Home జాతీయ వార్తలు మహాద్దతు ధరలు

మహాద్దతు ధరలు

modi

 వరి, ఇతర ఖరీఫ్ పంటలకు సాగు ఖర్చు కంటె ఒకటిన్నర రెట్లు ఎక్కువగా మద్దతు ధరలు 

వచ్చే వారం కేబినెట్‌లో ఆమోదం : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : వరితో పాటు ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పి) సాగు వ్యయం కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ మేరకు వచ్చే వారం జరిగే కేంద్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం తెలిపారు. చెరకుకు మద్దతు ధరలను సముచిత గిట్టుబాటు ధరలు (ఎఫ్‌ఆర్‌పి)గా వ్యవహరిస్తారు. వీటిని వచ్చే రెండు వారాలలో ప్రకటిస్తారు. ఇది 201718తో పోలిస్తే అధికంగా ఉంటుందని ప్రధాని వివరించారు. చెరకు అధికంగా పండించే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరాఖండ్, పంజాబ్‌కు చెందిన రైతులతో ప్రధాని ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప్రధాని వారికి భరోసా కల్పించారు. 140 మంది రైతులతో ప్రధాని ముచ్చటించారు. గత పది రోజులలో ప్రధాని మోడీ రైతులతో నేరుగా మాట్లాడటం ఇది రెండోసారి. చెరకు రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రధాని తెలిపారు. చెరకు పంటకు, చక్కెర రంగానికి రూ 8500 కోట్ల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు, ఇతర పలు విధాల చేయూతలను కూడా ప్రకటించనున్నట్లు ప్రధాని వారికి చెప్పారు. ఎన్నికల కాలం ముంచుకువస్తుండటంతో కేంద్ర ప్రభు త్వం వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారానికి ఇటీవలి కాలంలో పలు చర్యలకు దిగుతోంది. ఇందులో భాగంగానే రైతులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. రైతులకు అత్యధిక కనీస మద్దతు ధరల గురించి వచ్చే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం ఉంటుందని ప్రధాని కార్యాలయం కూడా తెలిపింది. రైతుల సాగు వ్యయం కన్నా ఇది ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. అధిక మద్దతు ధరలతో రైతాంగం ఆదాయం గణనీయంగా పెరిగేందుకు వీలేర్పడుతుందని, అక్టోబర్ సెప్టెంబర్ షుగర్ సీజన్‌లో చెరకుకు ఎఫ్‌ఆర్‌పిని వచ్చే రెండు వారాలలో ప్రకటిస్తారని తెలిపారు. ఇక చెరకు దిగుబడి తొమ్మిదిన్నర శాతాన్ని మించిన రైతులకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తారు. 201718 సంవత్సరానికి చెరకు క్వింటాలుకు రూ 255 గా ఉంది. అయితే వచ్చే సీజన్‌కు దీనిని క్వింటాల్‌కు 20 శాతం చొప్పున పెంచాలని ప్రభుత్వ పరిధిలోని వ్యవసాయ సలహా మండలి (సిఎసిపి) సిఫార్సు చేసింది. చెరకు రైతుల బకాయిల బెడద తీర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. గత పది పదిహేను రోజులలోనే రూ 4వేల కోట్ల రైతుల బకాయిలు చెల్లించినట్లు, తాము తీసుకున్న నూతన విధానం ఫలితంగానే ఇది సాధ్యం అయిందని వివరించా రు. జూన్ 1 నాటికి చెరకు రైతుల బకాయిలు రై 22,654 కోట్లుగా ఉంది. ఇది ఇప్పుడు రూ 19,816 కోట్లకు తగ్గిందని అధికారిక గణాంకాలలో తెలిపారు.
నూతన సాగు విధానాలతో మేలు : మోడీ
రైతాంగం ఆదాయం పెంచుకునేందుకు నూతన సాంకేతిక విధానాలను వినియోగించుకోవాలని మోడీ సూచించారు. స్ప్రింక్లర్లు, బిందు సేద్యం , ఆధునిక సాంకేతిక పద్ధతులను వాడుకోవాలి. సోలార్ పంపులు, వ్యవసాయ క్షేత్రాలలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 2022 నాటికి కనీసం పదిశాతం రసాయనిక ఎరువుల వాడక తగ్గింపు లక్షం పెట్టుకున్నట్లు, ఇందుకు విలువ ఆధారిత పంటలు, వ్యవసాయ వ్యర్థాల సముచిత వినియోగం వంటి చర్యలు మేలని సూచించారు.
చక్కెర పరిశ్రమకు సుస్థిరతను కల్పించేందుకు దీర్ఘకాలిక పరిష్కార మార్గాలను ప్రభుత్వం ఎంచుకుందని ప్రధాని తెలిపారు. ఇందులో భాగంగా పెట్రోలులో పదిశాతం ఇథనాల్ మిళితం చర్యను తలపెట్టినట్లు వెల్లడించారు. ఇది చక్కెర పరిశ్రమకు దోహదం చేస్తుందని వివరించారు.