Home రాష్ట్ర వార్తలు జల దగా

జల దగా

  • సమైక్య రాష్ట్రంలో 174 టిఎంసిలు కోల్పోయిన తెలంగాణ
  • కెసి ఆయకట్టు 85 వేల నుంచి 2.45 లక్షల ఎకరాలకు పెంచారు
  • ఆర్‌డిఎస్ కింద రాష్ట్రంలో 2 లక్షల ఎకరాలకు నీరు రావలసి ఉండగా, ఏడో వంతుకు కూడా అందడం లేదు
  • నాగార్జున సాగర్ ఎడమ కాలువ కిందా అన్యాయమే
  • కృష్ణ డెల్టాలో మూడు రెట్లు అదనంగా ఎపి వాడుకుంటోంది
  • పోలవరం, పట్టిసీమలలో 78 టిఎంసిలు రావాలి
  • ఉమ్మడి జాబితాలో జూరాలను చేర్చడం అన్యాయం
  • 174 టిఎంసిల నికర జలాలు కోల్పోయాం
  • బజాజ్ కమిటీ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం వాదన

Water-Board-Telanganaహైదరాబాద్: ఎగువ రాష్ట్రాల వాటా కింద పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నుండి తెలంగాణకు 78 టిఎంసిల నీరు రావా లని ఎ.కె.బజాజ్ కమిటీ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపించింది. ఉభయ రాష్ట్రాలతో చర్చించనున్న ఈ కమిటీ సోమ వారం తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల నిర్వహణ వివాదాలపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం నియమిం చిన ఆ కమిటీ ముందు రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కె. జోషి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోల వరం, పట్టిసీమలలో తెలంగాణ వాటా తేల్చా లని వాదించింది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ఎపి ప్రభుత్వం గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లిస్తున్నందున గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ఆధారంగా రెండు రాష్ట్రాల మధ్య ఆ నీటిని పంపిణీ చేయాలని కోరింది. పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా నదికి తరలిస్తున్న 80 టిఎంసిల గోదావరి జలాల్లో 45 టిఎంసిలను ట్రిబ్యునల్ ఉమ్మడి ఎపికి కేటా యించిందని, అయితే వీటిని నాగార్జునసాగర్ ఎగువన ఉన్న ప్రాంతాల లో రెండు రాష్ట్రాలలోనూ సాగుయోగ్య భూమి ఎంత ఉన్నదో లెక్కగట్టి నీటిని పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ సం వత్సరం పట్టిసీమ ప్రాజెక్టు నుంచి 53 టిఎంసిల గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్ధారించినందున ఇందులోనూ తెలంగాణ వాటా ఖరారు చేయాలని, పట్టిసీమలోనూ న్యాయబద్ధమైన నీటి పంపిణీ జరగాలని పేర్కొంది.

174 టిఎంసిల నికర జలాలు కోల్పోయాం
తమకు న్యాయంగా రావాల్సిన 174 టిఎంసిల నికర జలాలను సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కోల్పోయిందని, కెసి కెనాల్‌లో 85 వేల ఎకరాల వాస్తవ ఆయకట్టు ఉంటే అది 2.45 లక్షల ఎకరాలకు పెరిగిందని, ఇదే సమయంలో రాజోలి బండ డైవర్షన్ స్కీం(ఆర్‌డిఎస్) కింద 2 లక్షల ఎకరాలకు నీరు రావాల్సి ఉండగా 30 వేల ఎకరాలకు కూడా నీరు రావ డం లేదని కమిటీకి తెలియజేశారు. సాగర్ కుడి, ఎడమ కాల్వలక్రింద ఆంధ్రప్రదేశ్‌లో 4 లక్షల ఎకరాలకు అదనంగా నీరు ఇచ్చుకుంటున్నారని, సాగర్ ఎడమ కాల్వ క్రింద తెలంగాణలో 6.6 లక్షల వాస్తవ ఆయకట్టు ఉండగా ఏనాడు 5 లక్షల ఎకరాలకు మించి నీరు రాలేదని, కృష్ణా డెల్టాలో తాగు, సాగు నీటి అవసరాలకు 70 నుంచి 80 టిఎంసిలు సరిపోతు న్నప్పటికీ 200 టిఎంసిలకు మించి వినియోగించుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదించింది. ఇంతకు ముందు చేపట్టిన సాగునీటి పథకాలన్నింటిని యధాతథంగా అమలు చేయాలని ఎపి పునర్విభజన చట్టంలో ఉన్నా ఇష్టానుసారంగా ప్రాజెక్టుల రూపకల్పన జరిగిందని కమి టీ దృష్టికి తెచ్చింది. ఉమ్మడి ప్రాజెక్టుల జాబితాలో జూరాల ప్రాజెక్టును చేర్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. పులిచింతల, సుంకేశులను ఉమ్మడి జాబితాలో చేర్చాలని కోరింది.

