Home లైఫ్ స్టైల్ బొమ్మలాటతో భలే కథలు

బొమ్మలాటతో భలే కథలు

life
ఇప్పటి తరం చరిత్ర, సంస్కృతి గురించి అంతగా పట్టించుకోదు. క్లాసు పుస్తకాలు చదవడానికే తీరిక ఉండటం లేదు..ఇక హిస్టరీ, ఇతిహాసాలను చదివే ఓపిక ఎక్కడుంటుంది..ఎవరిని కదిలించినా వచ్చే సమాధానం ఇదే. కంప్యూటర్‌లాంటి టెక్నాలజీకి సంబంధించి అడిగితే మాత్రం టకీమని సమాధానం చెప్పేస్తారు.. కథలు చెప్పేందుకు ఇంట్లో పెద్దవాళ్లు లేకపోవడంలాంటి కారణాలు కావచ్చు. తోలుబొమ్మలాట కళ ద్వారా చిన్నారులకు సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తున్నారు పద్మిని. ఇటీవల బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ బొమ్మలాట ప్రదర్శనలో తన శిష్యబృందంతో కలిసి ప్రదర్శనలిచ్చి ప్రశంసలు అందుకున్నారు.

తమిళనాడుకు చెందిన పద్మిని తండ్రి రైల్వే ఉద్యోగి. ఉద్యోగరీత్యా కర్ణాటకలో స్థిరపడ్డారు. పద్మిని పెళ్లయిన తర్వాత తెలుగింటి ఆడపడుచుగా మారింది. చిన్నప్పుడు తండ్రి చెప్పే కథలను శ్రద్ధగా వినేది. అవే కథలను తన బాబుకు చెప్పేది. పిల్లాడికి బొమ్మలాట ద్వారా చెప్పవచ్చుకదా అన్న తండ్రి సలహా ఆమెను ఆలోచించేలా చేసింది. వస్త్రంతో చిన్న చిన్న బొమ్మలను కుట్టి వాటిని చేతికి తొడుక్కుని కథలు చెప్పడం ప్రారంభించింది. అంతే సాయంత్రం అయితే చాలు వాళ్లింటికి అపార్ట్‌మెంట్‌లోని పిల్లలంతా వచ్చి కథలు వినడం మొదలెట్టారు. అలా స్కూల్లో కూడా ఒక పీరియడ్ కథలు చెప్పాల్సిందిగా ఆమెకు ఆఫర్ వచ్చింది. అప్పటికే రామకృష్ణ మఠంలో ఇంగ్లీషు తరగతులు చెప్తుండేది. అక్కడ కూడా బొమ్మలతో బోధించేది.
బొమ్మలాట అనగానే చాలామందికి తోలుబొమ్మలాట గుర్తుకొస్తుంది. భారత్‌లో పుట్టిన ఈ కళ ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఇప్పటికీ థియేటర్ ఆర్ట్‌గా అభివృద్ధి వెలుగొందుతోంది. అక్కడ వీధుల్లో పెద్ద పెద్ద చెక్కబొమ్మలతో ప్రదర్శనలిస్తారు. అంత బరువున్న వాటితో వారు చక్కగా ఆడిస్తారు. ఇవన్నీ తెలసుకున్న నాకు ఆసక్తి పెరిగిందని అంటోంది పద్మిని. ఫలితంగా 2012లో తోలుబొమ్మలాట మీద పరిశోధన మొదలుపెట్టింది. ఈ పరిశోధన జనగాంతో ప్రారంభమైంది. అక్కడ మోతే అనే ఇంటిపేరుతో ఉన్న కుటుంబీకులు బొమ్మలాట ఆడుతున్నట్లు తెలుసుకుంది. వాళ్లలో ఓ కుటుంబం వరంగల్లు దగ్గర బూరుగుపేటలో, మరొకటి అమ్మాపురంలో స్థిరపడ్డాయి. మోతే జగన్నాథం తోలుబొమ్మలాట కళకు ప్రాణం పోశాడు. మొదట్లో చాలా కథలను వీరు ప్రదర్శించేవారు. ఇప్పుడు ఇక్కడి కళాకారులంతా 70 ఏళ్లు పైబడినవారే ఉన్నారు. ఒకప్పుడు ఆ బృందం ప్రదర్శించిన 16 కథల్లో నాలుగు మాత్రమే మిగిలాయి. వాటిలో లవకుశ, చెంచులక్ష్మి , బాలనాగమ్మ, సారంగధర ఉన్నాయి. 300 ఏళ్లనాటి చెక్క బొమ్మలు వారి దగ్గర ఉన్నట్లు ఆమె చెబుతోంది. కొత్త తరాలు ఈ వృత్తిలోకి రావడం మానేశాయి. దీంతో ఈ కళ అంతరించిపోయే దశకు చేరింది. ఇలా వీటిపై పరిశోధన కొనసాగిస్తోంది పద్మిని. కళ అంతరించి పోకూడదని, ఆసక్తి ఉన్నవారికి తోలుబొమ్మలాటను నేర్పించాలనుకుంది. ఇందుకోసం స్ఫూర్తి థియేటర్ ఆర్ట్ అనే పేరుతో ఒక సంస్థను ప్రారంభించింది. లా మకాన్, అవర్ సెక్రెడ్ స్పేస్‌లాంటి చోట్ల పిల్లలకు బొమ్మలతో అవగాహన కల్పిస్తున్నారు. పేపర్ మెషే ఆర్ట్‌తో బొమ్మలను తయారుచేసి వాటితో అనేక స్కూళ్లు, తదితర ప్రాంతాల్లో ప్రదర్శిస్తోంది. పద్మినితోపాటు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం విద్యార్థులు జతకలిశారు. పద్మిని శ్రమకు గుర్తింపుగా టాటా ఫెలోషిప్ ఫోక్‌లోర్, ఖుషీ టీవీ అవార్డు, అమరావతి అవార్డులు వరించాయి.