్రతి సంవత్సరం 100 మంది ముస్లిం విద్యార్ధులకు ఐఏఎస్, ఐపిఎస్ కోర్సుల్లో కూడా ఉచిత విద్యను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్సే అని డిప్యూటీ సిఎం తెలిపారు. గతంలో ప్రభుత్వ పథకాల్లో ముస్లింలకు చాలా తక్కువ మందికి ఇచ్చేవారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కెసిఆర్ పాలనలో ఈ పరిస్థితి ముస్లిం ప్రజలకు లేదన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో కర్పూ అనే పదమే ప్రస్తుతం వినబడడం లేదన్నారు.

టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫ్రెండ్లీ పోలీసు విధానం వల్ల ముస్లిం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఒక విధంగా చెప్పాలంటే నిజం ప్రభువుకంటే ఎక్కువ లౌకికవాదాన్ని కెసిఆర్ పాటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక గత ప్రభుత్వ హయంలో రేషన్ షాపుల్లో కేవలం పదహారు కేజీల బియ్యం మాత్రమే లభించేదని దీని వల్ల అధిక సంతానంగల ముస్లిం ప్రజలు రోజు మూడుపూటలా తిండి దొరకగడమే కష్టంగా ఉండేదన్నారు. కెసిఆర్ హయంలో ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి బియ్యం అందిస్తున్నారన్నారు. దీనివల్ల కొన్ని కుటుంబాలు ప్రతి నెల అరవై కిలోల బియ్యం తీసుకుంటున్న వారు కూడా ఉన్నారన్నారు. అలాగే మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్,మౌజన్‌లకు నెలకు రూ. 1500 జీతం ఉండగా ప్రస్తుతం రూ.5వేలకు పెంచారన్నారు.

మైనార్టీలకు పెద్దపీట : సలీం
మైనార్టీలకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్సీ, వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎండి సలీం అన్నారు. మైనార్టీలకు ప్రత్యేక సాం స్కృతిక భవనం కోసం స్థలం, నిధులు మంజూ రు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు.

ముస్లింలకు ప్రత్యేక గుర్తింపు : ఫారుక్
దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ముస్లింలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారని ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ అన్నారు. రాజకీయ, ఆర్ధిక, సామాజిక రంగాలలో రాణించే విధంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. పేద ముస్లిం మహిళల వివాహాల కోసం గత ప్రభుత్వాలు రూ.15వేలు ఇచ్చేవని, వాటిని రూ.25 వేలకు పెంచాలని అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి హరీష్‌రావుతో కలిసి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎన్నో సార్లు కోరామన్నారు. అయినప్పటికీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కెసిఆర్ సిఎంగా బాధ్యకలు చేపట్టిన వెంటనే షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి లక్షా నూటపదహారు రూపాయలను అందిస్తున్నారన్నారు.

నిజామే ఇవ్వలేదు : ఫసియుద్దీన్
ముస్లిం పాలకుడైన నిజాం కాలంలోనే ఇమామ్, మౌజామ్‌లకు గౌరవ వేతనం ఇచ్చిన చరిత్రలేదని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు. అగ్రస్థాయి మతగురువులు ఇప్పటి వరకు ఏ పార్టీ కార్యాలయానికి వెళ్ళలేదని, టిఆర్‌ఎస్ కార్యాలయానికి వచ్చి కెసిఆర్‌ను ఆశీర్వదించారన్నారు. దీంతో టిఆర్‌ఎస్ సెక్యూలర్ పార్టీగా రుజువైందన్నారు.