తెలంగాణను ఉమ్మడి ఏపి పట్టించుకోలేదు
రెండు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని కృష్ణా బోర్డుకు సరైన విధి విధానా లను రూపొందించాలని , కృష్ణా బేసిన్‌లో గతంలో రూపొందించిన ఎగువ కృష్ణా, బీమా, తుంగభద్ర ప్రాజెక్టుల ట్రిబ్యునళ్ల ముందు తెలంగాణ ప్రయో జనాల కోసం ఉమ్మడి ఎపి సర్కారు సమర్థంగా వాదించలేదని ప్రభుత్వం విమర్శించింది. ‘పరీవాహక ప్రాంతం, సాగుయోగ్య భూములు, పేదరికం, వెనుకబాటుతనం, జనాభా తదితర అంశాలలో ఏ ప్రాతిపదికన, ఏ ప్ర మాణాలతో చూసినా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టిఎంసిలలో తెలంగాణకు 450 టిఎంసిలు రావాలి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి మూడు సంవత్సరాలు కావస్తున్నా కృష్ణాలో తెలంగాణ వాటా తేలలేదు. 299: 512 టిఎంసిల నిష్పత్తి ప్రకారం 2015లో రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలిక పరస్పర అంగీకారం కుదిరింది. దీని ప్రకారం కృష్ణా ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్‌ను రూపొందించాలని ’ ప్రభుత్వం బజాజ్ కమి టీని కోరింది. ఎకె బజాజ్ కమిటీ ఛైర్మన్, కేంద్ర జలవనరుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎ.కె.బజాజ్, సభ్యులు డి.కె.మెహతా (కేంద్ర జలవనరుల సంఘం మాజీ సి.ఇ) రూర్కీకి చెందిన ఎన్‌ఐహెచ్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.పి.పాండే, సిఇఎ సి.ఇ ప్రదీప్ కుమార్ శుక్లా, సిడబ్లూసి హైడ్రాలజీ డైరెక్టర్ ఎన్‌ఎన్ రాయ్, కెఆర్‌ఎంబి ఛైర్మన్ ఎస్.కె.హల్దర్, సభ్య కార్యదర్శి డాక్టర్ సమీర్ ఛటర్జీ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున నీటి పారుదల సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, ఇఎన్‌సి మురళీధర్‌రావు, సిఇలు ఖగేందర్‌రావు, సునీల్, ఒఎస్‌డి శ్రీధర్ దేశ్‌పాండే, అంతర్రాష్ట్ర నీటి వనరుల అధికారులు హాజరయ్యారు.

బుధవారం వరకు పర్యటన
ఐదుగురు సభ్యులతో కూడిన బజాజ్ కమిటీ బృందం బుధవారం వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్వహణ, ఆపరేషనల్ ప్రొసీజర్స్, గోదావరి నుంచి పోలవరం, పట్టిసీమ ద్వారా మళ్లిస్తోన్న కృష్ణా జలాల అంశాలను పరిశీలించనుంది.

సమాచారం ఇవ్వడానికి సిద్ధం
బజాజ్ కమిటీ తమ సమస్యను సానుభూతితో పరిశీలించాలని కోరినట్లు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ నీటిపారుదల రంగ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు తెలిపారు. బజాజ్ కమిటీ ఎటువంటి సమాచారం కోరినా అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.