Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

బిల్ట్ కంపెనీ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు

Government actions to rebuild the belt company

వారం రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించనున్న యాజమాన్యం
ఖాయిలాపడ్డ పరిశ్రమలు తెరిపించడమే ప్రభుత్వ లక్షం 

మన తెలంగాణ/వరంగల్ అర్బన్: ఖాయిలాపడ్డ కమలాపురం రేయాన్స్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ప్రభుత్వం నడుం బిగించింది. గత ఏడు నెలల నుంచి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన శాఖా మంత్రి అజ్మీరా చందులాల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌తో కలిసి ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహకారాన్ని అందిస్తామంటూ వరుస సమీక్షలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని ఉపముఖ్యమంత్రి చాంబర్‌లో బిల్ట్ కంపెనీ డైరెక్టర్ హరిహరన్‌తో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. బిల్ట్ కంపెనీలో 650 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో కొంత శాతం కార్మికులు పదవీ విరమణకు సిద్ధంగా ఉన్నారు. వాటితో పాటు జీతాల పెరుగుదల, పెండింగ్ జీతాలపై కార్మికులు కార్మికశాఖ అధికారులకు డిసెంబర్-2017లో ఫిర్యాదు చేశారు. దానిపై కంపెనీ యాజమాన్యానికి లేబర్‌శాఖ నుంచి నోటీసులు కూడా అందాయి. ఈ అం శాలపై మార్చి, జూన్, జులై మాసాల్లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కార్మికుల జీతభత్యాలు, వారి సంక్షేమం, పదవీ విరమణకు సంబంధించిన అంశాలపై వరుస సమీక్షలతో సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతూ వస్తున్నారు. ప్రధానంగా బిల్ట్ కంపెనీ మూతపడి ఉన్నందున దాని మనుగడకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం కావాలి, ఎంత మేరకు నిధులు కేటాయించాలనే దానిపై కంపెనీ డైరెక్టర్ హరిహరన్‌తో చర్చలు జరిపారు. ప్రభుత్వ పరంగా ఖాయిలాపడ్డ పరిశ్రమను తెరిపించాలనేది ప్రభుత్వ లక్షమని, దానికి కంపెనీ యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించాలని అందుకు తగిన ప్రతిపాదనలు వారం రోజుల్లో సమర్పించాలని ఉపముఖ్యమంత్రి కోరారు. అందుకు కంపెనీ డైరెక్టర్ హరిహరన్, ప్రభుత్వం ఖాయిలాపడ్డ పరిశ్రమను తెరిపించడానికి మెట్టు దిగి చర్చలు జరపడం సమంజసంగా ఉందని పేర్కొంటూ వారం రోజుల్లో కంపెనీ నుంచి తగిన ప్రతిపాదనలను అందిస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరెన్నిక కలిగిన అజాంజాహి మిల్లుతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీ(బిల్ట్) పరిశ్రమ కూడా మూతపడ్డాయి. సమైక్యాంధ్రలో వాటికి సంబంధించిన ఆస్తులను వేలం వేసిన గత ప్రభుత్వాలు కార్మికుల యోగ క్షేమాలు, ఉపాధి అవకాశాలను ఆలోచించకుండా అమ్మేసారు. తెలంగాణ ప్రభుత్వంలో అజాంజాహి మిల్లుకు బదులుగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి రూరల్ జిల్లాలోని  సంగెం మండలం, చింతలపల్లి ప్రాంతంలో పరిశ్రమను ఏర్పాటు చేయడానికి గత సంవత్సరం ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీకారం చుట్టారు. ఆ పనులు గత సంవత్సరం నుంచి ఊపందుకున్నాయి. భూసేకరణతో పాటు పరిశ్రమల నిర్మాణం, రోడ్లు, తదితర కార్యక్రమాలు ఊపందుకున్నాయి. మరుగున పడిపోతదనుకున్న అజాంజాహికి బదులు టెక్స్‌టైల్ పార్క్ తెలంగాణ ప్రభుత్వంలో రావడం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తలెత్తుకునేటట్లు చేసింది. ప్రస్తుతం మరో మూత పడ్డ పరిశ్రమ రేయాన్స్ ఫ్యాక్టరీని కూడా తెలంగాణ ప్రభుత్వం తెరిపించడానికి ఉపముఖ్యమంత్రి స్వయంగా కంకణం కట్టుకోవడం విశేషం. ప్రభుత్వ పరంగా ఖాయిలాపడ్డ పరిశ్రమను ఆదుకోవడానికి ముందుకు రావడంతో పరిశ్రమ యాజమాన్యం కూడా అందుకు అంగీకారం తెలిపింది. వారం రోజుల్లో యాజమాన్యం నుంచి తగిన ప్రతిపాదనలు సమర్పిస్తే ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలు ఊపందుకుని పరిశ్రమ మనుగడకు దారి తీస్తుంది. దీనిపై ప్రధానంగా భూపాలపల్లి జిల్లాలోని ప్రజలతో పాటు ఖమ్మం జిల్లా ప్రజలు కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిశ్రమ మనుగడలోకి వచ్చినట్లయితే దానికి సంబంధించిన ముడి సరుకు ఉత్పత్తి కూడా ఈ ప్రాంత రైతులే ఎక్కువగా సప్లై చేస్తున్నందున నిరుద్యోగ యువత, రైతులు, వ్యాపారులకు కూడా ఉపాధి అవకాశాలు మెండుగా  పెరిగే అవకాశాలు లేకపోలేదు.

Comments

comments