Home మన ఆరోగ్యం రంగు రంగుల దోశెలు

రంగు రంగుల దోశెలు

Healthy Variety Dosas

బీట్‌రూట్, క్యారెట్‌లాంటివి కూరగా చేసి వండిపెడితే, పిల్లలు ముఖం తిప్పుకుంటారు. వాటిని ఇలా దోసెల్లో కలిపి వెరైటీగా చేసి పెట్టండి. లొట్టలేసుకుంటూ తింటారు. కొందరైతే ఏ వంటనైనా కళ్లకు నచ్చితేనే తింటారు. రకరకాల రుచులతో, రంగులతో ఉన్న ఈ దోశెల్లో రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.

బీట్‌రూట్

కావాల్సినవి: మినపప్పు: 1 కప్పు, బియ్యం : 3 కప్పులు, బీట్‌రూట్ తురుము: 1 టీస్పూన్, నూనె: సరిపడా ఉప్పు: తగినంత
తయారీ: మినపప్పు, బియ్యం కడిగి ఆరుగంటలు నానబెట్టాలి. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు బీట్‌రూట్ తురుము, పచ్చిమిర్చి, అల్లం తరుగును మిక్సీలో వేసి, అందులో పావు కప్పు నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. దోశెపిండిలో బీట్‌రూట్ గుజ్జు వేసి బాగా కలపాలి. స్టౌ మీద పెనం పెట్టి, వేడయ్యాక పిండితో దోశెలు వేయాలి. పై నుంచి నూనె వేసి రెండు వైపులా కాల్చాలి.

ఓట్స్ మూంగ్‌దాల్

కావాల్సినవి: పెసరపప్పు(మూంగ్‌దాల్): 1 కప్పు, ఓట్స్: అరకప్పు, రైస్: పావు కప్పు, పచ్చిమిర్చి:2లేదా 3, ఉప్పు: తగినంత, పసుపు: చిటికెడు, జీలకర్ర: అర టీస్పూన్నూనె: తగినంత
తయారీ: ముందుగా పెసరపప్పుని తీసుకొని కడిగి నానబెట్టాలి. ఓట్స్, రైస్‌ను వేరువేరుగా ఆరుగంటలు నానబెట్టాలి. పెసరపప్పు, రైస్, ఓట్స్, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, పసుపు మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత స్టౌ మీద పెనం పెట్టి దోశెలు వేయాలి. పై నుంచి నూనె వేసి రెండు వైపులా కాల్చాలి.

చాక్లెట్

కావాల్సినవి: గోధుమపిండి: అరకప్పు,బియ్యంపిండి: అరకప్పు, కోకోపౌడర్: పావుకప్పు, వెనిల్లా ఎస్సెన్స్: 1టీస్పూన్, ఉప్పు: చిటికెడుపాలు: అరకప్పు, బటర్ : సరిపడా, అలంకరణకు: డార్క్ చాక్లెట్త, రుగు : 2 టేబుల్ స్పూన్లు, వైట్ చాక్లెట్ తరుగు: 2 టేబుల్ స్పూన్లు
తయారీ: బియ్యంపిండి, గోధుమపిండిని ఒక గిన్నెలో వేయాలి. అందులో చిటికెడు ఉప్పు, వెనిల్లా ఎస్సెన్స్, కోకోపౌడర్ వేసి బాగా కలపాలి. తర్వాత దాంట్లో పాలు, సరిపడా నీళ్లు పోసుకుంటూ దోశె పిండిలా కలపాలి. ఆ మిశ్రమాన్ని 15 లేదా 20 నిమిషాల పాటు నానబెట్టాలి. స్టౌ మీద పెనం పెట్టి దోశెలు వేయాలి. పై నుంచి కొద్దిగా బటర్ వేసి రెండు వైపులా కాల్చాలి. దోశెను ప్లేట్‌లోకి తీసి వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ తరుగుతో అలంకరించాలి.

క్యారెట్

కావాల్సినవి: బియ్యం: 1 కప్పు, ఉప్పుడు బియ్యం: పావు కప్పు, క్యారెట్ తురుము: ముప్పావు కప్పు, మిరియాలు : 1 స్పూన్, పెరుగు: అరకప్పు, జీలకర్ర: 1 టీస్పూన్, నూనె: 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత, టొమాటో తరుగు: పావు కప్పు, ఉల్లిగడ్డ తరుగు: పావు కప్పు
తయారీ: బియ్యం, ఉప్పుడు బియ్యం కలిపి అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత అందులో ఉన్న నీళ్లను వంపేసి, క్యారెట్ తురుము, మిరియాలు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి. అందులో పెరుగు, జీలకర్ర వేసి బాగా కలపాలి. స్టౌ మీద పెనం పెట్టి, వేడయ్యాక దోశెలు వేయాలి. పై నుంచి ఇరువైపులా కాల్చాలి. చివరగా టొమాటో తరుగు, ఉల్లిగడ్డ, క్యారెట్ తురుమును వేసి అలంకరించాలి.

సజ్జ దోశెలు


కావాల్సినవి: సజ్జలు: 1 కప్పు, మినపప్పు: అర కప్పు, బియ్యం: అర కప్పు, పచ్చిమిర్చి: 2 లేదా 3, జీలకర్ర: అర టీస్పూన్, ఉప్పు: తగినంత
తయారీ: సజ్జలు, మినపప్పు, బియ్యం కడిగి ఆరుగంటల పాటు నానబెట్టాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, నానబెట్టిన ఉంచిన బియ్యం మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత స్టౌ మీద పెనం పెట్టి దోశెలు వేయాలి. పై నుంచి నూనె వేసి రెండు వైపులా కాల్చాలి.

Good nutrition in Healthy Variety Dosas

Telangana Latest News