Home వరంగల్ వైద్యారోగ్యశాఖలో ‘రింగన పురుగులు’

వైద్యారోగ్యశాఖలో ‘రింగన పురుగులు’

Goverment Doctors Not Attend Thier Duty In Hospital

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : వైద్యారోగ్య శాఖలో ‘రింగన పురుగుల’ సంఖ్య పెరుగుతోంది. విధులకు డుమ్మా కొట్టడం, నగరంలోనే తిష్టవేసి ఉండటం సర్వసాధరణంగా మారింది. ఓ పక్క ప్రభుత్వ వైద్య సేవలను పట్టిష్టం చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుంటే మరో పక్క ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ లక్షానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారు. వైద్యారోగ్యశాఖలో కాస్త పలుకుబడి ఉంటే చాలు ఇక ఉద్యోగ విధులు సక్రమంగా నిర్వర్తించకపోయినా ఫర్వాలేదు అన్నట్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరిస్థితి నెలకొనటం గమనార్హం. జిల్లాల పునర్విభజన అనంతరం ఉద్యోగుల స్థాన చలనాలు కూ డా క్రమంగా మారిన విషయం విదితమే. అయితే అప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా నగరంలో నివాసముండే ఉద్యోగులు ఉమ్మడి జిల్లాలోని భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, వరంగల్ రూరల్ జిల్లాలలోని వైద్యారోగ్యశాఖ విభాగాలకు స్థాన చలనం జరిగింది. కానీ నేటికీ పలువురు ఉద్యోగులు తమతమ పలుకుబడిని ఉపయోగించుకొని కేటాయించబడిన సెంటర్లలో విధులు నిర్వహించడంలో నిర్లక్షం గా వ్యవహరించటం సర్వసాధరణంగా మారింది.
విధులు డుమ్మా…నగరంలోనే తిష్ట…
కొంత మంది ఉద్యోగులు నగరంలోనే తిష్టవేసి తమను కదిలించే వారే లేరన్నట్లుగా విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించటం గమనార్హం. నేటికీ వరంగల్ నగరంలోనే నివాసముంటూ చుట్టపు చూపుగా కేటాయించిన సెంటర్లకు వెళ్లివస్తున్నారు. భూపాలపల్లి జిల్లా లాంటి చోట ఏజెన్సీ పిహెచ్‌సిలలో విధులు నిర్వహించే ఉద్యోగులైతే వారాల తరబడి విధులకు ఎగనామం పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. నగరంలోనే ఉంటూ వైద్యారోగ్యశాఖలోని పైస్థాయి అధికారులతో సత్సంబంధాలు నేరుపుతూ విధులను నిర్లక్షం చేస్తున్నారని, బిల్లులు చేసేటప్పుడు…లేదా అవసరమైన సందర్భాలలోనే పిహెచ్‌సిలకు వెళ్లటం గమనార్హం. వైద్యారోగ్యశాఖలోని ప్రతి అంగుళం తెలిసిన ఉద్యోగులు చాలా చాకచక్యంగా తమ పని తాము చేసుకుంటూ ఉద్యోగ విధులు సక్రమంగానే నిర్వహస్తున్నట్లు చూపటం కొందరు ఉద్యోగులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందడంలో సందేహం లేదు. ఇక ములుగు ఏజెన్సీ మండలాలోనూ, మమబూబాబాద్ ప్రాంతంలోనూ ఇదే తంతు కొనసాగుతుందనే పలు చోట్ల, పటు పిహెచ్‌సిలలో కొనసాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తతంగమంతా జిల్లా స్థాయి అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు ఉంటున్నారని, దీంతో ఉద్యోగులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా విధులను నిర్లక్షంగా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాస్త పలుకుబడి ఉంటే చాలు…కదిలించే వారే లేరు…!
వైద్యారోగ్యశాఖలోని కొంత మంది ఉద్యోగులు తమ పలుకుబడిని ఉపయోగించుకోని వారాల తరబడి విధులకు డుమ్మా కొట్టడం, తమ స్వంత పనులలో నిమగ్నమవడం పరిపాటిగా మారింది. నిత్యం నగరంలోనే ఉంటూ తమ స్వంత పనులను చేసుకుంటూనే జిల్లా స్థాయి అధికారులతో నిత్యం సంబంధాలు నెరుపుతూ లాజిక్కుగా వ్యవహరిస్తున్నారు. అయితే నిత్యం పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం చూసిచూడనట్లుగా వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా పిహెచ్‌సీలలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారా…లేదా అనే పర్యవేక్షణ లేకుండా ఉండటం విమర్శలకు తావిస్తోంది.
పైరవీలలోనూ ఘనులే…
శాఖలో పైరవీలు కొనసాగించడంలోనూ ఈ ఘనులు నిష్ణాతులే కావడం గమనార్హం. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వైద్యారోగ్యశాఖ కార్యాలయం కేంద్రంగా పలువురు తమ పలుకుబడిని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. నగరానికి సుదూర ప్రాంతంగా ఉండే పిహెచ్‌సిలలో విధులు నిర్వహించే ఉద్యోగులు సైతం ఆయా జిల్లా అధికారులతో పాటు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంగా రాయబారాలు నడుపడం జరుగుతుందని, దీంతో ఉద్యోగులు ఆయా పిహెచ్‌సిలలో సక్రమంగా విధులు నిర్వహించకపోయినా జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోకుండా ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బదిలీలు, ఖాళీ పోస్టుల భర్తీ సందర్భాలలో కాస్త పలుకుబడి కలిగి సూపర్‌వైజర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిసెంట్ లాంటి క్యాడర్ కలిగిన ఉద్యోగులు పైరవీలు చేయడం తమకు లనుకూలంగా ఉండే ఉద్యోగులను అనుకూలమైన పిహెచ్‌సీలకు బదిలీ చేయించుకోవడం, లేదా ఖాళీలలో భర్తీ చేయించుకోవడం తత్వారా ప్రయోజనం పొందటంపై ఎక్కువగా దృష్టిసారించడం గమనార్హం.
చోద్యం చూస్తున్న అధికారులు… వైద్యారోగ్యశాఖలో విధుల పట్ల నిర్లక్షం చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉద్యోగుల పట్ల జిల్లా స్థాయి అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలోనే ఉంటూ భూపాలపల్లి జిల్లాలోని పిహెచ్‌సిలలో విధులు నిర్వహించే ఉద్యోగులుండటం గమనార్హం. ములుగు ప్రాంతంలోని ఎజెన్సీలలోని పిహెచ్‌సిలలోనూ ఉద్యోగులు చుట్టపు చూపుగానే వెళ్లివస్తున్నారనే వాదనలున్నాయి. ఇక మహబూబాబాద్, జనగామ జిల్లాలోని పిహెచ్‌సిలలో విధులు నిర్వహించే ఉద్యోగులు సైతం కొంత మంది గుట్టుచప్పుడు కాకుండా మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిత్యం పిహెచ్‌సీల పని విధానాన్ని ఉద్యోగుల పని తీరును పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా ఉంటున్నారని, ఇప్పటి కైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవస రముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.